* పరిశీలించిన ఇరిగేషన్ డి.ఇ.ఇ సుజాత.
* సర్వే చేసిన రెవెన్యూ శాఖ
* సోమిరెడ్డి రాజు ఫిర్యాదుతో కదలిక

పెదగుమ్ములూరు, 25 మే 2021
————————————————
పాక్షికంగా ఆక్రమణలు / కబ్జాకు గురైన
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులోని ఎర్ర చెరువు, తిమ్మాపురంలోని గెడ్డ వాగులను ప్రభుత్వ అధికారులు మంగళవారం ఉదయం పరిశీలించారు. యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు ఫిర్యాదు చేసినట్టు ఇక్కడి  ఆక్రమణలు నిజమని స్వీయ పరిశీలన అనంతరం అధికారులు ప్రాధమికంగా నిర్ధారించారు.

ఈ మేరకు సోమిరెడ్డి రాజు అన్ని ఆధారాలతో అధికారులకు సోమవారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇటు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారుల్లో కదలిక వచ్చింది. జరిగిన ఆక్రమణలపై తీవ్రంగా స్పందించారు. ఫిర్యాదులోని అంశాలపై వాస్తవ పరిశీలనా
వార్తా కథనాలు అన్ని పత్రికలతో పాటు మిగతా మాధ్యమాల్లో కూడా ప్రముఖంగా వచ్చిన కథనాలకు స్పందించిన యలమంచిలి ఇరిగేషన్ డి.ఇ.ఇ, ఇ.సుజాత, తహశీల్దార్ బి.సత్యనారాయణ సంయుక్త అదేశాలపై మండల సర్వేయర్ టి.రామారావు, స్థానిక వి.ఆర్.ఓ ఆర్.నూకరాజు తమ సిబ్బందితో మంగళవారం ఉదయం ఆయా ప్రాంతాలను కలిసి పరిశీలించారు. ఇరిగేషన్ డి.ఇ.ఇ, ఇ.సుజాత కూడా నేరుగా హాజరయ్యారు.

తిమ్మాపురం రెవిన్యూలో గెడ్డ వాగు, పెదగుమ్ములూరు రెవిన్యూలో చెరువు కబ్జాకు గురైందని ఈ వాగు, సర్వే నెంబర్లు 229, 230, 232, 233, చెరువు సర్వే నెంబర్లు 216-1, 216-3 లలో సర్వే చేసి, వాటి హద్దులను స్థిరీకరించాలని డిఇఇ. నిర్ణయించారు.  అలాగే ఆక్రమణలను తొలగించి హద్దులు నిర్ణయించి, సర్వే రాళ్లను వేసి తమకు అప్పగిస్తే, తాము రాబోవు కాలంలో ఎవరూ అక్రమించకుండా చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. ఆమె దగ్గరుండి జాయింట్ ఫీల్డ్ తనిఖీ, సర్వే చేయించగా ఆదర్శ పాఠశాల పక్కన ఉన్న గెడ్డ వాగు 252 లింకులు అనగా సుమారు 34 అడుగుల కాలువను దాదాపు 25 అడుగులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. గతంలో పంచాయతీ తీర్మానం చేసి 10 అడుగులు రోడ్డు వేయగా ఆ రోడ్డును ఆక్రమించి వెడల్పు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పాఠశాల వెనుక లేఔట్ కి సంబంధించి గెడ్డ వాగుని ఆనుకొని ఉన్న 4 బిట్లు గెడ్డ వాగు ఆక్రమించి వచ్చేలా వేసినట్లు గుర్తించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఆక్రమణలు తొలగించి హద్దులు నిర్ణయించి తమ జల వనరులశాఖకు గెడ్డ వాగును అప్పగించాలని ఈ సందర్భంగా ఆమె రెవెన్యూ అధికారులను కోరారు.

అనంతరం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. గెడ్డ వాగు, చెరువు కబ్జాకు గురైయ్యాయని మా దృష్టికి వచ్చిందన్నారు. దీనిలో భాగంగా జాయింట్ ఫీల్డ్ తనిఖీ, విచారణ కోసం ఇక్కడకు వచ్చానన్నారు.  ప్రాధమికంగా సర్వే చేసినంత వరకు గెడ్డ వాగు ఆక్రమణకు గురైనట్లు గుర్తించా మన్నారు. అయితే తహశీల్దార్ కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్వే రిపోర్ట్ మాకు రాత పూర్వకంగా రావాల్సి ఉందని తెలిపారు. ఈ విషయంపై జిల్లా ఉన్నత అధికారులకు నివేదిక అందజేస్తామని సుజాత తెలిపారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సిబ్బంది, గ్రామ రెవెన్యూ అధికారులు ఆర్.నూకరాజు, బి.గోపి, సచివాలయం సర్వేయర్లు, దస్తగిరి, లోకేష్, వీరేoద్ర, కళ్యాణ్, శ్రీనివాస్, దిలీప్, తిమ్మాపురం సర్పంచ్ కర్రి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ అద్దేపల్లి నూకినాయుడు, బొండా దివాణం, గుర్రం నానాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *