శ్రీకాకుళం – జనాస వార్త
——————————–
ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్, పద్మశ్రీ కరణం మల్లీశ్వరి(46) నియమితులు అయ్యారు. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ స్పోర్ట్స్ విశ్వ విద్యాలయానికి కరణం మల్లీశ్వరి మొట్టమొదటి వీసీ అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్వరలోనే ఈ నియామకానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తామని తెలిపారు.

ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన కరణం మల్లీశ్వరి 2000 సంవత్సరంలో సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్‌కు కాంస్య పతకం సాధించారు. భారత్ తరుపున ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన మొట్ట మొదటి మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఒలింపిక్ విజయానికి ముందే.. 29 అంతర్జాతీయ పతకాలతో రెండుసార్లు వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ గా కరణం మల్లీశ్వరి నిలిచింది. ఇందులో 11 బంగారు పతకాలు ఉన్నాయి. 1999లో కేంద్రప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో కరణం మల్లీశ్వరిని సత్కరించింది. 1994లో అర్జున అవార్డు అందుకున్న మల్లీశ్వరి 1995లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని అందుకుంది. 1994, 1995 లలో 54 కేజీల బరువు విభాగంలో రెండు సార్లు వరల్డ్ టైటిల్‌ సాధించి ఛాంపియన్‌గా నిలిచారు.1994లో ఇస్తాంబుల్‌లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. 1995లో కొరియాలో ఆసియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ సాధించారు. ఒలింపిక్స్‌లో కాంస్య పథకం సాధించడం కంటే ముందే 29 ఇంటర్నేషనల్ మెడల్స్‌తో పాటు రెండు సార్లు వెయిట్ లిఫ్టింగ్‌లో మల్లీశ్వరి ఛాంపియన్‌గా నిలిచారు. 1999లో మల్లీశ్వరికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ అవార్డులు వరించాయి.

శ్రీకాకుళంలోని ఆమదాలవలసకు సమీపంలో ఉన్న వూసవానిపేటలో మల్లీశ్వరి జన్మించారు. ఆమెకు నలుగురు అక్కాచెల్లెళ్లు. అందరూ వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ పొందినవారే. 12 ఏళ్ల వయసులో మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లి అక్కడ శిక్షణ పొందారు. 1997లో వెయిట్ లిఫ్టర్ రాజేశ్ త్యాగిని ఆమె వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.

కాగా, స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులు ఇకపై ఇక్కడ తాము ఎంచుకున్న క్రీడాంశంలో డిగ్రీ పొందవచ్చని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఇటీవల తెలిపారు. వారు ఇతరత్రా మరే డిగ్రీ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒలింపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 వరకు పసిడి పతకాలు తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ వర్సిటీ ఏర్పాటు వెనుకున్న ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ క్రీడారంగంలో దేశాన్ని గర్వించేలా చేస్తుందన్న నమ్మకం ఉందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *