* వేతనాలు ఖాతాల్లో వేస్తున్న కేంద్రం
* తమకే ఇవ్వమంటున్న కార్యదర్శులు
* తప్పని అదనపు చెల్లింపులు
* తిప్పలు పెడుతున్న గ్రీన్ అంబాసిడర్స్
* జుత్తు పీక్కుంటున్న కార్యదర్శులు

శంఖవరం, 12 మే 2021
————————————
మహాత్మా గాంధీ కలగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ స్వచ్ఛ భారత్ నే స్వచ్ఛ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ మిషన్ గా కూడా పిలుస్తున్నారు. దీనికి 24 సెప్టెంబరు 2014 న భారత కేంద్ర ప్రభుత్వ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ పధకాన్ని గాంధీ జయంతి గురువారం 2, అక్టోబర్ 2014 న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని పట్టణాల్లో పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, గ్రామాల్లో కేంద్ర తాగు నీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ అమలు చేస్తున్నాయి. గ్రామాల్లోని సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమం అమలులో భాగంగా ప్రతి పంచాయతీలో గ్రీన్‌ అంబాసిడర్ల పేరుతో పారిశుద్ధ్య కార్మికులను పంచాయితీలే నియమించు కోవాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. భౌగోళిక విస్తీర్ణం, జనాభా సంఖ్య ప్రాతిపదికన గ్రీన్ అంబాసిడర్లను పంచాయితీలు నియమించాయి. ఆంధ్రప్రదేశ్ లో 13.065 పంచాయితీలు, 3,500 గ్రామ సచివాలయాల్లో ఈ గ్రీన్ అంబాసిడర్స్ ను నియమించారు. ఒక్కో గ్రీన్ అంబాసిడర్ కూ ఒక్కో నెలకు వేతనంగా రూ. 6,000 చొప్పున వారి బ్యాంకు పొదుపు ఖాతాల్లో కేంద్ర తాగు నీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ నేరుగా జమ చేస్తున్నది.
నిజానికి ఈ నెలసరి వేతనం రూ.6000 లకే గ్రీన్ అంబాసిడర్స్ పని చేయడం లేదు. దీనికి మించి ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా అంటే రూ. 6,000 మొదలు కొని రూ. 7,000, రూ. 8,000, రూ. 9,000, రూ. 10,000 వరకూ వేతన చెల్లింపు వప్పందాలను ఆయా పంచాయితీలతో చేసుకుని పని చేస్తున్నారు. ఆ ప్రకారం కేంద్రం చెల్లించే రూ. 6,000 లకు అదనపు మొత్తాన్ని తమ పంచాయితీల సాధారణ నిధుల నుంచి కార్యదర్శులు చెల్లిస్తున్నారు. అంతే కాకుండా కేంద్రం ఎప్పుడో తనకు వీలైనప్పుడు చెల్లించే వేతనాలతో నిమిత్తం లేకుండా పంచాయితీలు గ్రీన్ అంబాసిడర్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రతీ నెలా వేతనం మొత్తాన్ని రెండో నెల మొదటి వారంలోనే సంపూర్ణంగా వారి బ్యాంకు ఖాతాల్లోకి చెల్లించాలి. ఇది గాకుండా అప్పుడప్పుడూ తమకు అత్యవసరం అంటే బయానాగా రోజు వారీ సిబ్బంది చేతి అప్పుల పద్దుగా కూడా కొంత మొత్తాన్ని గ్రీన్ అంబాసిడర్లకు చెల్లించాల్సి వస్తున్నది. ఆనకెప్పుడో కేంద్రం వేతనాలను గ్రీన్ అంబాసిర్లకు చెల్లించాక అప్పుడు గ్రీన్ అంబాసిడర్లను బతిమాలి, బామాలి వారి నుంచి ఆ రెండు రకాలైన వేతనాలు, చేబదళ్ళ నగదు మొత్తాలను తప్పనిసరిగా రాబట్టుకుని తిరిగి వాటిని పంచాయితీ సాధారణ నిధుల పద్దుకు కార్యదర్శులు జమ చేసి లెక్క సరి చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో కొందరు తిరిగి చెల్లిస్తూ ఉండగా మరి కొందరు గ్రీన్ అంబాసిడర్లు ఆ నగదును కార్యదర్శులకు చెల్లించకుండా తర్వాత నెలకు జమ వేసుకుంటాం అంటూ తిరిగి చెల్లింపులను తెలివిగా దాటవేస్తున్నారు. ఓ గ్రీన్ అంబాసిడర్ తన వేతనంగా రూ. 72.000 లను పంచాయితీ సాధారణ నిధుల్లోంచి పొంది, అంతే మొత్తాన్ని కేంద్రం నుంచి పొంది ఆ తర్వాత విధులకు ఎగనామం పెట్టాడు. పంచాయితీకి చెల్లించాల్సిన రూ. 72.000 లను ఎగ్గొట్టి ముఖం చాటేసిన ఘటన ఆ పంచాయితీ సాధారణ నిధుల ఖజానాకు నష్టాన్ని తెచ్చింది. ఇలాంటి ఘటనలతో కార్యదర్శులు జుత్తు పీక్కుంటూ ఉన్నారు. ఈ పితలాటకం పరిస్థితిని, తమకు ఎదురు కాబోయే ముప్పును గ్రహించి కూడా గ్రామ సంపూర్ణ పారిశుద్ధ్యం లక్ష్యం దృష్ట్యా, ఈ పారిశుద్ధ్య పనులను చేయడానికి వేరే ఎవరూ ముందుకు రాని విపత్కర పరిస్థితుల నేపథ్యంలో కార్యదర్శులు అనివార్యంగా గ్రీన్ అంబాసిడర్ల ఇష్టానికి తలొగ్గాల్సి వస్తున్నది. అలా కాని పక్షంలో గ్రీన్ అంబాసిడర్లు విధులకు డుమ్మా కొడు తున్నారు. ఫలితంగా అనివార్యంగా పంచాయితీల్లో పారిశుద్ధ్యం పడకేస్తోంది. పర్యవసానంగా పంచాయితీ కార్యదర్శులు ఇటు ప్రజలు, అటు అధికారులతో మాట పడవలసి వస్తున్నది. ఇలా ప్రభుత్వ యంత్రాంగం బలహినతను ఆసరాగా చేసుకొని గ్రీన్ అంబాసిడర్లు ఆడిందే ఆటగా పాడిందే పాటగా నెగ్గుకు వస్తున్నారు. ఏ నెలకు ఆ నెల పంచాయితీలు సంపూర్ణంగా వేతనాలను చెల్లిస్తూ ఉన్నప్పటికీ కేంద్రం చెల్లించాల్సిన వేతనాలు ఆలస్యమైతే సమ్మెలకు దిగుతున్నారు.
2018 -19 ఏడాదిలో గ్రీన్‌ అంబాసిడర్స్‌కు సకాలంలో జీతాలు రాకపోవడంపై రాష్ట్రంలో అక్కడక్కడా సమ్మెలు చేసారు. 2019 కాలపు వేతనాలు చెల్లింపులు పూర్తయ్యాయి. 2020 సంవత్సరంలో గ్రీన్ అంబాసిడర్లకు ఇప్పటికి ఎనిమిది నెలల కాలానికి మాత్రమే మూడు దఫాలుగా వేతనాలను బ్యాంకు పొదుపు ఖాతాల్లోకి కేంద్ర తాగు నీరు, పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ నేరుగా జమ చేసింది. మిగతా మొత్తానికి వేతన బకాయిలను పంచాయితీ సాధారణ నిధుల్లోంచి కార్యదర్శులు చెల్లించారు. గ్రీన్ అంబాసిడర్స్ వేతనాలు పంచాయితీలకు నేరుగా రావు గనుక వీటిని పంచాయితీలు తమ వద్దే ఉంచుకోలేవు.ఇంత ప్రయాసపడి కార్య భారాన్ని మోస్తున్నప్పటికీ గ్రీన్ అంబాసిడర్స్ వేతనాలను దుర్వినియోగం చేసారనే ఆరోపణలను రాష్ట్రంలో అక్కడక్కడా కార్యదర్శులు ఎదుర్కోవలసి వస్తోంది. అటు కేంద్రం, ఇటు పంచాయితీలూ గ్రీన్ అంబాసిడర్స్ కు వేతన చెల్లింపులు చెయ్యడం, పంచాయితీలు తాము చెల్లించిన సొమ్ములను తిరిగి రాబట్టు కోడం వంటి ఈ మొత్తం ప్రక్రియ మధ్యలో నిధుల దుర్వినియోగం వంటి ఆరోపణల పితలాటకం నేపథ్యంలో ఈ సమస్యలకు పరిష్కారంగా గ్రీన్ అంబాసిడర్స్ వేతనాలను కేంద్రమే నేరుగా పంచాయితీల ఖాతాలకు జమ చేయాలని కార్యదర్శులు ఆది నుంచీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూనే ఉన్నారు. కానీ పరిష్కరించడం లేదు. ఇప్పటికైనా ఈ సమస్యను ఉభయ తారకంగా ప్రభుత్వాలు పరిష్కరించాలని రాష్ట్ర పంచాయితీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని మరో మారు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *