* కరోనా టీకాలపై అపోహలను వీడండి
* ప్రభుత్వ వైద్యమే కరోనాకు సమర్థ విరుగుడు
* తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్

రౌతులపూడి – జనాసవార్త
——————————————
కరోనా తర్డ్ వేవ్ ప్రభావంతో రాబోయే రోజుల్లో
పిల్లలు, గర్భిణీ స్త్రీలకు కరోనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారం రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అప్రమత్తం అయ్యిందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెల్లడించారు. రాబోయే ప్రమాదాన్ని నివారించ డానికి నేటి నుంచే ముందస్తు జాగ్రత్త చర్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించిందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాల లోపు వయస్సున్న పిల్లల తల్లులు అందరికీ కరోనా నివారణా టీకాలను వేసే ప్రక్రియను11.06.2021 నుండి ప్రభుత్వం ప్రారంభిస్తోందన్నారు.

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం రౌతులపూడిలోని ప్రభుత్వ ప్రజా వైద్యశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఆసుపత్రి పరిసరాలను ఆయన ఆసాంతం క్షుణ్ణంగా పరిశీలించారు. వార్డుల్లోని రోగులను కలిసి వారికి వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన స్థానిక పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ముందస్తు చర్చల్లో భాగంగా మన తూర్పు గోదావరి జిల్లాలో కూడా కరోనాను సమర్థ వంతంగా ఎదుర్కొనడానికి వైద్య పరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. టీకాపై అపోహలకు లోనుకాకుండా పిల్లల తల్లులు తప్పనిసరిగా ఈ టీకాలను వేయించు కోవాలని కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు.

రాబోయే తర్డ్ వేవ్ నుండి పిల్లలను, గర్భిణీ స్త్రీలను కాపాడటానికి జిల్లా యంత్రాంగం చేపడుతున్న ముందస్తు చర్యగా ఫిజియాలజీస్ట్, గైనకాలజిస్ట్ వంటి వైద్య సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటాం అన్నారు. అంతేకాకుండా జిల్లాలోని 25 ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో 30 నుండి 50 వరకూ పడకలను సిద్ధం చేసి ప్రతి పడకకు ఆక్సిజన్ లైన్లు ఏర్పాటు చేసే ప్రణాళికను ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
అదేవిధంగా వీటికి సంబంధించిన పరికరాలు, మందులు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
తప్పనిసరిగా తమ పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోనే బాధ్యత తల్లులపైనే ఉన్నదని ఆయన గుర్తుచేశారు.

ఇక ప్రస్తుత సెకండ్ వేవ్ కరోనా గురించి ఆయన వివరిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో ఎక్కువ మందికి కరోనా సోకిందని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని కేవలం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యం ద్వారా మాత్రమే సమర్థవంతంగా జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎదుర్కొన గలిగిందని కలెక్టర్ మురళీధర్ రెడ్డి వెల్లడించారు. టీకాలను వేయించుకుంటే కరోనా వ్యాధి సోకినా ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చుఅని ఆయన భరోసా ఇచ్చారు. ఈ భరోసాతోనే 45 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరూ టీకా కేంద్రాల్లో టీకాలను వేయించుకుని కరోనాను అరికట్టడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

రౌతులపూడి సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సేవలు సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇలానే ప్రతీ ఒక్క సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందీ సమర్ధవంతంగా సేవలను అందిస్తూంటే జిల్లా ఆస్పత్రులపై రోగుల భారం తగ్గుతుందని కలెక్టర్ వివరించారు. ఆయన వెంట సామాజిక ఆరోగ్య కేంద్రం డిసిఎస్ డాక్టర్ రమేష్ కుమార్, హెల్త్ సెంటర్ ఇంచార్జి రవికాంత్, డాక్టర్ జానకిదేవి, డాక్టర్ సునీత, డాక్టర్ సౌమ్య, వైద్య సిబ్బంది, తహసిల్దార్ ఎఎ అబ్బాస్, ఎంపీడీవో ఎస్వి నాయుడు, ప్రజా ప్రతినిధులు భాస్కర రావు, వరహాలదొర పాల్గొన్నారు.

ఫోటో రైటప్ : రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ మురళీధర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *