శంఖవరం – జనాసవార్త
—————————————

పాశ్చాత్యుల పరాయి పాలన అనే పెను చీకట్లు భరత ఖండాన్ని అలుముకున్న తరుణంలో తన రచనలనే కాంతి కిరణాలను ప్రసరింపజేసి భారతీయులు అందరిలోను దేశ భక్తిని, స్వాతంత్ర కాంక్షను మేల్కొలిపిన మహనీయుడు శ్రీ బంకించంద్ర చటోపాధ్యాయ. ఆయన 27 జూన్
1838 న నేటి వంగ రాష్ట్రంలోని 24 పరగణాల లోని కాంతలపాడులో జన్మించారు. తండ్రి మిడ్నాపూర్ లో ప్రభుత్వాధికారి. బాల్యం నుండే మేధావిగా, బుద్ధిశాలిగా పేరు గడించిన బంకిం కలకత్తాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి పట్టభద్రుడై కేవలం ఇరవై యేండ్ల అతి చిన్న వయసులోనే జెస్సూర్ లో డిప్యూటీ మెజిస్ట్రేట్ గా పదవీ బాధ్యతలు స్వీకరించడం ద్వారా తన వృత్తి జీవితాన్ని ఆరంభించారు.

బహుముఖ బాధ్యతలు….

ఒక వంక తన వృత్తి జీవితాన్ని నిబద్ధతతో కొనసాగిస్తూనే మరో ప్రక్క రచయితగా, సంపాదకునిగా, సాహితీ విమర్శకునిగా బహుముఖ బాధ్యతల్ని సమర్ధతతో నిర్వహించారు బంకిం. ఆయన నెలకొల్పిన బంగదర్శన్ పత్రిక బెంగాలీ భాషా సాహిత్యాలకే కాకుండా భారత సాహిత్యానికి, స్వాతంత్ర్య సమరానికి ఎనలేని సేవలు చేసింది. రచయితగా ఆయన విద్యార్ధి దశలోనే లలిత, మానస అనే పద్య సంకలనాలను వెలువ రించారు.

1865లో దుర్గేశనందినితో నవలా రచన ఆరంభించిన ఆయన కపాలకుండల, మృణాళిని, దేవిచౌధురాణి, రాజశేఖర, ఇందిర వంటి నవలల ద్వారా సాహిత్యాభిమానుల గుండెల్లో చిర స్థాయిగా నిలిచారు. ఆంగ్లేయుల పాలనలో భారతీయులపై జరుగుతున్న అరాచకాల్ని, అవమానాల్ని తన రచనల ద్వారా ఖండించే బంకిం న్యాయమూర్తిగా సైతం అదే పంథాను అనుసరించేవారు. ఆ కారణంగా ఆయన నాటి శ్వేత ప్రభుత్వం నుండి అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. నాటి పాలకులు ఆయనను తరచుగా ఒక చోటి నుండి మరో చోటికి బదిలీ చేసేవారు.

వందేమాతరం, ఆనందమఠం ….

చారిత్రక నేపథ్యంతో దేశ భక్తిని రంగరించి ఆయన రచించిన రచనలు నాటి పాఠకులలో, దేశ భక్తులలో సరిక్రొత్త ఆలోచనలను మేల్కొలిపాయి. బంగదర్శన్ సంచిక ఎప్పుడెప్పుడు వెలువడు తుందా అని నాటి బెంగాలీ సాహిత్యకారులు, పాఠకులు ఎదురు చూసేవారు. 1770 లో వంగ దేశంలో ఏర్పడిన క్షామం, ప్రజల పట్ల నాటి విదేశీ పాలకుల నిర్లక్షం, తత్పలితంగా జరిగిన సంతానుల(సన్యాసుల) విప్లవాన్ని భూమికగా చేసుకుని ఆయన రచించిన ఆనందమఠం నవలైతే నాటి దేశభక్తులను ఉర్రూత లూగించింది. ఈ నవలలోనే భారతీయులు అంతా స్వాత్రంత్ర్య పోరాటంలో భాగంగా ప్రణవ నాదంగా ఆలపించిన వందేమాతర గీతాన్ని పొందు పర్చారు.

నిజానికి బంకిం ఈ గేయాన్ని ఆ నవల కన్నా ముందుగానే రచించారు. ఒక నాడు రైలులో కలకత్తా నుండి తన స్వగ్రామానికి ప్రయాణించే సందర్భంలో పచ్చని పంటపొలాలతో, ఎత్తైన కొండలతో, సెలయేళ్ళతో, అరణ్యాలతో శోభిల్లే మాతృ భూమిలోనే ఆయనకు మాతృ దేవత సాక్షాత్కరించింది. అప్పుడాయన ఆ తల్లిని కీర్తిస్తూ వందేమాతరాన్ని రచించారు. బెంగాలీలు సహజంగానే మాతృ దేవత ఆరాధకులు. ఆనందమఠం నవలలో సర్వ దేవతల్ని మాతృ భూమిలోనే ఆవాహన చేశారు బంకిం. ఈ నవలలో భవానందుడనే పాత్ర ద్వారా ఒకా నొక సందర్భంలో రచయిత ఈ విధంగా చెప్పిస్తాడు. “మనం సకల దేవత ఆరాధనలు మానివేసి కొంత కాలం మాతృ భూమినే ఆరాధించాలి. ఆమె దాస్య విముక్తి పొందిన తర్వాతే ఇతర దేవతల ఆరాధన చెయ్యాలని”. ఈ ఒక్క వాక్యం చాలు. దేశం యెడల ఆయనకున్న భక్తిని, దృక్పధాన్ని అవగతం చేసుకోవడానికి.

మరొక సందర్భంలో వందేమాతరం గురించి స్నేహితుడొకరు వ్రాసిన లేఖకు స్పందిస్తూ “మిత్రమా భవిష్యత్తులో ఈ గేయాన్ని వింటే చాలు బెంగాల్ ఉన్మత్తతతో ఊగి పోతుంది”అని అన్నారాయన. నిజానికి ఆయన ఊహించిన దాని కన్నా అధికంగానే ఆ గేయం ప్రజాదరణను పొందింది. వందేమాతరం ఒక్క బెంగాల్నే కాదు యావత్ భారతాన్ని ఉర్రూతలు ఊగించింది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మొదలైన వందేమాతర ఉద్యమం భారతీయులు అందరిని ఏక త్రాటి పైకి తీసుకుని వచ్చింది. నాటి దేశభక్తుల ఉద్యమ రణ నినాదం వందేమాతరం.

ఎందరో స్వాత్రంత్ర వీరులు ఆంగ్లేయుల ఆఙ్ఞలను దిక్కరించి వందేమాతరం నినాదం చేస్తూ కఠిన శిక్షలకు గురయ్యారు. వందేమాతరం అన్న పదం వింటేనే ఆంగ్లేయులకు ముచ్చెమటలు పట్టేవి. బహుశా వారికా నినాదం భారత దేశంలో వారి పాలనకు భారతీయులు పాడుతున్న చరమ గీతంగా వినిపించేది కాబోలు. బంకిం అంటే బెంగాలీలో “వంగిన”అని అర్థం. ఆయన తనని తాను మాతృ భూమి పాదాల చెంత సాష్టాంగ పరచు కున్నారు. తన రచనలతో ఎందరికో ఆదర్శప్రాయులైన బంకించంద్రుడు 1894 ఏప్రిల్ 8 న పరమపదించారు.చంద్రుని జయంతి శుభాకాంక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *