శంఖవరం – జనాసవార్త
———————————
మండల కేంద్రమైన శంఖవరంలో రోడ్డు రవాణాశాఖ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు గిడ్డంగి భవనాల నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రభుత్వ ఖాళీ స్ధలాలను తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీషా మంగళవారం పరిశీలించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి జాతీయ రహదారిలో రావికంపాడు వెళ్ళే రోడ్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణాశాఖ కార్యాలయం, శంఖవరం వెళ్ళే రోడ్డులో రవాణా శాఖ డ్రయివింగ్ టెస్ట్ ట్రాక్ రెండూ కూడా ప్రైవేట్ స్థలాలు, భవనాల్లో అద్దె ప్రాతిపదికన ఎన్నో ఏళ్ళుగా కొనసాగు తున్నాయి. ఈ సమస్యను అధిగమించి ప్రభుత్వ స్థలంలో రవాణాశాఖకు సొంత శాశ్వత కార్యాలయం, ట్రాక్ ను ఏర్పాటు చేయడానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ సంకల్పించారు. ఈ క్రమంలో శంఖవరం తాహసిల్దారు కర్నాసుల సుబ్రహ్మణ్యం తో మాట్లాడి శంఖవరంలోని తాహసిల్దార్ కార్యాలయం ఉన్న ఊరకొండపై వెనుక ఉన్న రెండున్నర ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యే ప్రతిపాదించారు. అలాగే శంఖవరం, రౌతులపూడి మండలాల రైతుల ప్రయోజనార్ధం శంఖవరంలో వ్యవసాయ మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే తలంచారు. ఇందుకోసం శంఖవరంలోని అరుంధతీయ కాలనీకి, వాణీనవ దుర్గాదేవి ఆలయానికీ మధ్య ఉన్న ప్రభుత్వ ఖాళీ భూమిలో వ్యవసాయ మార్కెట్ యార్డును నిర్మించాలనీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ప్రతిపాదించారు. ఈ అరుంధతీయ కాలనీ భూమి
స్థలాన్ని గతంలోనే దేవాదాయ ధర్మాదాయశాఖ  నుంచి రెవెన్యూ శాఖ కొనుగోలు చేసింది.
ఈ రెండు తరహా భూముల్లోనూ ఆయా శాఖల భవనాల నిర్మాణానికి నిర్ణయిస్తూ  గతంలోనే మండల రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి
ప్రతిపాదిస్తూ నివేదికను పంపింది. ఈ నేపథ్యంలో ఈ స్థలాలను జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీషా, పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు పరిశీలించారు. వీరి వెంట తాహసిల్దారు కర్నాసుల సుబ్రహ్మణ్యం, ఎంపీడీవో జె.రాంబాబు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *