అన్నవరం, 15 మే 2021
———————————–
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం  శంఖవరం మండలం అన్నవరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి, అనంతలక్ష్మి దంపతుల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈ నెల 22 న నిర్వహించ నున్నారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా జరగాల్సిన శ్రీ స్వామి, అమ్మ వార్ల కళ్యాణాన్ని కోవిడ్ ఆంక్షల ప్రభావంతో నిరాడంబరంగా నిర్వహించ నున్నారు. ఈ దివ్య కల్యాణం మహోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భక్తులకు అనుమతి లేదు. గత ఏడాదిలాగే నిరాడంబరంగా పరిమిత సంఖ్యలో ఆలయ వేద పండితులు, అర్చకులు, వ్రత పురోహితులతో ఏకాంతంగానే కల్యాణోత్సవం జరగనుంది. దాత సహకారంతో ఇటీవల
నిర్మించిన నూతన కళ్యాణ మండపంలో శ్రీ స్వామి దంపతుల కళ్యాణం నిర్వహించడానికి సంకల్పించినట్లు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు ప్రకటించారు. 21న  సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మ వార్లను వధూవరులను చేస్తారు. 22 న రాత్రి 9 గంటలకు శ్రీ సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవార్ల కు దివ్య కళ్యాణాన్ని నిర్వహిస్తారు. 23 న సాయంత్రం స్థాలీపాక హెమం, అరుంధతి నక్షత్రం దర్శనం చేయిస్తారు. 24 న సాయంత్రం ఐదు గంటలకు పండిత సదస్యం జరుగుతుంది .25 వ తేదీ సాయంత్రం వన విహార మహోత్సవం నిర్వహిస్తారు. 26 న ఉదయం 9 గంటలకు పంపా సరోవరంలో శ్రీ స్వామి దంపతులకు చక్రస్నానం చేయిస్తారు. మధ్యాహ్నం నాకబలి దండియాడింపు సేవ ఉంటుంది. 27 న రాత్రి శ్రీస్వామి అమ్మ వార్ల శ్రీ పుష్పయాగంతో కల్యాణోత్సవాలు ముగుస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *