* రోజుకు 600 మందికి కరోనా టీకాలు
* ఉదయం, మధ్యాహ్నం ఏకబిగిన సేవలు
* దండోరాతో జనంలో ప్రచారం

శంఖవరం
—————-
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో కరోనా నివారణకు రోజుకు 600 మందికి సూది మందులను వేస్తున్నారు. 45 సంవత్సరాలు వయస్సు మీరి, అర్హులైన వారికి మండలం మొత్తం మీద ఉదయం పూట 300 మందికి మధ్యాహ్నం నుంచి మరో 300 మందికి టీకాలను వేస్తున్నారు. శంఖవరంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఈ టీకాలు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసారు. జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు రోజుకు 600 మందికి టీకాలు వేసే ప్రక్రియను బుధవారం నుంచి కొనసాగిస్తూ ఉన్నారు. టీకాలు వేసే కార్యక్రమం గురించి గ్రామాల్లోని ప్రతీ ఒక్కరికీ తెలిసేలా దండోరా వేయించాలని సచివాలయాల సిబ్బందిని ఎంపీడీవో. జె.రాంబాబు ఆదేశించారు. మండల కరోన నివారణ బృందంలోని త్రిమూర్తులైన మండల ప్రజా పరిషత్తు అభివృద్ధి అధికారి జె.రాంబాబు, మండల ప్రభుత్వ ప్రధాన వైద్యులు ఆర్వీవీ సత్యనారాయణ, మండల తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం రోజూ ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. నిత్యం సమన్వయంతో వ్యవహరిస్తూ తమ సిబ్బందితో ప్రజలకు ఏ ఇబ్బందీ లేని రీతిలో ఉత్తమ సేవలు అందించేందుకు చేస్తున్న నాయకత్వ కృషి ప్రశంసనీయమైనది. మిగతా కొందరు అధికారులు మాదిరిగా తమ కార్యాలయాల కుర్చీలకు, సొంతింటి సేవలకూ పరిమితమై పోకుండా కరోనా నివారణా సేవలందించడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ బృందంలో వీరు ముందుండి సమయానికి తగు సేవలతో తమ సిబ్బందిని ముందుకు నడిపించడంలో వీరికి వీరే సాటి. వీరిలో ఎవరెక్కువ, ఎవరు పెద్ద, ఎవరి కృషి ఎంత అనే ఆధిపత్య, వ్యక్తిగత భేషజాలకు పోకుండా కరోనా నివారణలో వీరి ముగ్గురిదీ ఏకాత్మ అనే భావ సారూప్యంతో సమన్వయంతో మెలగడం బాధితుల పట్ల వారి సహృదయతకు ఓ చక్కని నిదర్శనం. కరోనా ఫీవర్ సర్వే మొదలుకొని శంఖవరం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, బాధితులకు అనంతర సేవలు అందించడం, కరోనా పీడిత ప్రాంతాల్లో మెరుగైన సంపూర్ణ పారిశుద్ధ్యం నిర్వహణ, హోమ్ కోరంటైన్ సేవలు, కత్తిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక హోమ్ కోరంటైన్ కేంద్రం ఏర్పాటు, వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పనకు దాతల అన్వేషణ, వారికి సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడం, శంఖవరంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో టీకాల కేంద్రం ఏర్పాటు, ప్రస్తుతం రోజూ ఉదయం పూట 300, మధ్యాహ్నం నుంచి మరో 300 మందికి టీకాలు వేసే నిరంతర ప్రక్రియ స్వీయ పరిశీలన, అందుకు ముందస్తు ఏర్పాట్లు, మండలంలోని 14 పంచాయితీలు, 16 సచివాలయాల కార్యదర్శులు, ఇతర సిబ్బంది, శంఖవరం, పెదమల్లాపురం, రౌతలపూడిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆస్పత్రలు, దాని పరిధిలోని 14 ఆరోగ్య ఉప కేంద్రాలు, కార్యాలయ, క్షేత్ర స్థాయిలోని సుమారు వంద మంది సిబ్బందితో సమన్వయం, వారి సహాయంతో మండు వేసవిలో సమయానికి అన్న పానీయాలను కూడా విడచి ఈ కరోనా నివారణా మహా యజ్ఞంలో నిరంతర అవిరళ కృషి సల్పుతున్న ఈ త్రిమూర్తుల నిస్వార్థ సేవలు వారి ప్రాణాలను సైతం తృణపాయంగా ఫణంగా పెడుతున్నారని మనస్సున్న మనుషులు అంగీకరించి తీరాల్సిన అక్షర సత్యం. ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఇంతటి శ్రమకోర్చి సేవలను అందిస్తుంటే ఇప్పటికీ కూడా కొందరు నిరక్షరాస్యులు, అమాయక ప్రజల్లో గూడు కట్టుకున్న కరోనా భయాందోళనలను తొలగించడంలో సామాజిక సేవా సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, యువజన సంఘాల నుంచి సామాజిక బాధ్యతాయుతమైన కృషి జరగాల్సిన దాని కన్నా కనీస స్థాయిలో కూడా జరుగక పోవడానికి ప్రధాన కారణం కరోనా ప్రాణ భయం కావొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *