* విద్యార్థులకు కంది పప్పు పంచిన ఎమ్మెల్యే

శంఖవరం – జనాసవార్త
———————————–
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు అందరికీ నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందివ్వాలని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ విద్యార్థుల తల్లి దండ్రులు పిలుపును ఇచ్చారు. ఇందుకోసమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రయోజనార్ధం మధ్యాహ్నం భోజన పధకం – జగనన్న గోరుముద్దను అమలు చేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రం శంఖవరం గ్రామంలోని వివిధ ప్రాంతాల్లోని మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులకు “జగనన్న గోరు ముద్ద పధకం”లో భాగంగా పౌష్ఠిక ఆహారంగా నాణ్యమైన కంది పప్పు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. గత ఏడాది సెప్టంబర్1 నుండి ఈ ఏడాది జనవరి 31 వరకూ గల కాలానికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందరికీ అందించే రేషన్ లో అదనంగా విద్యార్థులు, వారి తల్లి దండ్రులను ఓ చోట సమావేశ పరచి ఒక్కో విద్యార్థికి 4.5 కేజీల కంది పప్పు చొప్పున ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లి దండ్రులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. నాణ్యమైన కంది పప్పు పేకెట్లను ప్రభుత్వం నేరుగా ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్నదని ఆయన చెప్పారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికీ 4.5 కేజీలు, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికీ 6.5 కేజీల చొప్పున కందిపప్పు పేకెట్లను విద్యార్థుల తల్లి దండ్రులకు ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పంపణీ చేస్తారని ఎమ్మెల్యే వివరించారు. అందువల్ల ప్రభుత్వ బడి పిల్లల తల్లి దండ్రులు అందరూ మీ పిల్లలు చదివే పాఠశాలల నుండి వెంటనే కంది పప్పు పేకెట్స్ ను తీసుకోవాలని ఆయన సూచించారు. వాటిని సక్రమంమంగా వినియోగించి, తమ పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించి, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ, స్థానిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుర్రే వెంకటేశ్వర రావు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *