* “వర్క్ ఫ్రమ్ హోమ్” పాటిస్తున్నారు
* ప్రభుత్వ నిబంధనలు భేఖాతర్
* రెవెన్యూ దస్త్రాలు ఇంటిలోనే పరిశీలన

రౌతులపూడి – జనాసవార్త
—————————————
ఆయన ఓ మండల న్యాయాధికారి… మండల తాహసిల్దార్ కూడా … ఆయన ఈ జూలై 31తో ఉద్యోగ విరమణ చేయనున్నారు… ఆయన ఓ మంచి అధికారి అని మండల ప్రజానీకం కితాబ్ ఇస్తారు…!!!. కానీ ఆయన తన రోజు వారీ విధులను నిర్వర్తించాల్సిన మండల రెవెన్యూ కార్యాలయానికి మాత్రం ముఖం చాటేశారు. విధి నిర్వహణ నిమిత్తం నాలుగు నెలల కాలంగా ఆయన కార్యాలయానికి హాజరు కావడం లేదు. ఐనప్పటికీ ఆయన తన విధులను నిర్వర్తించడం లేదా అంటే… లేదు అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఆయన తన ప్రభుత్వ ఉద్యోగ విధులను తను ఉన్న ఇంటి నుంచే నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు తాహసిల్దార్ కార్యాలయ దస్త్రాలను తన ఇంటికి కార్యాలయ నౌరకర్లతో తెప్పించుకుని ఏరోజు కారోజు కార్యాలయ పరిపాలనను తాను ఉంటున్న ఇంటి నుంచే ఎంచక్కా చక్కదిద్దేస్తున్నారు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన ఒక్కరే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. ఇంతకీ ఆ విశిష్ట తాహసిల్దార్ ఎవరు అని అనుకుంటున్నారా…?

ఆయనే తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండల తాహసీల్దార్ అబ్బాస్. నియోజకవర్గంలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం మండలాల తాహసీల్దార్లు అందరూ తమ తమ రెవెన్యూ కార్యాలయాలకు ప్రతి దినం హాజరయ్యి విధులను నిర్వర్తిస్తూ ఉండగా అందుకు భిన్నంగా రౌతులపూడి రౌతులపూడి మండల తాహసిల్దార్ అబ్బాస్ మాత్రం కార్యాలయ విధులకు కొంత కాలంగా గైర్హాజర్ అవుతున్నారు. కార్యాలయ విధులకు హాజరు కాని ఈయన తన కార్యాలయానికి ఎదురుగా ఓ వెయ్యి మీటర్ల దూరంలో తాను నివాసం ఉంటున్న ఇంటి నుంచే రెవెన్యూ కార్యాలయ, మండల ప్రజా పరిపాలన చేసేస్తున్నారు. ఇక కార్యాలయానికి నేరుగా వచ్చే వివిధ శాఖల అధికారులు, ముఖ్య ప్రజలకు డిప్యూటీ తహసీల్దార్ బాధ్యత వహిస్తున్నారు. ఇక సాధారణ ప్రజానీకం మాత్రం ఈ రెవెన్యూ కార్యాలయానికి తాసిల్దార్ అదిగో వస్తారు…. ఇదిగో వస్తారు… తమ గోడు, సమస్యలను చెప్పుకుందాం అని ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం వద్దే నిరీక్షించి ముఖ దర్శనం కాక చివరకు నిరాశతో వెనుదిరిగి పోతున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కొరోనా వ్యాధి ప్రజలను పీడిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో బహిరంగ ప్రజా సంచారాన్ని నియంత్రిస్తూ కర్ఫ్యూ, 144 సెక్షన్ వంటి అంశాలు అమలులో ఉన్నాయి. అంతే తప్ప ప్రభుత్వ రెవెన్యూ సిబ్బంది, కార్యాలయాలకు మాత్రం ఏ విధమైన కర్ఫ్యూ, వారం మొత్తం పని దినాలకు సెలవులు, వర్క్ ఫ్రం హోమ్ వంటి నిబంధనలను గాని, ఆంక్షలను గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విధించలేదు. ఐనప్పటికీ ఈయన మాత్రం తాసిల్దార్ కార్యాలయ విధులకు గైర్హాజర్ అవుతూ ఇంటికే పరిమితం అయ్యారు. పైగా ఇంటి నుంచే పాలన చేస్తున్నారు.

ఇదే విషయాన్ని రూఢీ చేసుకునేందుకు సోమవారం 28.06.2021 న మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గృహాన్ని www.janaasavaartha.com ప్రతినిధి  జక్కల నాగసత్యనారాయణ, ఫోటో గ్రాఫర్ సందర్శించారు. ఆయన గదిలో ఆయనతో కాసేపు ముచ్చటించాం. కరోనా, ఆయన వృద్దాప్యం, ఆరోగ్యం, నెల రోజుల్లో ఉద్యోగ విరమణ వంటి కారణాల నేపధ్యంలో ఒకింత ధీమాతో ఆయన రోజూ తన ఇంటిలోనే ఉంటూ ప్రభుత్వ కార్యాలయ దస్త్రాలను రోజువారీగా తన సిబ్బందితో ఇంటికి తెప్పించుకుని విధి నిర్వహణ చేస్తున్న విషయం ధృవీకరణ అయింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *