* వై.యస్.ఆర్. చేయూత సొమ్ము రూ. 4 కోట్లు పంపిణి

శంఖవరం – జనాసవార్త
———————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వై.యస్.ఆర్. చేయూత పధకం సొమ్ములను మూల నిధి పెట్టుబడిగా పెట్టుకుని సకుటుంబ జీననోపాధిని మెరుగుపరచు కోవాలని శంఖవరం ఎంపీడీవో జాగారపు రాంబాబు హితవు పలికారు. ఈ సొమ్ములను ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదని ఆయన స్పష్టం చేసారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైఎస్సార్ చేయూత లబ్ది పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం నిర్వహించారు. వైఎస్సార్ చేయూత పధకానికి మండల మహిళా శక్తి సంఘాల్లోని అర్హులైన 2,131 మంది సభ్యుల్లో ఒక్కొక్కరికీ రూ.18,750లు చొప్పున మండలంలోని ఎస్సీలకు 583, ఎస్టీలకు 218, బీసీలకు 1317, మైనారిటీలకు 13 మందికీ చొప్పున మొత్తం 2,131 లబ్ధిదారులకు మొత్తం లబ్ది రూ. 4 కోట్ల విలువగల చెక్కును శంఖవరం ఎంపీడీవో జాగారపు రాంబాబు, వైఎస్సార్ క్రాంతి పధం తుని ఏరియా కోఆర్డినేటర్ షేక్ మహబూబ్ వల్లీ, మండల వైయస్సార్ క్రాంతి పధం మండల ఇంచార్జ్ ఏపిఎం. జీవీ.ప్రసాద్ సంయుక్తంగా మండల మహిళా సంఘం ప్రతినిధులకు అందించారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎంపీడీవో మాట్లాడారు. ఈ సొమ్ములతో చిన్న తరహా కుటీర పరిశ్రమ, చిరు వ్యాపారాలను చేసుకుంటూ కుటుంబం ఆదాయాన్ని పెంచు కోవాలని వివరించారు. ప్రస్తుతం ఒక్కో లబ్దిదార మహిళకూ ప్రభుత్వం అందిస్తున్న రూ.18,750ల ఆర్ధిక సహాయానికి తోడుగా వడ్డీ లేని రుణాలను బ్యాంకుల నుంచి ప్రభుత్వం మంజూరు చేయిస్తుందని ఆయన వివరించారు. అనంతరం వైఎస్సార్ క్రాంతి పధం తుని ఏరియా కోరి ఆర్డినేటర్ షేక్ మహబూబ్ వల్లీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ క్రాంతి పధం మహిళా శక్తి సంఘాల్లోని ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ సామాజిక వర్గాల్లోని 45 – 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అర్హులైన ప్రతి సభ్యురాలి సకుటుంబ జీవన ఉపాధికి ప్రతీ ఏడాదీ ప్రభుత్వం ఈవిధంగా ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నదని అన్నారు. ప్రస్తుతం అందిస్తున్న రెండో ఏడాది లబ్ది నగదును ఇప్పటికే లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న వ్యాపారాలను మరింత మెరుగు పరచు కోడానికి, నూతన వ్యాపారాలను ప్రారంభించు కోడానికి మాత్రమే ఈ నగదును వినియోగించు కోవాలని ఆయన వివరించారు. వ్యక్తిగత అవసరాలకు ఎంత మాత్రం వినియోగించ కూడదని వల్లీ స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ క్రాంతి పధం కత్తిపూడి సీసీ సీత, శంఖవరం సీసి నాగలక్ష్మి, వివోఏలు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు హాజరు అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *