శంఖవరం – జనాసవార్త
———————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2019లో ప్రవేశ పెట్టిన సాగు రైతు హక్కు చట్టం కౌలు రైతులకు ఎంతో మేలు చేస్తుందని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం అన్నారు. సాగు రైతులు, కౌలు రైతుల ప్రయోజనార్ధం సార్వా సాగుకు సమాయత్తం, సాగు రైతు హక్కు పత్రాలు పొందడం అనే ప్రధానాంశాలపై రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు మండల కేంద్రమైన శంఖవరంలోని రైతు భరోసా కేంద్రం 2 లో మండల రెవెన్యూ, వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సదస్సుకు పంచాయతీ ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ మాట్లాడుతూ 1956 నాటి కౌలు రైతుల హక్కు చట్టాన్ని 2019లో ప్రభుత్వం రద్దు చేసి సాగు రైతు హక్కు చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని ఆయన వివరించారు. ఈ చట్టం వల్ల అసలు భూమి యజమానులైన రైతులకు ఏమాత్రం నష్టం వాటిల్లదని, ఆ భూమిపై సాగు చేసిన పంటలపై ఏడాదిలో 11 నెలల కాలానికి మాత్రమే కౌలు రైతులకు హక్కు ఉంటుందని, ప్రభుత్వ పరంగా రక్షణ, ఇతర ప్రయోజనాలూ ఉంటాయని సవివరంగా ఆయన పేర్కొన్నారు. అంటే కౌలు రైతులకు వారి పంటలపైనే తప్ప తాము సాగు చేస్తున్న భూములపై చట్ట బద్ధమైన ఏ హక్కులూ ఉండవని ఆయన వివరించారు. పంటలను సాగు చేస్తున్న రైతులు అందరికీ పంట సాగు రైతు హక్కు పత్రాలను (క్రాప్ కల్టివేషన్ రైట్ కార్డ్స్) అందించే ప్రణాళికను సిద్ధం చేసామని, రైతులు అందరూ వారి పంటలు సాగు వివరాలను రెవెన్యూ శాఖలో నమోదు చేయించు కోవాలని ఆయన పేర్కొన్నారు. వారిలో అర్హులకు వీఆర్వోలు, గ్రామ వ్యవసాయ శాఖ సహాయకులు త్వరలో పంట సాగు రైతు హక్కు పత్రాలను అందజేస్తారని తాహసిల్దారు కర్నాసుల సుబ్రహ్మణ్యం వెల్లడించారు.

అనంతరం మండలం వ్యవసాయ శాఖాధికారి కెజే. చంద్రశేఖర్ మాట్లాడారు. తొలకరి కాలానికి అనువైన ఆర్.జి.ఎల్ 2537 (శ్రీకాకుళం సన్నాలు), ఎంటీయు 1064 (అమర), ఎంటీయు 1061 (ఇంద్ర), ఎంటీయు 1121(శ్రీధృతి), బిపిటీ 5204 (సాంబ మసూరి) వంటి వరి రకాలతో పాటు పత్తి, పిల్లిపెసర విత్తనాలు, జీలుగు, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఎరువులు, విత్తనాలు అవసరం ఉన్న రైతులు ప్రభుత్వ రాయితీ ధరలపై పొందాలనుకునే రైతులు వారి స్థానిక గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బందిని సంప్రదించాలని రైతులకు ఆయన సూచించారు.
రైతులు అందరూ విధిగా ఈ- కర్షక్ నమోదు చేయించు కోవాలని ఆయన కోరారు. పావలా వడ్డీ రుణాలు, పెట్టుబడి రాయితీలు, పంటల బీమా, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు వంటి ప్రభుత్వ పధకాలు అమలు విధానం, వాటిలో రైతులు లబ్ది పొందే విధానం, ఇతరత్రా అంశాలపై రైతులకు కూలంకషంగా అవగాహన కల్పించారు. మండలం ఉద్యానవన శాఖాధికారిణి శ్రీవల్లి మాట్లాడుతూ పండ్ల తోటలు, కూర గాయలు, ఆకు కూరల పంటల వివిధ సాగు పద్దతులు, సాగు యాజమాన్యంపై వివరించారు. మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బొర్రా లచ్చబాబు, వీఆర్వోలు, విఎఎలు, విహెచ్ఏలు, విఎస్ఏలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *