ఫ్లోరిడా , 17 మే 2021
———————————-
విశ్వ సుందరి (మిస్‌ యూనివర్స్‌) – 2020 కిరీటం ఈసారి మెక్సికో కు చెందిన 26 ఏళ్ల అందాల భామ ఆండ్రియా మెజాను వరించింది. ఫ్లోరిడాలో జరిగిన అందాల పోటీల్లో విశ్వ సుందరి కిరీటాన్ని ఆండ్రియా మెజా సొంతం చేసుకున్నారు. మిస్‌ యూనివర్స్‌ 69వ ఎడిషన్‌లో మొత్తం 74 దేశాలకు చెందిన సుందరాంగులు పోటీ పడగా మెజా విజేతగా నిలిచారు. మెజాకు 2019 విశ్వసుందరి జోజిబినీ టూన్జీ మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని అలంకరించారు. 

73 మందిలో ఆండ్రియా విజయం ….
తొలి రన్నరప్‌గా మిస్‌ బ్రెజిల్‌ జులియా గామా గెలుచుకోగా..రెండో రన్నరప్‌గా మిస్‌ పెరూ జానిక్‌ మెసెటా డెల్‌ కాసిలో నిలిచారు. మిస్‌ ఇండియా అడెలిన్‌ కాస్టెలినో సైతం తోటి వారికి గట్టి పోటీ నిచ్చి టాప్‌-5 లో స్థానం దక్కించుకుని నాలుగో స్థానంలో నిలిచారు. దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ మిస్‌ యూనివర్స్‌(2019) జోజిబినీ తుంజీ విజేత ఆండ్రియాకు కిరీటం అలంకరించారు. మొత్తం 73 మంది పాల్గొన్న ఈ పోటీలో ఆండ్రియా విజయం సాధించారు. ఆమె విజేత అని ప్రకటించగానే.. సాధారణంగానే ఆండ్రియా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ సంతోషంతో ఆమెకు కన్నీరు పెల్లుభికింది. కన్నీళ్ల పర్యంతమవుతూనే క్యాట్‌ వాక్‌ పూర్తి చేశారు ఆండ్రియా.

లాక్ డౌన్’ పెట్టేదాన్ని….
.‘‘మీరు మీ దేశానికి నాయకురాలిలైతే కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనేవారు?’’ అని అందాల పోటీల నిర్వాహకులు ప్రశ్నించగా దానికి ఆండ్రియా ఏమాత్రం తడుముకోకుండా ‘లాక్ డౌన్’ పెట్టేదాన్నంటూ ఠక్కున సమాధాన మిచ్చారు. ఇంకా ఆమె మాట్లాడుతూ..‘‘కరోనా మహమ్మారి లాంటి అతి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొనేందుకు కచ్చితమైన పరిష్కారమంటూ లేదని నేనను కుంటున్నాననీ, కరోనాను ఎదుర్కోవాల్సి వస్తే నేను లాక్ డౌన్ పెట్టేదాన్ని. ప్రజల ప్రాణాలు పోకముందే ఆ నిర్ణయాన్ని తీసుకునేదాన్నని తెలిపారు. ఇప్పటికే మేం చాలా మందిని కోల్పోయాం. లాక్ డౌన్ అంటే ప్రజలు భయ పడతారని తెలుసు… కానీ ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కాబట్టి కరోనా వ్యాప్తి జరుగుతోందని తెలిసిన నాటి నుంచి ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉంటాను’’ అని ఆండ్రియా చెప్పుకొచ్చింది.

ఎవరీ ఆండ్రియా మెజా…?
26 ఏళ్ల ఆండ్రియా మెజా మెక్సికోని చిహువాకు చెందిన యువతి. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకుని మోడలింగ్‌పై ఆసక్తి గల చిహువా టూరిజం బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉంటూ తమ సంస్కృతీ సంప్రదాయాల గురించి ప్రపంచానికి చాటి చెబుతున్నారు. అంతే కాదు ఆండ్రియాకు మహిళా హక్కులపై ఉద్యమిస్తున్నారు. లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక సర్టిఫైడ్‌ మేకప్‌ ఆర్టిస్టు మోడల్‌ అయిన ఆండ్రియాకు క్రీడల అంటే కూడా ఆసక్తి. జంతు హింసను తట్టుకోలేని సున్నిత మనస్కురాలు. అందుకే ఆమె వీగన్‌గా మారి పోయారు. మెక్సికో నుంచి మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైన మూడో మహిళగా ఆండ్రియా నిలిచారు. 1991లో లుపితా జోన్స్, 2021కి గాను షిమెనా నవరటె విశ్వ సుందరీ కిరీటాలను దక్కించు కున్నారు.

గొప్ప హృదయం ఉన్నవాళ్లే …
ఫైనల్‌లో ఆండ్రియాను నిర్వాహకులు కొన్ని ప్రశ్నలు వేశారు. అందానికి కొలమానం ఏమిటని మీ అభిప్రాయం? అనే ప్రశ్నకు ఆండ్రియా సమాధానమిస్తూ..‘‘అత్యంత నాగరికమైన సమాజంలో మనం ఉన్నాం. అదే సమయంలో కొన్ని కట్టుబాట్లను కూడా మనతో పాటు ముందుకు తీసుకు వెళ్తున్నాం. అందం అనేది కేవలం బాహ్య రూపురేఖలకు సంబంధించింది కాదు. మన ఆత్మలో గొప్ప మనసు కలిగి ఉండటంలోనే అందం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం విలువ గల వ్యక్తులం కాదని ఎదుటివాళ్లు అవహేళన చేసేందుకు అస్సలు అనుమతించ కూడదు’’ అని బదులిచ్చిన ఆండ్రియా 69వ మిస్‌ యూనివర్స్‌గా నిలిచారు. కాగా కరోనా మహమ్మారి వల్ల గతేడాది విశ్వ సుందరి పోటీలు రద్దు అయిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *