విస్తరిస్తున్న కరోనా – వెక్కిరిస్తున్న టీకాల కొరత …!

* 5,000 టీకా వయల్స్ కు ప్రతిపాదనలు
* మరో 50,000 మందికి టీకాల ఏర్పాట్లు
* ప్రభుత్వ వైద్యసేవా లోపం లేదు
* ప్రజల నిర్లక్ష్యమే చంపుతోంది

శంఖవరం, 03 మే 2021
———————————-
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అంతటితోపాటే తూర్పు గోదావరి జిల్లాలోనూ రోజురోజుకూ కరోనా విస్తరిస్తున్నది. ప్రజలను అనివార్యంగా పొట్టన పెట్టు కుంటున్నది. భారత దేశ గడ్డపై పుట్టిన స్వజాతి రకం రెండో దశ కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని 17 దేశాలకు విస్తరించింది. అలాగే దేశీయంగానూ తన విశృంఖుల వ్యాప్తి ప్రభావాన్ని చూపుతోంది. ఈ వ్యాధి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిత్య పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో యుద్ద ప్రాతిపదికన ఎప్పటి కప్పుడు రోగులకు సజావుగా, ఏ సేవా లోపం లేకుండా, సక్రమంగా మందులు, వైద్య సేవల సహాయాన్ని నిరంతరం అందిస్తున్నప్పటికీ వ్యాధి నివారణ టికాల సరఫరా మాత్రం అవసరమైన మేరకు ఒక్క సారిగా జరుగక, టీకాల కొరత సమస్య మాత్రం వ్యవస్థను వెక్కిరిస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా
చివరి దఫాగా ఏప్రిల్ 30, మే 1, 2 తేదీల్లో వేలాది మందికి టీకాలు వేసారు. మొదటి డోసు వేసుకున్న వారికి 28 రోజుల కాల వ్యవధి పూర్తవగానే వారికి రెండో డోసు వేస్తూనే దానికి సమాంతరంగా మొదటి డోసు టీకాలు వేసే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రభుత్వం సరఫరా చేసిన టీకాలు దుర్వినియోగ మవడం, టీకాలకు నిరంతరం కోల్డ్ చైన్ (నిత్యం టీకాలను శీతలీకరణ విధానం) లో ఉంచక పోవడం వంటి పలు కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రులకు టీకాల సరఫరాను నిలపివేసి ప్రభుత్వం మంచి పనే చేసింది. దీంతో టీకాల ప్రక్రియ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎవరు ముందుగా వస్తే వారికి ముందుగా టీకా వేసే పద్దతిలో సజావుగా సాగిపోతుంది. జిల్లాలో మొదటిగా కోవీషీల్డ్ టీకాలను వేసారు. అప్పుడు దానిపై నమ్మకం లీక అత్యధికులు అందులో ప్రభుత్వ ఉద్యోగులు సైతం అశ్రద్ధ చేసి కోవాక్సిన్ టీకాలపై మక్కువ, నమ్మకంతో అవి వచ్చే వరకూ ఎదురు చూసి, అవి వచ్చాకే మొదటి డోసు టీకాలు వేసుకున్నారు. తదుపరి కోవాక్సిన్ టీకాల సరఫరా నిలిచి పోయింది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కోవాక్సీన్ మొదటి డోసు వేసుకున్న వారు రెండో డోసు కోసం సుమారు 30,000 ఎదురు చూస్తూ ఉన్నట్టు అనధికారిక అంచనా. ఐతే ఈ సంఖ్య వాస్తవంగా ఎంత అన్నది మాత్రం జిల్లా వైద్య ఆరోగ్య కనీసం వెల్లడించడం లేదు. వీరంతా రెండో డోసుగా కోవాక్సిన్ మాత్రమే వేసుకోవాల్సి ఉన్నందున ఇవి లభ్యం కాక వీరిలో ఆందోళనగా ఉంది. వీరంతా కోవ్యాక్సిన్ కోసం జిల్లాలో పెద్ద ఎత్తున అన్వేషిస్తూ ఉన్నారు. జిల్లా ఉన్నత ధికారులు, పోలీసులు, న్యాయ మూర్తులు, జర్నలిస్టులు, వైద్య వర్గాల కోటాలో ఏమైనా కోవాక్సిన్ దొరుకు తుందాని వాకబు చేస్తున్నారు. విశాఖపట్నం జిల్లా నుండి కూడా ఈ కోవ్యాక్సిన్ కోసం తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి అన్వేషిస్తూ ఉన్నారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. జిల్లాలో ప్రస్తుతానికైతే కోవీషీల్డ్ టీకాలనే వేస్తున్నారు. కరోనాపై అవగాహన లేక కొందరు, నిర్లక్ష్యంతో కొందరు వ్యాధి బారిన పడుతున్నారు. ఇంకొందరైతే తమకున్న వ్యాధిని పదుగురికీ సోకాలనే లక్ష్యంతో వ్యాప్తికి కారణం అవుతూ ఉన్నారు. ఏదైతేనేం కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు అక్కడ నుంచి జిల్లాలకూ ఈ కోవిషీల్డ్ టీకాల సరఫరా కూడా పరిమితంగానే ఉంది. కాగా టీకాలు వేయడానికి విరామం ఇచ్చారా అన్నట్లుగా మే 3 వ తేదీన నుంచి జిల్లాలో టీకాల కొరత షరా మామూలుగానే ఎదురైంది. ఈ సమస్యను అధిగ మించడానికి జిల్లాకు 5,000 కరోనా టీకాల వయెల్స్ కావాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో వయల్ 10 మంది టీకాలకు సరిపోతుంది. ఈ లెక్కన వచ్చే 5,000 వయెల్స్ తో మరో 50,000 మందికి కరోనా టీకాలు వేయనున్నారు. ఈ మేరకు టీకాలకు ఏర్పాట్లతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్దపాటుతో ఉంది. ఇదే విషయాన్ని తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గౌరీశ్వరరావును “మనం న్యూస్ ” సోమవారం వివరణ కోరగా ప్రస్తుతం జిల్లాలో కరోనా నివారణా టీకాల కొరత ఉందని, నేటి నుంచి అందుబాటులో లేవని, మరో 5,000 వయెల్స్ టీకాల సరఫరా కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసామని వెల్లడించారు. ఇప్పటికి జిల్లాలో కోవాక్సిన్ మొదటి డోసు టీకాలను వేసుకున్న వారిలో ఎంత మంది రెండో కోసం ఎదురు చూస్తున్నారు అని అడగ్గా, ఆ టీకాలు వస్తే ఖచ్చితంగా చెపుతామంటూ జవాబు చెప్పకుండా దాటవేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *