* ఆ సొమ్ములకు లెక్కా, పత్రాల్లేవ్…
* కార్యదర్శికి షోకాజ్ నోటీసులు జారీ
* దిద్దుబాటుకు మూడు రోజులే గడువు

కత్తిపూడి , 18 మే 2021.
——————————–
ఆ మేజర్ పంచాయితీలో ప్రభుత్వ, పంచాయితీ నిధులు రూ. 42.44,155 (కొను)గోల్ మాల్ జరిగింది. ఈ మొత్తం నగదుకు సంబంధించిన వ్యయాన్ని పంచాయితీ పద్దుల్లో చూపించలేదు. ఆ మేరకు నగదు వ్యయ పద్దుల పుస్తకాలు, సంబంధిత వ్యయ మొత్తాల బిల్లులు కూడా సదరు పంచాయితీలో అందుబాటులో లేవు. ఆ నిధుల విచారణ అధికారికీ చూపించలేదు. దీంతో సదరు పంచాయితీ కార్యదర్శికి జిల్లా పంచాయితీ అధికారి షోకాజ్ ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కత్తిపూడి పంచాయితీ కార్యదర్శి కాకరపర్తి బులివీరన్నపై నిధులు, విధుల దుర్వినియోగం అభియాగాలను లేవ నెత్తుతూ మండల పరిషత్తు అభివృద్ధి అధికారి జె.రాంబాబు, పంచాయితీ సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ జిల్లా ఉన్నత అధికారులకు లోగడ ఫిర్యాదులు చేసారు. ఈ నేపధ్యంలో ఇక్కడ కార్యదర్శిగా బులివీరన్న విధుల్లో చేరిన 19.0.07.2019 నుంచి 08.05.2021 వరకూ నిధుల లభ్యత, జమా ఖర్చులపై ఈ నెల 8న పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ పంచాయితీ అధికారిణి జె.అమ్మాజీ పంచాయితీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. కొన్ని దస్త్రాలను ఆమె వెంట తీసుకుని వెళ్ళి విచారణ చేపట్టారు.

01.07.2019 నుండి 14 వ ఆర్థిక సంఘం నిధులు, ఖర్చులను పరిశీలించగా మొత్తం రూ .1,02,99,73 లు పంచాయితీకి జమ కాగా, వీటిలో రూ. 89,40,143 లు ఖర్చు చేయగా, అందులో చెల్లించిన మొత్తం రూ .48,01,584 లు ఆమోదయోగ్యంగా ఉండగా మిగిలిన సొమ్ములు రూ. 41,38,559 లకు ఏవిధమైన బిల్లులు, ఓచర్లు, ఎం.బుక్కులు, స్టాక్ రిజిస్టర్లను చూపించ లేకపోయారని నివేదికలో ఆమె పేర్కొన్నారు. అలాగే పంచాయితీకి ఇంటి పన్నుల రూపంలో వచ్చిన ఒక మొత్తం రూ. 24,580 లు, రెండో మొత్తం రూ. 81,016 లకు కూడా లెక్కలు లేవని తేల్చేశారు. వీటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడు రోజుల వ్యవధిలో ప్రత్తిపాడు ప్రభుత్వ ఖజానా కార్యాలయంలో జమ చేయలేదని, ఆ తర్వాత కూడా ఏమయ్యాయో తెలియదనీ ఆమె నిర్ధారించారు.

27.4.2021 నాటి విధి నిర్వహణా సమయంలో కరోనా అని తెలిసి కూడా తన సహచర కార్యదర్శులతో బులివీరన్న సమావేశాన్ని నిర్వహించడం, సామూహిక విందారగించడం, తర్వాత సిసిఏ నిబంధనలను అతిక్రమించి బులివీరన్న తన ఉన్నతాధికారి ఎంపీడీవో జె.రాంబాబుపై పలు ఆరోపణలను మీడియా సమావేశంలో చేసారనే అభియోగాలతో జిల్లా పంచాయితీ అధికారికి తన నివేదికను డివిజనల్ పంచాయితీ అధికారిణి అమ్మాజీ సమర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి సిఫారసు మేరకు మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని పంచాయితీ కార్యదర్శి కాకరపర్తి బులివీరన్నను జిల్లా పంచాయితీ అధికారి ఆదేశిస్తూ షోకాజ్ ఉత్తర్వులను మంగళవారం జారీ చేశారు

అభియోగంలో నమోదైన నిధుల మొత్తాన్ని తాము వస్తు సామాగ్రి కొనుగోలుకు వినియోగించామని బులివీరన్న www.janaasavaartha.com కు
వివరణ ఇచ్చారు. వాటికి సంబంధించిన బిల్లులను ఆయా దుకాణాల సంస్థల నుంచి కరోనా కారణంగా విచారణ సమయానికి తాము సమకూర్చలేక పోయామని తెలిపారు. విచారణ రోజు నుంచి నేటి వరకూ నేను నా కరోనా సెలవులో ఉన్నానని అన్నారు. బిల్లులు, ఎం.బుక్కులను పక్కాగా అధికారులకు సమర్పించ గలమన్నారు. ఆ మేరకు షోకాజ్ ఉత్తర్వులకు సంతృప్తి కరమైన వివరణను అధికారులకు సకాలంలో అందివ్వగలననీ కార్యదర్శి కాకరపర్తి బులివీరన్న వివరణ ఇచ్చారు.


ఒక వివరణ

కత్తిపూడి పంచాయితీలో రూ. 42.44 లక్షల గోల్ మాల్ జరిగాయని / దుర్వినియోగం అయ్యాయని / సొంతానికి వాడు కున్నారని / స్వాహా అయ్యాయని / పక్క దారి పట్టాయని గాని డిఎల్పీఓ తన నివేదికలో పేర్కొనలేదు.

———————————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *