అంతర్వేది – జనాసవార్త
———————————–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది గ్రీన్ వార్మ్ సంస్థ సభ్యురాలు తాడి దీపికకు అరుదైన అవకాశం దక్కింది. ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనేందుకు అవకాశం లభించింది. జూన్ 8న ప్రపంచ మహా సముద్రాల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్య సమితి వర్చువల్‌గా ఓ సదస్సును నిర్వహిస్తోంది. ఆన్‌లైన్ ద్వారా జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు గ్రీన్‌వార్మ్స్‌ సభ్యురాలు తాడి దీపికను ఎంపిక చేశారు. ఐక్యరాజ్య సమితి సముద్ర విభాగం ప్రతినిధులు ఇప్పటికే దీనికి సంబంధించి సమగ్ర సమాచారాన్ని ఆమె నుంచి వీడియో ద్వారా సేకరించారు. ఈ విషయాన్ని గ్రీన్‌వార్మ్స్‌ ప్రాంతీయ ప్రతినిధి అక్షయ్‌ గుంటేటి, ఆ సంస్థ సఖినేటిపల్లి మండల సమన్వయకర్త సునీల్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

వర్చువల్ ద్వారా జరిగే ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా 45 మంది పాల్గొననున్నారు. ఇందులో భారత్ నుంచి దీపిక పాల్గొంటున్నారు. అంతర్వేది కేంద్రంగా గ్రీన్‌వార్మ్స్‌, స్మార్ట్‌ విలేజ్‌ మూవ్‌మెంటు ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో జీరో వేస్ట్‌ ప్రాజెక్టు ఏర్పాటైంది. గోదావరి నదీ పాయలు, సముద్ర జలాల్లో ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. అయితే సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ఏటా జూన్ 8న ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

1992 లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన ఐక్యరాజ్య సమితి ధరిత్రి సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచడం కోసం ఏటా సముద్ర దినోత్సవం నిర్వహించాలని కెనడా ప్రతిపాదించింది. కాగా 2004 లో సునామీ వచ్చిన అనంతరం ఐక్యరాజ్యసమితి 8 జూన్ 2008 న తొలి సారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి దీనిని అధికారికంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *