* చైర్ పర్సన్ తీరుపై సభ్యుల ఆగ్రహం
* వైసీపీ సభ్యుల్లో రచ్చకెక్కిన విబేధాలు
* నగర పంచాయితి సభ తీరు ఇదీ …

(పంచాయితీ నుంచి జర్నలిస్టు మూర్తి)

గొల్లప్రోలు, 29 ఏప్రిల్ 2021
—————————————
కౌన్సిల్ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చైర్ పర్సన్ తన సొంత ఎజెండా అమలు చేస్తున్నారని వైస్ చైర్ పర్సన్ తెడ్లపు అలేఖ్య రాణితో పాటు మెజార్టి సభ్యులు ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పంచాయితి ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతతో 20కి 18 వార్డుల్లో గెలుపొందిన వైసీపీలో రెండవ సమావేశంలోనే సభ్యులు మధ్య విభేదాలు  అనూహ్యంగా రచ్చ కెక్కాయి. చినికి చినికి గాలి వాన ఐనట్టు ఉన్న పళంగా సమావేశం నుంచి బయటకు దూసుకు వచ్చారు. ఈ రసాబాసలో పాత్రికేయుల్ని కూడా గమనించకుండా తోసు కుంటూ వస్తున్నామన్న కనీస స్పృహ ఆ సమయంలో వారికి లేక పోయింది పాపం…! తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగరపంచాయితి గురువారం నాటి సమావేశం తీరు తెన్నులు ఇవీ ….

చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన గురువారం నాటి సమావేశ ఎజెండాను సభ్యులకు నగర పంచాయితి అధికారి చదివి వినిపించారు. ఎజెండా చదివిన వెంటనే చైర్ పర్సన్ గండ్రేటి మంగతాయారు సమావేశం పూర్తయినట్లు ప్రకటించడంపై వైస్ చైర్ పర్సన్ అలేఖ్య రాణితో పాటు సభ్యులు విరుచు కుపడ్డారు. ఎజెండా అంశాలపై అర్థవంతమైన చర్చ, ప్రజా ప్రయోజన అభివృద్ధి పనులపై సభ్యుల తీర్మానం లేకుండానే ఏకపక్షంగా సమావేశాన్ని ముగించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులకు సమావేశంలో మాట్లాడే హక్కు లేనప్పుడు సమావేశం ఎందుకని 3 వ వార్డు కౌన్సిలర్ మైనం భవానీతో పాటు పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చైర్ పర్సన్ భర్త, 17 వార్డు కౌన్సిలర్ గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి స్పందిస్తూ అజెండాలోని అంశాలపై మాత్రమే సభ్యులు మాట్లాడాలని మిగిలిన అంశాలు ప్రత్యేకంగా జీరో అవర్ లో చర్చించాలని తెలపడంతో ఒక్క సారిగా సభ్యులందరూ విరుచుకుపడి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో కొద్ది సేపు ఎవరు, ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో సమావేశ గది  బయట వైసీపీ నాయకులు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి సిద్ధపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో నగర పంచాయితి కమిషనర్ పి.సాయిబాబు తన సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సభ్యులు కాని వారిని సమావేశం హాలు నుండి బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో విధి నిర్వహణలో భాగంగా ఫోటోలు తీస్తున్న ఆంధ్ర ప్రభ విలేఖరి సునీల్ ను కమిషనర్ బయటకు పంపే ప్రయత్నం విమర్శకు తావిచ్చింది. కమిషనర్ చర్యను కౌన్సిలర్ మైనం భవానీతో పాటు పలువురు సభ్యులు ఖండించారు. విలేఖరులు లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. పరిస్తితి శృతి మించడంతో 17 వార్డు కౌన్సిలర్ గండ్రేటి శ్రీరామచంద్ర మూర్తి సభ్యులను బుజ్జగించి సమావేశపు హాలు నుండి కమీషనర్ చాంబర్ కు తీసుకొని వెళ్ళారు. వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు అంతర్గతంగా సమావేశ మయ్యారు. కాగా తెలుగు దేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తి జూనియర్ కళాశాల స్థలాన్ని ఆక్రమించిన పంతులుపై కమీషనర్ సాయిబాబుకి ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదని ఆ వార్డు కౌన్సిలర్ మైనం భవానీ సమావేశంలో మాట్లాడుతుండగా గండ్రేటి శ్రీరామచంద్ర మూర్తి సూచన మేరకు చైర్ పర్సన్ మంగతాయారు సమావేశం పూర్తయినట్లు ప్రకటించడం వివాదానికి దారి తీసింది. వైసీపీ నాయకులు కార్యకర్తలు మధ్య వివాదం సృష్టించడం ఎంత వరకు సమంజసమని పలువురు ప్రశ్నించారు.

అనుచరుని వ్యాఖ్యలతో మనస్తాపం…..

మేము ఇచ్చిన సొమ్ములతో గెలుపొంది మమ్ములను విమర్శిస్తారా అంటూ చైర్ పర్సన్ అనుచరులు వ్యాఖ్యానిండంతో వైసీపీ కౌన్సిలర్లు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. నగర పంచాయితి సమావేశం సందర్భంగా పలు సమస్యలపై కౌన్సిలర్ లు ప్రశ్నించడం సమావేశ హాలు బయట ఉన్న చైర్ పర్సన్ అనుచరులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. దీంతో రెచ్చి పోయిన వీరు మా నాయకుడు శ్రీరామచంద్ర మూర్తి ప్రతీ వార్డులోను లక్షలాది రూపాయలను కౌన్సిలర్లు తరుఫున ఖర్చు చేసి గెలిపిస్తే ఇప్పుడు సిగ్గు లేకుండా ఎదురు మాట్లాడతారా అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీంతో మనస్తాపానికి గురయ్యిన పలువురు కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు గండ్రేటి అనుచరులతో వాగ్వివాదానికి దిగారు. 11 వార్డు ఇన్ చార్జి మొగిలి అప్పారావు , 16వార్డు ఇన్ చార్జి చెక్కపల్లి దివాణం మాకు డబ్బులు ఎవ్వరూ ఇచ్చారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పలుకుబడితోనే మేము గెలుపొందామని, ఎవరి దయాదాక్షిణ్యలపై ఆదారపడలేదని ఖండించారు.   తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అనుచరులుగా చేసుకొని పార్టీ నాయకుడు గుండ్రేటి శ్రీరామచంద్ర మూర్తి వైసీపీనాయకులను, కార్యకర్తలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *