* రెవెన్యూ అధికారుల ఘన కార్యం
* జలవనరులశాఖ అధికారుల ఉదాసీనత
* అక్రమణదారుల పాలవుతున్న విలువైన ప్రభుత్వ భూములు
* 400 ఎకరాల ఆయకట్టుకు నష్టం

లింగరాజుపాలెం – జనాసవార్త
—————————————–

చెరువు, దేవాదాయ ధర్మాదాయశాఖ భూములు, పంట కాలువలు, గోర్జి, రహదారుల భూములు, పుంత మార్గాలూ, రైతుల పొలం దారి మార్గాలు, చెరువు గర్భాలు, గోర్జి, బండి బాట, రహదారులను ఎవరికీ అమ్మ కూడదు…. ఎవ్వరికీ పట్టాలు ఇవ్వకూడదు… ఎటువంటి కట్టడాలు (అనగా ప్రభుత్వ భవనాలు కూడా) కట్ట కూడదన్న ప్రభుత్వ నిబంధనలు, ఉన్నత న్యాయ స్థానాల కోర్టు తీర్పులు ఉన్నాయి. కోర్టు తీర్పులు, ప్రభుత్వ నిబంధనలు మాకు పట్టవు అంటూ వ్యవరించే యస్.రాయవరం మండలం రెవిన్యూ అధికారులు చెరువు గర్భాలు, దేవాలయం భూములు, పంట కాలువలను నచ్చిన వారికి ధారా దత్తం చేయడంలో చాలా ముందు ఉంటారు. ఇలా ఓ చెరువు గర్భాన్ని అమ్మేసినట్టు ఎస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ సమన్వయకర్త సోమిరెడ్డి రాజు స్వీయ పరిశోధనలో వెలుగు చూసింది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం….”

విశాఖపట్నం జిల్లా యస్.రాయవరం మండలం లింగరాజుపాలెం గ్రామ రెవిన్యూ సర్వే నెంబర్ 171 లో 59.92 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొత్త చెరువులో 1.76 సెంట్లు భూమి విక్రయించినట్లు రెవెన్యూ రికార్డులు, 1 బి అడంగల్ ద్వారా తెలుస్తున్నది. గైగ్లాట్ ను పరిశీలించగా లింగరాజుపాలెం విలేజ్ 81 గా ఉండి కొత్త చెరువు సర్వే నెంబర్ 171 లో పూరా 59.92 ఎకరాలుగా జి.డబ్యూ మెట్టుగా ఉన్నది. 22A రెవిన్యూ ఫైనల్ గజిట్ 2015 పరిశీలించగా పూరా ఎకరాలు 59.92 సెంట్లు పోరంబోకు చెరువుగా ఉన్నది. అయితే సర్వే నెంబర్ 171-2A అడంగల్ ను పరిశీలించగా 1.76 సెంట్లు జిరాయతీ పట్టాగా, మెట్టు, వర్షాధారం ఖాతా నెంబర్ 7777, యజమాని పట్టాదారుగా, అనుభవ స్వభావం ‘క్రయం’ గా ఉన్నది. సర్వే నెంబర్ 171 అడంగల్ పరిశీలించగా 59.92 ఎకరాలు ప్రభుత్వ భూమి, చెరువు, ఖాతా నెంబర్ 20000506, ప్రభుత్వ మిగులు భూమిగా చూపుతుంది. ఇక గ్రామ 1B ని పరిశీలించగా సర్వే నెంబర్ 171-1 ఓ పంట మాగాణి 0.15 సెంట్లు ప్రభుత్వ భూమి గాను, సర్వే నెంబర్ 171-2B ఎకరాలు 1.76 సెంట్లు మెట్టు భూమిగా తప్ప 171 లో మరి ఏ ఇతర భూమి లేదు. ఇక 1బి పరిశీలించగా ఖాతా నెంబర్ 20000506 లో సర్వే నెంబర్ 171 చెరువుగా 59.92 ఎకరాలు ప్రభుత్వ భూమి గాను, సర్వే నెంబర్ 171-2A, చెరువు, 58.07 ఎకరాలు ప్రభుత్వ భూమి గాను తేదీ 10 ఏప్రిల్ 2012 న మ్యూటీషన్ ఆమోదించిన తేదీగా ఉన్నది. తేదీ 28.10.2015 న 1బి (ఆర్.ఓ.ఆర్) ను పరిశీలిస్తే ఖాతా నెంబర్ 10062 గా పట్టాదారు పేరు శ్రీబంగారమ్మతల్లి, తల్లి/తండ్రి పేరు దేవస్థానం, మెట్టు, కొనుగోలుగా ఉన్నది. పైన తెలిపిన గైగ్లాట్, 22A రెవిన్యూ ఫైనల్ గజిట్ 2015, అడంగల్, 1బి, 2015 లో 1B, స్కేచ్ లైన రెవిన్యూ రెవిన్యూ రికార్డులను పరిశీలిస్తే, అన్ని రికార్డులలో సర్వే నెంబర్ 171 పూరా 59.92 ఎకరాలు సెంట్లు, చెరువు, ప్రభుత్వ భూమిగా మాత్రమే ఉండాలి. అయితే ఏ ఒక్క రెవెన్యూ రికార్డులు కూడా ఒక దానికి, మరొక దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉండడం ఒక్క యస్.రాయవరం మండల తహశీల్దారు కార్యాలయానికే చెల్లింది.

రాష్టంలో ఎక్కడైనా చెరువుకు ఒక్క సర్వే నెంబర్ తో పూరా విస్తీర్ణంతో ఉంటాయి, ఉండాలి, సబ్ డివిజన్ చేయవలసిన అవసరం గాని, అవకాశం కూడా లేదు. చెరువును ప్రభుత్వ నిబంధనల ప్రకారం సబ్ డివిజన్ చెయ్యకూడదు. ఎందుకనగా చెరువు, దేవాలయం భూములు, పంట కాలువలు, గోర్జి, రహదారుల భూమిని ఎవ్వరికీ పట్టాలు గాని, ఎటువంటి కట్టడాలు అనగా ప్రభుత్వ భవనాలు కూడా కట్టకూడదన్న ప్రభుత్వ నిబంధనలు, ఉన్నత న్యాయ స్థానాల కోర్టు తీర్పులు ఉన్నాయి. కోర్టు తీర్పులు, ప్రభుత్వ నిబంధనలు మాకు పట్టవు అంటూ వ్యవరించే రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా యస్.రాయవరం రెవిన్యూ అధికారులు చెరువు గర్భాలు, దేవాలయం భూములు, పంట కాలువలు, గోర్జి, బండి బాట, రహదారులను నచ్చిన వారికి ధారాదత్తం చేయడంలో చాలా ముందు ఉంటారు. కొత్త చెరువులో సర్వే నెంబర్ 171-2A గా ఎకరా 1.76 సెంట్లు భూమిని ‘క్రయం’ గా చూపించడం, దీనికి మ్యుటీషన్ చేయడం, ప్రస్తుతం ఈ భూమిని లింగరాజుపాలెం గ్రామస్తుడు వైస్సార్ పార్టీకి చెందిన వ్యక్తి, పాయకరావుపేట మార్కెట్ కమిటీ సభ్యుడు అన్నoదేవర వీరన్న ఉరఫ్ బాబ్జి (పాల బాబ్జి) సర్వే తోట వేసుకొని తన ఆస్తిగా చేసుకొని అనుభవించడం ప్రణాళిక ప్రకారం చెరువు భూమి అన్యాక్రాంతం రెవిన్యూ అధికారుల సంపూర్ణ సహకారంతో జరిగినట్లు అర్థమవుతున్నది. ఈ భూమిలోకి పరిసర ప్రాంతాలలోకి వరదలకు వచ్చిన ఇసుక, మట్టిని ఇతడు అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటుంటాడు. ఇప్పటికే యస్.రాయవరం అనంతసాగరం చెరువు సర్వే నెంబర్ 54 పూరా విస్తీర్ణం 42.59 సెంట్లు కాగా, దీనిని 4 సబ్ డివిజన్లుగా చేసి ఏకంగా 3 పట్టాలు 54-2 లో ఎకరాలు 1.62 సెంట్లు, 54-3 0.50 సెంట్లు, 54-4 లో 1.24 సెంట్లు మొత్తం ఎకరాలు 3.36 సెంట్లు, 4 సబ్ డివిజన్లు గా చేసి ఓకే వ్యక్తి పేరున పట్టాలు ఇచ్చిన ఘన చరిత్ర యస్.రాయవరం రెవిన్యూ అధికారులది. తేదీ 29.11.2019న యలమంచిలి సర్కిల్ జల వనరుల శాఖ డి.ఇ.ఇ, ఇ.సుజాత, తహశీల్దార్, యస్.రాయవరం కు అనంతసాగరం చెరువు ఆక్రమణలకు గురైనదని, జాయింట్ సర్వే చెయ్యాలని కోరి ఇప్పటికి 18 నెలలు గడిచినా ఈ రోజుకీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదే పిర్యాదు రాష్ట్ర లోకాయుక్త లో కేసు నడుస్తున్నది.

ఇదే విధంగా కర్రివానిపాలెం కొత్త చెరువు(నక్కల చెరువు) సర్వే నెంబర్ 159 లో ఎకరాలు 16.20 సెంట్లు సూపరెండెoట్ ఇంజినీర్ (ఎస్.ఇ), రవికుమార్ ఈ రెండు చెరువులను స్వయంగా పరిశీలించి ఆక్రమణలు తొలగించ డానికి చర్యలు చేపడతామని హామి ఇచ్చి ఏడాది దాటినా చర్యలు లేవు. నెల క్రితం కర్రివానిపాలెం సర్పంచ్, ఉపసర్పంచ్, మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ లు గ్రామస్తులు తమ గ్రామంలోని అన్ని చెరువుల్లోనూ సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని చేసిన పిర్యాదుకు స్పందన లేదు. కర్రివానిపాలెం వరహానది (ఊట చెరువు)లో అక్రమంగా మాజీ ఎంపిటిసి ఇప్పటికే ఒక ఇల్లు నిర్మించుకొని, ఇప్పుడు ఆ ఇంటి ముందు భాగంలో ఉన్న ఖాలీ స్థలం చెరువు గర్భంలో మరో అధునాతన ఇల్లు నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు, లాయర్ నోటీసులు ఇచ్చినా సంబంధిత అధికారులు ఎవ్వరూ ఎటువంటి చర్యలు చేపట్టక పోవడం ప్రభుత్వ భూములు కాపాడ వలసిన ఈ అధికారులే వాటిని తమ స్వార్ధానికి పప్పు, బెల్లాల్లా అక్రమార్కులకు కట్టబెట్టడం ఇక్కడ అధికారులకే చెల్లింది. సర్వే చేస్తే తమ శాఖ అధికారుల అక్రమాలే బయట పడతాయన్న ఉద్ధేశంతో వాటి జోలికి వెళ్లకుండా సంవత్సరాలకు, సంవత్సరాలు కాల యాపన చేస్తున్నారు.

ఈ మండలంలో అధికారులు, నాయకులు ‘రింగ్’ గా ఏర్పడి ఇష్టా రాజ్యంగా ఆక్రమాలకు పాల్పడ్డారని పలువురు ఫిర్యాదులు చేశారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ మండలంలోని అక్రమాలపై ప్రత్యేక దృష్టి చారించి అక్రమాలను సరి చేసి, అక్రమాలకు పాల్పడిన సంబందిత అధికారులపై చర్యలు తీసుకొని అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *