* దేశీయంగా తగిన ఉత్పత్తి లేదు
* వంట నూనెల పంట సాగు తగ్గింది
* విదేశీ నూనెల దిగుమతి ఆగింది
* లీటర్ ధర రూ. 200 చేరువలో

శంఖవరం, 12 మే 2021
———————————–
వంటల తైలం కొనాలంటే చేతి తైలం వదులు తోంది… వంట నూనెలను కొనబోతే కొరివి, అమ్మ బోతే అడవి అన్నట్టు ఉంది పరిస్థితి… వంట నూనెను కొంటే సామాన్యుల జేబులకు చిల్లు పడుతోంది. దేశంలో వంట నూనెల ధరలు అదే పనిగా పెరుగు తుండడంతో సామాన్యుడు కుదేలవు తున్నాడు. కరోనా కష్ట కాలంలో మొదలైన వంట నూనెల ధరల పెరుగుదల గత ఏడెనిమిది నెలలుగా కొనసాగుతోంది. ఫలితంగా వంట నూనె ధరలు మండి పోతున్నాయి.

వేరుశెనగ, పొద్దు తిరుగుడు, పామాయిల్‌, నువ్వులు, అవిసెలు, ఆవలుతో సహా అన్ని రకాల నూనెల ధరలు పెరిగిపోతూనే వున్నాయి. దాంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై నూనె ధరల పెనుభారం పడుతోంది. వంట నూనె ధరలు రానున్న రోజుల్లో దిగి వచ్చే అవకాశాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. వీటి ధరలు ఆకాశాన్ని అంటాయి. వీటి ధరలు దిగివస్తే ఎంతో మందికి ఊరట కలగనుంది. వంట నూనె ధర గత ఏడాది అత్యధికంగా రూ. 90 వరకూఉంది. కానీ ఈ ఏడాది దాని ధర క్రమంగా రూ.180 వరకూ పెరిగింది. దీంతో ప్రజలపై చాలా భారం పడుతోంది. సామాన్యుల వంట నూనెల ధరల మంటను తట్టుకోలేక నూనె వంటకాలు తగ్గించు కున్నారు. బజారుకు రూ.150 తీసుకెళ్తే లీటరు ఆయిల్ కూడా రావడం లేదు. దేశంలో అన్ని వంట నూనెలు లీటర్ ధరలు రూ. 180 ని దాటేశాయి. పేద ప్రజలు ఎక్కువగా వినియోగించే విజయ బ్రాండ్ పామాయిల్ ధర ఒక్కటే రైతు బజార్లలో రూ. 105 గా కొనసాగు తోంది. ఇది బహిరంగ మార్కెట్లకు వచ్చే సరికి రూ.130కి లభిస్తోంది.

అధిక ధరలకు కారణాలు ఇవే …
——————————————
ప్రపంచంలో వంట నూనెలను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో మన దేశం ఒకటి.
దేశీయంగా సరిపడినన్ని వంట నూనె ఉత్పత్తులు లేవు. దేశీయ అవసరాల కోసం వంట నూనెల దిగుమతులపైనే మన దేశం ఎక్కువగా ఆధార పడుతోంది. ఇందుకోసం మన దేశం ప్రతి ఏడాదీ వంట నూనెలను వీదేశాల నుంచి దిగుమతి చేసు కోవడానికి రూ.75,000 కోట్లను ఖర్చు చేస్తోంది. అయితే వంట నూనెల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలను విశ్లేషిస్తే చాలానే కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో నూనెల డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడం, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉత్పత్తులు తగ్గుముఖం పట్టడం, ఉక్రెయిన్, రష్యా దేశాల్లో పొద్దు తిరుగుడు పంట ఉత్పత్తి బాగా తగ్గి పోవడం, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో పామాయిల్‌ ఉత్పత్తి గణనీయంగా పడి పోవడం, అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాలు కరువు పరిస్థితుల వల్ల తగినంత సోయాబీన్ ను ఉత్పత్తి చేయలేక పోవడం వంటివి మన దేశంలో వంట నూనెల ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తు ఉన్నాయి. దేశంలో వంట నూనెల దిగుమతులు పెరిగే వరకు మరి కొద్ది కాలం ఇదే పరిస్థితి వుంటుందని వాణిజ్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. దిగుమతులు సాధారణ స్థాయికి వస్తేనే దేశంలో వంట నూనెల మార్కెట్‌లో డిమాండ్‌కు సరిపడా సరఫరా నెలకొని ధరలు స్థిరీకరణ జరుగుతుందని అంటున్నారు. వంట నూనెల ధరల స్థిరీకరణ శాశ్వతంగా జరగాలంటే దేశీయంగా నూనె గింజల పంటల సాగును పెంచాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ పంటలు సాగు చేసే రైతులకు కేంద్రం మద్దతు ధర, ప్రోత్సాహకాలు పెంచాల్సి వుంది. రాష్ట్రాలు సైతం వంట నూనెల ఉత్పత్తికి ప్రోత్సాహకాలనూ అందించాల్సిన అవసరం వుందని, అలాగే దేశీయంగా దిగుమతి సుంకాల్ని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే వంట నూనెల ధరలు కొంతైనా తగ్గే అవకాశం వుందని అంటున్నారు.

ధరలు తగ్గే అవకాశం …?
————————————-
అయితే ఇప్పుడు వంట నూనె ధర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాండ్లా, ముంద్రా పోర్ట్‌లలో నూనె స్టాక్‌ భారీగా నిలిచిపోయింది. ఈ స్టాక్‌కు అనుమతి లేకపోవడం వల్ల అలాగే పోర్ట్‌లలో చిక్కుకు పోయింది. ఇప్పుడు ఈ స్టాక్‌కు క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం. అంటే మార్కెట్‌లోకి ఎక్కువ నూనె అందుబాటులోకి రానుంది. దీని వల్ల నూనె ధరలు తగ్గే అవకాశాలు న్నాయని నివేదికలు పేర్కొంట ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *