(మే 1 పిఎస్  జయంతి సందర్భంగా ప్రత్యేక కధనం)

(పెద్దింశెట్టి రామకృష్ణ, 9492383977l)

కాకినాడ, 1 మే 2021
———————————

       గోదావరి జిల్లాల రాజకీయాలు తెలుగు రాష్ట్రాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా స్వాతంత్ర్య ఉద్యమం తదనంతర కాలంలోనూ ఎంతో మంది నేతల రాజకీయ, సామాజిక జీవితాలకు అంకురార్పణ చేసింది. అందులో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, దక్షిణ భారత కమ్యునిస్టు ఉద్యమ నిర్మాత, ప్రఖ్యాత వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సారథి, స్వాతంత్ర భారత మొదటి పార్లమెటు ప్రతిపక్ష నేత పుచ్చలపల్లి సుందరయ్య ఒకరు.  
       సుందరయ్యకు విప్లవ భావాలకు మొగ్గ తొడిగింది చారిత్రక రాజమహేద్రవరం నగరమే. సుందరయ్య భావ (అక్క భర్త) ఏలూరులో న్యాయమూర్తిగా పనిచేస్తూ రాజమండ్రి బదిలీపై వచ్చారు. అక్క ఇంటి వద్దే ఉంటూ సుందరయ్య
చదువు కున్నాడు. దాంతో భావ ఎక్కడికి బదిలీ అయితే అక్కడ విద్యనభ్యసించాడు. ఆ విధంగా రాజమండ్రి ట్రైనింగ్ స్కూల్లో రెండేళ్ళు చదువు కున్నాడు. అప్పటికి ఆయన వయస్సు 13 ఏళ్లు. ఆ సమయంలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ప్రముఖ రాజకీయవాది పందిరి మల్లిఖార్జునరావుతో పరిచయం ఏర్పడింది. మల్లిఖార్జునరావు విద్యార్థుల్లో సామాజిక, రాజకీయ స్పృహ కలిగించి దేశ భక్తులుగా తయారు చేయడం కోసం చర్చలు నిర్వహించే వారు. ఆయనకున్న సొంత గ్రంధాలయం ద్వారా విద్యార్థి, యువకులను పుస్తక పఠనం చేయించే వారు. మల్లిఖార్జునరావు గ్రంథాలయంలోని పుస్తకాలన్నిటి సుందరయ్య దాదాపు చదివారు. ప్రామాణికమైన గ్రంథాలను అధ్యయనం చేశారు. గౌతమి గ్రంథాలయానికి నిత్యం వెళ్తూ అక్కడి పుస్తకాలను ఇంటికి పట్టుకెళ్ళి తాను చదువుతూ తన సోదరితోనూ చదివించే వాడు. కందుకూరి, చిలకమర్తి, పానుగంటి రచనలను చదివాడు. ఈ సమయంలోనే జాతీయోద్యమంతో సంబంధాలున్న కాంగ్రెస్ కార్యకర్తలైన ఒంటెద్దు పార్వతీశం, అన్నాబత్తుల సుబ్బారావు సుందరయ్యకు పరిచయం అయ్యారు. వీరిద్దరూ బెనారస్ విశ్వవిద్యాలయంలో చదువుతూ రాజమండ్రి వచ్చేటప్పుడుల్లా సుందరయ్యను కలుస్తూ రాజకీయ, జాతీయోద్యమానికి సంభందించిన విషయాలు చర్చిస్తూ ఉండేవారు.
        1925 జూన్ లో ఒక రోజు వీరి ముగ్గురూ గొదారి గట్టుపై కూర్చుని ఉండగా చిత్తరంజన్ దాస్ మరణించినట్టు వచ్చిన వార్తకు వారిద్దరూ చింతిస్తుండగా చిత్తరంజన్ ఎవరిని సుందరయ్య అడగ్గా.. నీకు తెలియదా..అని తిరిగి ప్రశ్నించగా చిన్నబుచ్చుకున్నాడు. ఆ సంఘటనతో నిత్యం  వార్తా పత్రికలను ముఖ్యంగా ఆంధ్రపత్రికను చదవడం, కాంగ్రెస్ గురించి, జాతీయోద్యమం గురించి తెలుసు కోవటం ప్రారంభించాడు. ఆంద్రపత్రికలో సీరియల్ గా వచ్చే జలియన్ వాలాబాగ్ హత్యాకాండ, గాంధీజీ ఆత్మ కథ, కాంగ్రెస్ నేతల ప్రసంగ వార్తలు, గాంధీ అరెస్ట్ మొదలగు వార్తలు చదువుతూ వుండడంతో బ్రిటీష్ సామ్రజ్యవాదంపై ద్వేషాన్ని పెంచాయి. అదే సమయంలో గాంధీ పోరాటాల పిలుపులు, ఉజ్వలంగా ప్రజా పోరటాలు సాగుతున్న సమయంలో వాటిని ఉపసంహరించు కోవడం లాంటి ఘటనలు పరిశీలిస్తున్న ఇద్దరు మిత్రులు గాంధీ మార్గంలో స్వరాజ్యం సాధ్యం కాదని సాయుధ పోరాటమే శరణ్యమని అందుకు అవసరమైన ఆలోచనలు చేయాలని సుందరయ్యతో తరచూ చర్చిస్తున్నారు. దాంతో వీరు ముగ్గురు విప్లవకారుల గ్రూపుగా ఏర్పడి సమాలోచనలు చేసేవారు. అందుకనుగుణంగా విప్లవకారుల సాహిత్యం, కాకోరి కుట్ర కేసు లాంటివి అధ్యయనం చేసేవారు.
        రాజమండ్రికి పది కిలోమీటర్లు దూరంలో ఉన్న కోరుకొండ రాతి పలకం గురించి చరిత్ర పుస్తకంలో చదవగా తమ్ముడు రామ్ (డాక్టర్ రామచంద్రారెడ్డి) తో కలిసి చూడ్డానికి వెళ్ళాడు. 1936లో  పచ్ఛిమగోదావరి  జిల్లాలో జరిగిన కాంగ్రెస్ సత్యాగ్రహ శిబిరంలో పాల్గొన్నాడు. ఆ సందర్భంగా ఆయన తాటి చెట్లు గెలలు నరికినందుకు బ్రిటీష్ ప్రభుత్వం మాలపర్రు గ్రామంలో మొదటి సారి అరెస్ట్ అయ్యాడు. అప్పటికి ఆయనకు 18 సంవత్సరాలు నిండ నందున తంజావూర్ బోస్టన్ స్కూల్ కు పంపారు. ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. అందులో సోదర సమితి సభ్యులు, స్వాతంత్ర సమర యోధులు ఉండే వారు. వారందరికి విప్లవకారులు రాజకీయ అవగాహన తరగతులు నిర్వహించేవారు. వీటిలో  దేశంలో గాంధీ మార్గంలో శాంతియుతంగా స్వరాజ్యం రాదని, రష్యా పద్దతిలో విప్లవం ద్వారానే సాధ్యమని అందుకు కమ్యునిస్టు పార్టీలో చేరి స్వాతంత్రం సాధించాలని బోధించేవారు. రాజమండ్రి జైల్లోనే ఉర్దూ భాష నేర్చుకున్నాడు. ప్రేమ్ చంద్ ఉర్దూ నవలలను చదివాడు. రాజమండ్రి జైల్లోనే భగత్ సింగ్ సహచరులు శివవర్మ, విజయకుమార్ సిన్హ మొదలగు విప్లవకారులతో సుందరయ్య సంభందాలు బలపడ్డాయి. కమ్యునిస్టు పార్టీపై నిషేదం వున్నందున కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో ఉంటూ పని చేసేవారు. అందులో భాగంగా రాజమండ్రిలో జరిగిన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ మహాసభలో సుందరయ్య ప్రసంగించాడు. స్థానిక పోలీసులు సుందరయ్య ఉపన్యాసాన్ని వక్రీకరించి నివేదిక పంపినందున బ్రిటీష్ ప్రభుత్వం1936లో తెనాలి రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేసి కాకినాడ సబ్ జైల్లో పెట్టారు. ఈ కేసులో సుందరయ్యకు రెండేళ్ల కారాగార వాసం శిక్ష విధించగా ఆ తర్వాత ఆరు నెలలకు తగ్గించారు.
షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో కాకినాడ నుండి బయటకు వెళ్ళే అవకాశం లేనందున అప్పటికే కాంగ్రెస్ వాదిగా జాతీయోద్యమలో ఉంటూ వైద్యం వృత్తి చేస్తున్న డాక్టర్ చెలికాని రామారావు ఇంటిలో ఉన్నాడు. ఎక్కువ కాలం ఆ  కుటుంబంతోనే వుండటం వల్ల డాక్టర్ రామారావు  కమ్యునిస్టు పార్టీ వైపుకు ఆకర్షితులు కావడానికి ఒక కారణం అయ్యింది.

        1936లో కాకినాడ అన్నదాన సమాజంలో యువజన మహాసభ జరిగింది. అందులో పాల్గొన్న వారంతా కమ్యునిస్టు పార్టీ సభ్యులు అయినందున అది మొదటి కమ్యునిస్టు పార్టీ మహాసభగా పరిగణిస్తున్నారు. అందులో సుందరయ్య పాల్గొన్నాడు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఆంధ్ర ప్రాంతం అనేక విధాలుగా సహకారం ఇచ్చింది. ఆ పోరాటం సందర్భంగానే జిల్లా కామ్రేడ్స్ 23 మంది అమరులు అయ్యారు. ఇక్కడి పోరాటాలకు, సాయుధ దళాల సన్నద్ధం కోసం రాజోలు, అమలాపురం, కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి సుందరయ్య పలుమార్లు పర్యటించాడు.1951 అక్టోబర్ 21 న విరమించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆ రోజే అమరుడైన కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన తోరాటి లక్ష్మణమూర్తి గురించి సుందరయ్య రచించిన ప్రఖ్యాత గ్రంధం “వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – నా అనుభవాలు”లో  మూడో అధ్యాయం వికారాబాద్ చాప్టర్ లో లిఖించాడు. 1952 ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన సభ ఎన్నికలు, 1955 రాష్ట్ర మధ్యంతర ఎన్నికల సందర్భంగా సుందరయ్య జిల్లాలో విస్తృతంగా పర్యటించి అనేక భహిరంగ సభల్లో ప్రసంగించారు. 1984 ఎన్నికల్లో రాజమండ్రిలో సిపిఐ అభ్యర్థికి సిపిఎం శ్రేణులు పనిచేయడంలో వచ్చిన సమస్యపై పార్టీ జనరల్ బాడీ జరిపి ఐక్యంగా పని చేయడం కోసం కృషి చేశారు. 1964లో పార్టీ చీలిక సమయంలో రాజమండ్రి, రాజోలులో, 1967 మరో సారి నగ్జలైట్ రూపంలో పార్టీలో వచ్చిన చీలిక సమయంలో  రాజమండ్రిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించి సైద్ధాంతిక విషయాలు వివరించి పార్టీని కాపాడడంలో విశేషమైన కృషి చేశారు. దేశ ఎమర్జన్సీ అనంతరం 1978 లో సిపిఐ(ఎం) 10 వ జిల్లా మహాసభ రాజమండ్రిలో జరగ్గా రెండో రోజు సుందరయ్య పాల్గొని ప్రతినిధులనుద్దేశించి ప్రసంగిస్తూ పార్టీ సభ్యులు కార్మిక రంగంలో పని చేయడంలో పలు సూచనలు చేశారు. సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన భహిరంగ సభలో ప్రసంగించారు. 1983 డిసెంబర్లో సిఐటియు రాష్ట్ర కమిటి సమావేశాలు కాకినాడ అన్నదాన సమాజంలో జరిగాయి. సిటు రాష్ట్ర ఆఫీస్ బేరర్ గా ఉన్న సుందరయ్య ఆ సమావేశాల్లో పాల్గొని, ఆ సందర్భంగా బాలాజీ చెరువు సెంటర్ లో జరిగిన భహిరంగ సభలో ప్రసంగింþచారు. సుందరయ్యను కాకినాడ తీసుకు రావడం కోసమే యాళ్ళ ధనరాజు నాయకత్వంలోని  నాటి పట్టణ కమిటి జి.ఎస్.బాలాజీ దాస్ సలహాతో సిటు రాష్ట్ర కమిటి సమావేశాలు నిర్వహించారు. యాదృచ్ఛికంగా ప్రపంచ కార్మిక దినోత్సవం “మేడే” రోజునే జన్మించిన సుందరయ్య నడియాడిన జిల్లాలో విలువలతో కూడిన బలమైన కమ్యునిస్టు ఉద్యమాన్ని నిర్మించడమే ఆయనకు ఘనమైన నివాళి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *