* సొమ్ము బాబ్జికి, కష్టాలు ప్రజలకు

ఫోటోలు చూసి ఇది మట్టి రోడ్డు అని అనుకుంటు ఉన్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. విశాఖపట్నం జిల్లా యస్.రాయవరం మండలం లింగరాజుపాలెం తారు రోడ్డు ఇది. మీరు నమ్మండి, నమ్మక పొండి. ఇది నిజం. వారం రోజుల క్రితం ఈ తారు రోడ్డు నల్ల త్రాచు పాములా నిగనిగా నల్లగా మెరిసి పోయేది.

లింగరాజుపాలెంనకు చెందిన వైస్సార్ పార్టీ గ్రామ నాయకుడైన అన్నందేవర పాలబాబ్జి, ఇతని కుమారుడు శివ నిర్వాకం పుణ్యమా అని ఇలా మట్టి రోడ్డులా తయారైంది. స్వంత ట్రాక్టర్లు ఉండి, ఈ ప్రాంతంలో ఎవరికైనా ఇసుక, మట్టి, గ్రావెల్, రాయి అక్రమంగా రవాణా చేసి అందించడంలో ఘనాపాటీలు. వరహానది పెనుగొల్లు – ధర్మవరం వద్ద రెండుగా చీలి పోయి మూడు ఏరుల మొగ వద్ద సముద్రంలో కలుస్తుంది. లింగరాజుపాలెం గ్రామంతో పాటు సమీప అగ్రహారం, కర్రివాని పాలెం, పిట్లపాలెం, గ్రామాలు వరహా నది రెండు చీలికలు మధ్యలో ఒక దీవిగా ఉంటుంది. దీనితో వరహానది రెండింటి మధ్య లింగరాజుపాలెం ఉండడంతో భౌగోళికంగా కలిసి రావడంతో కుడి, ఎడమ రెండు వైపులా ఉన్న నదిలో లభ్యమయ్యే ఇసుక, మట్టిని అక్రమంగా తమ సొంత ట్రాక్టర్లలో రవాణా చేయడం ప్రవృత్తిగా పెట్టుకున్నారు.

ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ వ్యాపారం కొన సాగిస్తున్నారు. 200 ప్రొక్లైన్, మరో జేసిబిలతో సుమారు 20 ట్రాక్టర్లతో ప్రస్తుత కరోనా నిబంధనలు త్రోసి రాజని 10 రోజుల నుండి తెల్ల వారు జాము నుండి రాత్రి వరకు మట్టిని తొలడంతో, స్పీడుగా వెళుతున్న ట్రాక్టర్ల నుండి క్రింద పడిన మట్టిపై ట్రాక్టర్లు తిరగడంతో నల్లగా నిగనిగలాడే తారు రోడ్డు కాస్తా మట్టి రోడ్డుగా మారింది. నిరక్షరాస్యులు సరియైన పత్రాలు, లైసెన్సులు లేని వ్యక్తులు ఇష్టా రాజ్యంగా ట్రాక్టర్లను నడుపు తుండడం, తక్కువ సమయంలో ఎక్కువ ట్రిప్పులు తోలుకొని ఆర్థిక ప్రయోజనం పొందాలన్న దురాశతతో వేగంగా తోలడంతో కుదుపులకు రోడ్డు అంతా మట్టి పడి ఈ 10 రోజులకే తారురోడ్డు మట్టి రోడ్డుగా మారింది. ప్రస్తుత కోవిడ్ కారణంగా మధ్యాహ్నం 12 గంటల వరకే వాహనాలు తిరగాలన్న నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతూ తోలుతున్నా ఈ ట్రాక్టర్లపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ట్రాక్టర్ల మితిమీరిన వేగానికి, రేగుతున్న దుమ్ము దూళికి రోడ్డుపై ఎదురు వచ్చు వ్యక్తులు, వాహనాలు కనిపించక రోడ్డుపై వెళ్ళు పాదచారులు, వాహన చోదకులు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగు తుందో నని బిక్కు బిక్కు మంటూ భయ పడు తున్నారు.

ట్రాక్టర్లు రొదలే కాకుండా, రోడ్డు ప్రక్కన ఉన్న , ఇల్లు, పొలాలు, పశువులు అన్నీ రూపు రేకలు మారి, రోజూ దూళితో నిండడంతో గృహస్తులు, రైతుల బాధలు చెప్పనలవి కాదు. సొమ్ము బాబ్జికి, దుమ్ము ప్రజలకు అన్న చందంగా పరిస్థితి తయారైంది. ప్రతి రోజూ ఇన్ని ట్రాక్టర్లుతో ఏ విధంగా కనీస స్పృహ, బాధ్యత లేకుండా తిరగడానికి సంబంధిత జలవనరుల శాఖ, రెవిన్యూ శాఖ, పోలీసు శాఖ ఏమి ప్రయోజనం ఆశించి అనుమతులు ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 12 గంటల తరువాత రోడ్డుపై వాహనాలపై తిరిగి నప్పుడు, మాస్కులు లేకుండా ఉన్న వ్యక్తులకు ఫోటోలు తీసి ఆన్లైన్లో రూ 535 ఫైన్ వేస్తున్న పోలీసులుకు నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న ఈ ట్రాక్టర్లుపై దృష్టి సారించ వలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నందున సంబంధిత అధికారులు విచారించి ప్రజల కష్టాలు తీర్చవలసిందిగా సోమిరెడ్డి రాజు, కన్వీనర్, యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ, యస్.రాయవరం మండలం కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *