శంఖవరం – జనాసవార్త
———————————–
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థ కిసాన్ మోర్చా
ఆధ్వర్యంలో శంఖవరం మండలంలో నిరసన దీక్షలను మంగళవారం నిర్వహించారు.
రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు, కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ సంయుక్త ఆదేశాల మేరకు రాష్ట్ర బాధిత రైతాంగానికి సంఘీభావం తెలుపుతూ శంఖవరం మండలం బీజేపీ అధ్యక్షులు పడాల నాగు ఆధ్వర్యంలో మండలంలో మండపం, నెల్లిపూడి, కత్తిపూడి, అన్నవరం తదితర గ్రామాల్లో కార్యకర్తలు ఎవరి ఇంటివద్ద వారే నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు పడాల నాగు ఓ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. 2020 – 21 సంవత్సర పంట కాలానికి 45 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా ఖరిఫ్ మొదలు కావస్తున్నా ఇప్పటి వరకు కేవలం 22 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరించిందని, అమ్ముకుందామంటే మిల్లర్లు ధర తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారని, సాకులు చెబుతూ ముప్ప తిప్పలు పెడుతున్నారని, ఫలితంగా రైతులు విసిగిపోయి దళారులకు తెగనమ్ముకునేలా చేస్తున్నారని విమర్శించారు. రైతుకి మద్దతు ధర దక్కటం గగనం అవుతున్నా మిల్లర్లు మాత్రం కోట్లు గడిస్తున్నారని, గత సంవత్సర పంట ధాన్యం బకాయిలు ఇప్పటి వరకు కొంత మంది రైతులకు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో చెల్లింపులు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో అది అమలుకావడం లేదని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరకు గ్యారంటీ కల్పించడానికి రూ. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసామని చెప్పి, దానిలో భాగంగా ఈ సంవత్సర బడ్జెట్లో రూ. 500 కోట్లు మాత్రమే కేటాయించారని, ఐనప్ఫటికీ ఏ ఒక్క రైతు పంటకూ కనీస మద్దతు ధర దక్కడం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం సూక్ష్మ సేద్య పధకం దాదాపుగా నిర్వీర్యం అయ్యిందని, రైతులకు అవసరమైన పరికరాల కొనుగోలుకు సబ్సిడి విడుదల చేయలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పంటలకు అవసరమైన పరికరాల కొనుగోలు కోసం రైతులకు దాదాపు 90 శాతం రాయితీని రాష్ట్రానికి విడుదల చేసిందని, అయితే వైసీపీ ప్రభుత్వం దీని సంగతే మరిచింది అన్నారు. సూక్ష్మ సేద్య నిధి కింద వివిధ రాష్ట్రాలకు రాయితీలతో కూడిన రుణాలను కేంద్ర రైతు వ్యవసాయ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిందని, ఈ ఏడాది ప్రాజెక్టు మంజూరైనా వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇప్పటికీ పరికణాలు ఇవ్వలేదని, ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన నిధులు రూ. 412 కోట్లు, నాబార్డు నిధులు రూ. 616 కోట్లు కలిపి మొత్తంగా రూ. 1,028 కోట్లు అందుబాటులో ఉన్నా ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించ లేదని, ఇకనైనా సూక్ష్మ సేద్యం యొక్క ఆవశ్యకతను గుర్తించి సంబంధిత పరికరాలను రైతులకు అందించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి గంటా బాలుదొర, మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ అప్పికొండ జోగిబాబు, మండల కార్యదర్శి బొమ్మిడి లోవరాజు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు కొయ్య శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *