లింగరాజుపాలెం – జనాసవార్త
—————————————–
విశాఖపట్నం జిల్లా, యస్.రాయవరం మండలం, లింగరాజుపాలెం గ్రామ పరిధిలోని అన్ని  ఆక్రమణలను భేషరతుగా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. స్థానిక దేవాలయం, త్రాగు నీటి బావి దారి, త్రాగు నీటి బోరు ప్రాంతాలతో పాటు పంట కాలువలను సైతం ఆక్రమించి మట్టి కప్పి పూడ్చారని, వీటిపై తక్షణమే అధికారులు స్పందించి, విచారణ చేసి ఆక్రమణలను తొలగించాలని యస్.రాయవరం మండలం యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఆర్టీఐ కన్వీనర్ సోమిరెడ్డి రాజు సంబంధిత శాఖల అధికారులను కోరుతున్నారు. లింగరాజుపాలెం కొత్త చెరువు చప్టా (సర్ ప్లస్ వియర్) కాలువపై ఎస్.సి.కాలని వాసులకు నిర్మించిన వంతెన ఆవల ఉన్న రైతులు సానా సత్తిబాబు ఇతని సోదరులు బాబురావు, తాతారావు, రాంబాబు తదితరులు ఆ వంతెన దిగువన ఉన్న భూమిని అక్రమించు కొన్నారని, కొత్త చెరువు నుండి అక్రమంగా మట్టిని తెచ్చి ఆ ఆక్రమిత భూమిలో వేసి చదును చేసారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలని సమీపంలో ఉన్న మంగళి చెరువు ఇప్పటికే ఆక్రమణలకు గురైంది.

ఇప్పటి వరకు కొత్త చెరువు, పాత (నక్కల) చెరువు, మoగలి చెరువు, దేవాలయం భూములను కొందరు  అక్రమించున్నారని ఫిర్యాదులు వచ్చినా, సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో అలుసుగా తీసుకొని మిగిలిన పంట కాలువల్లో కూడా ఆక్రమిస్తూ ఉన్నారు. సర్వే నెంబర్ 261-9A లో 1.47 ఎకరాల భూమిలో ఎస్.సి కాలనీ ఉంది. వీరికి త్రాగు నీటి బావి, త్రాగు నీటి బోరు, వినాయకుని గుడికి పోవాలంటే పంట కాలువపై నిర్మించిన వంతెన దాటుకొని వెళ్ళవలసి ఉంటుంది. అయితే అక్రమణదారులు పంట కాలువ చెంత ఉన్న భూమిని మట్టి వేసి ఆక్రమించారు. దీని వలన కాలనీ వాసులు గుడికి, త్రాగు నీటి బావికి వెళ్లడానికి దారి లేకుండా పోయింది. కాలనీ వాసుల త్రాగు నీటి బోరును కాలువ అవతల వైపు వేసి, అక్కడ నుండి పైపు ద్వారా కాలనీలోని నీటి ట్యాంకుకు నీటిని నింపేవారు. కాలనీ వాసుల కొరకు వేసిన త్రాగు నీటి బోరులో వరదలకు వచ్చిన బురద వల్ల పాడైంది. ఇప్పటికైనా ఆ బోరుకు మరమత్తులు చేసి వినియోగంలోకి తేవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పవచ్చు. ఎస్.సి.కాలని వాసులు త్రాగు నీటికి ఇబ్బంది పడకుండా వేరే బోరు నుండి నీటిని పంపుతున్నారు. ఇప్పకైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణల వలన ఎస్.సి. కాలనీ వాసులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆక్రమణలను తొలగించడం ద్వారా త్రాగునీటి బావికి, దేవాలయం, త్రాగు నీటి బోరు ప్రాంతం మార్గాన్ని సుగమం చేసీ ఉపయోగంలోకి తీసుకు రావాలని కోరుతున్నారు. బోరును, ఆ ప్రాంతంలో మట్టితో కప్పినందున తొలగించి, ఆక్రమణ దారులపై చట్ట ప్రకారం  చర్యలు తీసుకొని, కాలనీ వాసులను కష్టాల బారి నుండి కాపాడాలని సంబంధిత అధికారులను సోమిరెడ్డి రాజు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *