* రెండో డోసు కోసం ఎదురు చూపులు
* వినియోగం, సరఫరాలో వ్యత్యాసం
* టీకాలు అమలులో ఒడిదుడుకులు

శంఖవరం, 29 ఏప్రిల్ 2021.
—————————————-
తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కరోనా గురించి ప్రజల్లో ఆసక్తి, అవగాహన బాగా పెరిగింది. దీంతో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించు కోవాలని, టీకాలను వేసుకోవాలనే బలమైన కోరిక ప్రతీ ఒక్కరిలోనూ ఏర్పడింది. దీంతో ఈ రెండింటికీ
డిమాండ్‌ పెరుగు తున్నది. 45 సంవత్సరాలు వయస్సు పైబడిన వారందరికీ ఈనెల ఒకటవ తేదీ నుంచి టీకా మందు వేసే ప్రక్రి యను వార్డు, సచివాలయాలు, గ్రామ స్థాయికి కూడా విస్తరించడంతో టీకాలకు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. అంతర్జాతీయంగా ఖ్యాతి వస్తుందని దేశీయ టీకాలను వ్యాక్సిన్‌ డిప్లమసీ పేరుతో విదేశాలకు కేంద్రం పంపింది. ఈలోగా దేశంలో టీకాల కొరత సహజంగానే రానే వచ్చింది. ఫలితంగా ఒక డోసు తీసుకున్న వారికి రెండో డోసు అందుతుందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది.

జిల్లాలో ప్రతీ రోజూ అక్కడక్కడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు అంతంత మాత్రంగా జరుగు తున్నాయి. ఈ పరీక్షలు నిరంతర ప్రక్రియగా నిరవధికంగా మాత్రం కొనసాగడం లేదు. అంతే కాదు… పరీక్షలు జరుగుతున్న విషయం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు పట్టణ ప్రాంతాల్లో సైతం వార్డు క్షేత్ర స్థాయికి చేరటం లేదు. ఫలితంగా నిజంగా కరోనా లక్షణాలు ఉన్న వారికే ముందుగా జరగాల్సిన ఈ నిర్ధారణ పరీక్షలు కాస్తంత అవగాహన ఎక్కువగా ఉన్న అనర్హులు, స్థితిమంతులూ ముందు వరుసలో ఉండి చేయించు కుంటున్నారు. ఇక టీకాల విషయానికి వస్తే జిల్లాలో గురువారం నాటికి కూడా అందుబాటులో లేనే లేవు. టీకాలు వేసుకోవాల్సిన అవసరతకూ, టీకాల సరఫరాకు మధ్య అందుకోలేనంత వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, క్షేత్ర స్థాయిలో టీకా మందు సరఫరా, వినియోగం,
నిల్వలపై రోజు వారీ సమాచారాన్ని ఇ –విన్‌ (ఎలకా్ట్రనిక్‌ వ్యాక్సిన్‌ ఇన్ఫర్మేషన్‌ మోనిటరింగ్‌ సిస్టం) యాప్‌లో ప్రతీ పీహెచ్‌సీ స్థాయిలో ఏ రోజు కారోజు అప్‌లోడ్‌, అప్‌డేట్‌ చేయడంలో లోటు పాట్లు, వ్యాక్సినేషన్‌ను చురుకుగా అమలు చేయడంలో పలు ప్రభుత్వ ఆస్పత్రుల మధ్య సమన్వయం లేక పోవడం కూడా టీకా మందు కొరతకు ఒకానొక కారణంగా వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీటికి తోడు కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైనన్ని డోసుల నిల్వలు అందక పోవడం, 45 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ పంపిణీ, సచివాలయాల స్థాయికి వ్యాక్సినేషన్‌ను విస్తరించడం వంటి నిర్ణయాల అమలుకు అనుగుణంగా క్షేత్ర స్థాయి నుంచి ఒక్కసారిగా టీకాలకు డిమాండ్‌ పెరిగి పోవడంతో ఒకింత ఒడిదుడుకులు ఏర్పడ్డాయి.

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వే ఉధృతంగా ఉండడంతో అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలు వేసుకోవాలని ప్రభుత్వం, వైద్య వర్గాలు సూచించడంతో టీకాల కోసం ఆసుపత్రుల చుట్టూ పరుగులు తీస్తున్నారు. మన దేశంలో ప్రస్తుతం కొవ్యాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు వినియోగంలో ఉన్నాయి. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి జగన్ తదితరులు టీకాలు వేసుకోవడంతో టీకాల పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1-14 టీకా ఉత్సవం, ఆ తరువాత కూడా అరుదుగా మాత్రమే టీకాలు వేసారు. అందుకు కారణం తెలియందేమీ కాదు… ప్రస్తుతానికి రాష్ట్రంలో టీకాల కొరత ఏర్పడడమే. మొదట్లో నియోజవర్గ కేంద్రాల్లోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, మండలాల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే టీకాలను అందు బాటులో ఉంచారు. అప్పట్లో చాలా మంది ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి మొదటి డోస్ టీకాలను వేయించు కున్నారు. తొలి డోస్ వేయించుకుని 40 రోజులు దాటుతున్నప్పటికి కొందరికి ఇంకా రెండో టీకాలు అందుబాటులో లేకపోవడంతో ఏమి చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ప్రజలు ఉన్నారు. టీకా ఎప్పుడు వస్తుందో తెలియక ప్రతి రోజు ఆస్పత్రులకు వద్దకు వచ్చి నిరాశతో వెనుతిరుగు తున్నారు. తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక నిరుత్సాహ స్థితిలో ఉన్నారు. రెండవ డోస్ కోసం ప్రజల్లో ఎదురు చూపులు అధికం అయ్యాయి. ప్రత్తిపాడు నియోజక వర్గంలోని ఏలేశ్వరం నగర పంచాయితీ, ఏలేశ్వరం మండలం పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిశీలిస్తే… శుక్రవారం ఒక్క రోజులోనే 28 మందికి పాజిటివ్ వచ్చింది. మండలంలో ఇప్పటి వరకు 86 కోవిడ్ కేసులు నమోదు కాగా వీరిలో 26 మంది హోమ్ ఐసోలేషన్లో ఉండి కోలుకున్నారని ఏలేశ్వరం సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఏ.వి.రమణ తెలిపారు. ఇంకా 42 ఆక్టీవ్ కేసులు ఉండగా 3 కేసులను మెరుగైన వైద్యం కోసం కాకినాడ జనరల్ ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలించామని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ వేగవంతంగా వ్యాప్తి చెందుతుందని ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారికి రోజుకి సుమారు 200 మందికి రెండో డోస్ వేయడం మూడు రోజులుగా కొనసాగుతుందని, తదుపరి మరల మొదటి డోస్ వేయడం మొదలు పెడతామని ఆయన చెప్పారు. ఇంత వరకు 5,872 డోసుల టీకాలను 4,100 మందికి వేసామని ఆయన వెల్లడించారు.

టెస్టింగు, ట్రేసింగు, ట్రీట్మెంటు అనే త్రిసూత్ర పథకాన్ని అమలు చేయాలని ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రోజుకు 6,00,000 టీకాలను వేసేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ఆదేశించి, రాష్ట్రానికి 60,00,000 టీకాలు కావాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం వద్దా టీకాల కొరత సమస్య తిష్ట వేసి కూర్చుంది. జన సాంద్రత అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో టీకాల లభ్యతతో సంబంధం లేకుండా రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *