సిద్దివారిపాలెం, 0 మే 2021
—————————————–

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెదమల్లాపురం పంచాయితీ  సిద్ధివారిపాలెంలోని ఆంధ్రా శబరిమల పుణ్యక్షేత్రం ప్రధాన సలహాదారు, ప్రధాన తాంత్రి, పురోహిత బ్రహ్మ నటరాజ్ శర్మ (సుబ్రహ్మణ్య శర్మ) శివైఖ్యం పొందారు. రాజమండ్రిలో నివాసముంటున్న నటరాజ్ శర్మ కుటుంబ సభ్యులు అందరూ ఇటీవల కరోనా బారిన పడ్డారు. చికిత్స పొందుతూనే 15 రోజుల వ్యవధిలో ఆయన ఇద్దరు కుమార్తెలు కరోనాతో మృతి చెందారు. ఆ తర్వాత శర్మ చికిత్స పొందుతూ ఆదివారం శివైఖ్యం చెందారు. శర్మ శివైఖ్యం చెందిన వార్తతో ఆంధ్రాశబరిమల ఆలయం సంస్థ ఛైర్మన్ భూపతి, గౌరవ డాక్టర్ కుసుమంచి శ్రీనివాసరావు గురు స్వామి తీవ్ర ద్రిగ్భాంతికి లోనై విచారం వ్యక్తం చేసారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. శర్మ శివైఖ్యానికి
ఆంధ్రా శబరిమలలో ప్రాంగణంలోని ట్రస్ట్ సభ్యులు, సిబ్బంది సంతాపం వ్యక్తం చేసి, మౌనం పాటించారు. ఆంధ్రా శబరిమల ఆలయంలో ఆయన నిర్వహించిన విధులు, అందించిన విలువైన సలహా సూచనలకు చిహ్మంగా ఆలయ దిగువ మండపానికి నటరాజ్ శర్మ మండపంగా నామకరణం చేశారు. ఆలయంలోని శర్మ హోదాను ఆయన కుమారుడు శేషుకుమార్ కు  ప్రదానం చేసామని, ట్రస్ట్ తరఫున వారి కుటుంబాన్ని  దత్తత తీసుకుని ఆదుకుంటామని ఛైర్మన్ శ్రీసత్యశ్రీనివాసరావు గురుస్వామి ప్రకటించారు. ఆంధ్రా శబరిమలైలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ, ఆలయ అభివృద్ధిలో శర్మ సేవలు అనిర్వచనీయమని ఈ సందర్భంగా శ్రీనివాసరావు గురుస్వామి కొనియాడారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *