* పనుల వద్ద కనిపించని అధికారులు
* ముంచుకు వస్తున్న వర్షాలు

శంఖవరం, 05 మే 2021
———————————–
నిత్యం ఎంతో జన సంచారం, రవాణా రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డు మరమ్మతు పనులు నత్త నడకన సాగుతున్నాయి. నిర్మాణానికి నెల రోజుల వ్యవధి అనుకున్నది కాస్తా రెండు నెలలు దాటి పోయింది. కొనసాగుతున్న పనుల వద్ద పర్యవేక్షించే అధికారులు కూడా కనిపించడం లేదు. మరో పక్క వర్షాలు ముంచుకు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని శంఖవరం – రౌతులపూడి మండలాలను కలిపే కత్తిపూడి – కోటనందూరు ఆర్అండ్బీ రోడ్డు మరమ్మతుల ప్రస్తుత పరిస్థితి ఇదీ. శంఖవరం మండలం కత్తిపూడి నుంచి రౌతులపూడి మండల కేంద్రం వరకూ పూర్తిగా జీర్ణోద్దరణకు వచ్చిన మొత్తం 18 కిలోమీటర్ల పొడవునా రోడ్డు మరమ్మత్తు పనులకు రూ. 60 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. కత్తిపూడి నుంచి శంఖవరం వరకూ 9 కిలోమీటర్ల దూరం పొడవునా రోడ్డు మరమ్మత్తు పనులకు రూ. 40 లక్షలు, శంఖవరం నుంచి రౌతులపూడి వరకూ మరో 9 కిలో మీటర్ల దూరం పొడవునా రోడ్డు మరమ్మత్తు పనులకు రూ. 20 లక్షలు చొప్పున చైనా దేశపు న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి మంజూరైన రుణం నుంచి ఈ రోడ్డుకు నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధుల్లో నుంచి జిఎస్టీ సుమారు రూ. 6 లక్షలు పోనూ మిగతా నిధులు ఈ రోడ్డు మరమ్మత్తులకు వినియోగించాల్సి ఉంది. ఫిబ్రవరి 25 న మరమ్మతు పనులు ప్రారంభ మయ్యాయి. శంఖవరం – కత్తిపూడి రోడ్డు పనులు చకచకా పూర్తయ్యాయి. ఆ తర్వాత ఎందుకో గానీ శంఖవరం – రౌతులపూడి రోడ్డు మరమ్మతు పనులు మాత్రం నత్త నడకన కొనసాగు తున్నాయి. ప్రస్తుతం ఈ పనులు రౌతులపూడి మండలం శృంగవరం గ్రామం దాటి జరుగు తున్నాయి. ఈ పనుల నాణ్యత మాట అటుంచితే పనుల నిర్మాణం వ్యవధి కాలంలో ఆశించిన పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. ఈ పనులను చేపట్టింది చిన్నా చితకా కంపెనీయా అంటే అదీ కాదు. జిల్లా కేంద్రం కాకినాడలోని పేరు మోసిన, ఆర్ధిక దన్ను మెండుగా ఉన్న ప్రియాంక కంపెనీ. మరి పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందో మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *