◆ మీడియాకు అనుమతి లేకుండా…
◆ తెలంగాణలో ‘పింక్’ మీడియా
◆ ఆంధ్రా లో ‘బ్లూ’ మీడియా
◆ రహస్య జీఓలు ఏల..?

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, హైదరాబాద్, 9440000009)

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శాసనసభ పరంగా మంచి బలం ఉంది. శాసించే పనితనం ఉంది. ఎటొచ్చి పడ్డ చిక్కల్లా… బహిరంగంగా ఉండాల్సిన… ఉంచాల్సిన జిఓలు… భయం భయంగా రాత్రి వేళ గోప్యంగా విడుదల చేయటం. పాత్రికేయ సమావేశాలకు అనుకూల మీడీయాలకు మాత్రమే సమాచారం ఇవ్వటం. అంతా ‘ఫీల్ గుడ్’ తరహాలో అధికారులు ‘చెప్పేదే వేదం’లా వ్యవహరించడం. అధికారులు కూడా అందుకు తగ్గట్లుగా భజన చేయడం. వెరసి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ అసలు ‘నైజాలు’ వదిలేసి అధికారుల ‘జోల’ పాటలతో ముందుకు సాగటం. అంతర్లీనంగా ఇద్దరూ భయపడుతూ.. ఈ విధంగా వ్యవహరిస్తున్నారా..? ఎవరినీ నమ్మనంతగా.. అత్యంత రహస్యంగా..తమ కార్యకలాపాలను సాగిస్తున్నారా..? తెలుగు రాష్ట్రాలలో బ్లూ, పింక్ మీడియాలతో నెలకొన్న రహస్య దాగుడు మూతలపై హైదరాబాద్’ నుంచి పరిశోధనా పాత్రికేయులు “ఆనంచిన్ని వెంకటేశ్వరరావు” అందిస్తున్న పరిశోధన కథనం.

కేసీఆర్ సార్.. ఇది తగునా..! :

ఉద్యమ సమయంలో అందరూ కావాలి. అధికారంలోకి రాగానే కొందరే అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రికేయ సమావేశాలకు కేవలం ‘పింక్ మీడియా’కు మాత్రమే ఆహ్వానం ఉంటుందా..? శుక్రవారం జరిగిన పాత్రికేయ సమావేశానికి కొందరు సీనియర్ పాత్రికేయులకు ఆహ్వానం లేదు. మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే ప్రవేశం అంటూ… ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ అనంతరం లోపలికి అనుమతించారు. ఇప్పటికే జర్నలిస్టులకు ఎదురైన అవమానాలకు ప్రెస్ అకాడమీ స్పందించిన దాఖలాలు లేవు. (చాలా సంఘటనలు ఉన్నాయి. వీటి గురించి చాలా లోతుగా తర్వాత కథనాలలో మాట్లాడుకుందాం). పత్రిక ప్రకటనల విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలి పూర్తిగా ఒక వర్గం.. అదే పింక్ మీడియాపై వల్లమాలిన ప్రేమ హోయలు ఒలకపోస్తుంది.

రహస్య జీఓల కేసు..హైకోర్టులో  :

తెలంగాణ ప్రభుత్వం వేలాది జీఓలు రహస్యంగా ఉంచిన వైనంపొ ‘ఆదాబ్ హైదరాబాద్’ గత ఏడాది సెప్టెంబర్ 20న ‘రహస్య జీఓల విలవ రూ. 6లక్షల కోట్లు’ ఆంటూ ఓ సంచలన పరిశోధన కథనం అందించింది. ఆ విషయంపై హైకోర్టులో వాజ్యం ఉంది.

జర్నలిస్టులకు ‘కరోనా’ బంధువా..? :

కరోనా వైరస్ ప్రారంభం… ‘జనతా కర్ఫ్యూ’, ‘లాక్ డౌన్’ అనగానే మీడియా అంతా ఒక్కసారిగా గుర్తుకు వచ్చింది. సమకరించాలని కోరారు. అప్పుడు బ్లూ, పింక్ మీడియాలు ఉండవ్. మీడియా.. మీడియానే అంటారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ఇచ్చారు. బాగుంది. అభినందనలు. మరి ఈ సమయంలో ప్రాణాలకు తెగించి వార్తలు అందిస్తున్న జర్నలిస్టులకు ‘కరోనా వైరస్’ ఏమైనా బంధువా..? వారిని ప్రభుత్వం ఎందుకు వదిలేసింది. ఈ కష్ట కాలంలో ఇతర శాఖలకన్నా.. మీడియా అద్భుతంగా పనిచేస్తుంది. స్వీయ నియంత్రణ సైతం పాటిస్తుంది. ఫ్రింట్ మీడియా కష్టాల్లో ఉన్నప్పటికీ.. వార్తలు పంపటంలో ఎక్కడా వెనుకడుగు లేదు. మరి అలాంటి జర్నలిస్టులకు రెండు తెలుగు ప్రభుత్వాలు ఏ, ఏ వసతులు, ఏ, ఏ అంశాలలో ప్రోత్సకాలు, ఆర్థిక సహాయం ఏ మేరకు చేస్తాయో వేచిచూద్దాం. అప్పుడు మంచి, చెడు నిర్ణయించుకునే అవకాశం పాత్రికేయులకు కూడా చిక్కుతుంది.

‘అండ’ ఏమిటో..! అడ్డంగా.. ప్రకటనలు ఏమిటో..?:

కరోనా సమయంలో ప్రకటనలు లేక పత్రికలు మూతపడుతున్నాయి కదా? మరి ఏపి సిఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రిక ఏ విధంగా ఉంది? ఎన్ని కరోనాలు వచ్చినా సాక్షి పత్రికను ఏం చేయలేవు. నిజం. సాక్షి పత్రికకు ఉన్న స్టామినా అది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్లు పేజీ యాడ్లు వచ్చేస్తుంటే దాని స్టామినా పెరగక తగ్గుతుందా? కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడు తుంటే సాక్షి పత్రిక మాత్రం ప్రకటనల పండగ జరుపుకుంటున్నది. ‘ముఖ్యమంత్రికి అండగా ఉందాం’ అంటూ ఇప్పటికే నాలుగు ఫుల్ పేజీ యాడ్లు విడుదల అయ్యాయి. ఒక్కో యాడ్ ఖరీదు అక్షరాలా కోటీ 36 లక్షల రూపాయలు. ముఖ్య మంత్రి ఫొటో ప్రముఖంగా సంబంధిత శాఖ మంత్రి ఫొటో కింద వచ్చే ఈ ప్రకటనలో కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఇందులో ముఖ్యమంత్రికి అండగా ఉండటం ఏమిటో అర్ధం కాదు.! కానీ మరెన్నో యాడ్లు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తున్నది.

ఏ శాఖలో డబ్బులు ఉంటే ఆ శాఖ లోని ఆ విభాగానికి సాక్షి బిల్లు పంపుతుంది. దాన్ని అక్కడ నుంచి చెల్లించే ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనా పై జరుపుతున్న పోరాటానికి ఇన్ చార్జి అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ పర్యవేక్షించే ఆళ్ల నాని ఫొటో మాత్రం ఉండదు. ఎవరి ఫోటో ఉన్నా లేక పోయినా డబ్బులు వచ్చేది సాక్షికే కాబట్టి ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పటికి ఐదు కోట్ల రూపాయలకు పైబడి సాక్షి ఖజానాలో జమ అయ్యయి. బిల్లు ఇచ్చారో లేదో తెలియదు కానీ ప్రభుత్వం ప్రకటన ఇస్తే డబ్బులు వచ్చేసినట్లే కదా.!

జీతాలు లేవు కానీ…:

8వ తేదీన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరుతో యాడ్ వచ్చింది. కోటీ 36 లక్షల రూపాయలు చెల్లించేస్తారు. పాపం ఆ శాఖకు చెందిన సమగ్ర శిక్షలో పని చేసే వారికి రెండు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. పని చేసేవారికి జీతాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు కానీ పత్రికలకు మాత్రం యాడ్లు వచ్చేస్తున్నాయి. ‘ముఖ్యమంత్రికి అండగా ఉందాం’ అని లలితా జువెలర్స్ వారు ఫస్టు సాక్షి పత్రికకు యాడ్ ఇచ్చారు. వామ్మో ఇదేదో కాన్సెప్టు బాగుందని అన్ని ప్రభుత్వ శాఖలూ క్యూ కట్టేశాయి. బ్లూ మీడియాకు డబ్బే డబ్బు.

జగన్ సార్… ఇది కరెక్టేనా..! :

జగన్ సర్కార్ అంత రహస్యంగా జీఓలు జారీ చేయడం వెనుక మర్మం ఏమిటి..? జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా జీఓలు అర్ధరాత్రి జారీ అవుతున్నయి. వందల జీఓలు ‘కాన్ఫిడెన్షియల్ కేటగిరీ’లో పడిపోయి, జనానికి కనిపించవు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ కొలువుకు ఉరితీసిన జీఓలు కూడా అంతేనా..? జగన్ ప్రభుత్వం తనకు అలవాటైన పద్ధతిలో అలా గోప్యతను మెయింటెయిన్ చేసిందా..? కాదు..! కావాలనే రహస్యంగా ఉంచారు… అదీ ఓ ఎత్తుగడే.!

చంద్రబాబు వల్లే అతి జాగ్రత్తలు :

చంద్రబాబుకు న్యాయవ్యవహారాల్లో పట్టుంది. నిమ్మగడ్డకు సపోర్ట్ తనే. అందులో ఎలాంటి సం’దేహం’ అవసరం లేదు. సో, ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన ఏ అధికారిక కాగితం దొరికినా సరే, దాన్ని పట్టుకుపోయి కోర్టులో స్టే తెచ్చేసుకుంటారనే జగన్ సందేహం..! అలా జరిగితే ఆయన నిర్ణయాలు అర్ధంతరంగా ఆగిపోతాయి. అందుకని కొత్త కమిషనర్‌ ను నియమించి, తను వచ్చి ఆ పదవిలో చేరేదాకా గోప్యంగా ఉంచాలని అనుకున్నారు. ఉంచారు.

ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డను తొలగించాలంటే చట్టంలో మార్పులు తీసుకురావాలి… తన పదవీకాలాన్ని కుదించాలి… అసలు ఎన్నికల సంఘం కమిషనర్‌ గా నియమింపబడటానికి అర్హతలే మార్చాలి. దాంతో నిమ్మగడ్డ ఆటోమేటిక్‌ గా అనర్హుడవుతాడు. ఇదీ ఆలోచన కదా…! ఈమేరకు చట్టంలో మార్పులు కోరుతూ ఓ ఆర్డినెన్స్… ఆన్‌లైన్‌లో మంత్రుల ఆమోదం… గవర్నర్‌ కు పంపించడం… ఆయన ఆమోదించిన వెంటనే సంబంధిత జీఓల జారీ.! అన్నీ కాన్ఫిడెన్షియల్‌గా జరిగిపోయాయి. అప్పటికే కనగరాజును నియమించే విషయంలో జగన్ ఓ నిర్ణయం కూడా తీసేసుకున్నాడు. ఆయనకు సమాచారం కూడా ఇచ్చి, అనుమతి తీసుకున్నారు కూడా..!

ఆ కాంగీ’మహిళా నేత’ లీక్ :

ఆ కాంగ్రెస్ మహిళ నాయకురాలు ట్వీటకపోతే… కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చి, పదవీబాధ్యతలు స్వీకరించేవరకూ ఎవరికీ తెలియకపోయేది. అంత సీక్రెసీ మెయింటెయిన్ చేశారు. కానీ ఎప్పుడైతే ఇది బయటపడిపోయిందో, ఇక చంద్రబాబు ప్లస్ ఆయనకు డప్పులు కొట్టే విపక్షనేతలు రచ్చ చేయడం మొదలు పెట్టేశారు. శ ఉదయమే నిమ్మగడ్డ కోర్టుకు వెళ్లే చాన్స్ ఉందని భావించిన ప్రభుత్వం… కోర్టు సమయానికి ముందే కొత్త ఎన్నికల కమిషనర్ పదవీ బాధ్యతల స్వీకారం ప్రోగ్రాం పెట్టేసింది.

ఎలాగూ కార్యదర్శి రాంసుందర్‌రెడ్డి మనవాడే.! చక చకా ప్రభుత్వ నిర్ణయం మేరకు ఏర్పాట్లు చేసేశాడు. కొత్త కమిషనర్ ఆగమేఘాల మీద వచ్చేశాడు. సంతకాలు చేశాడు. తమిళనాడుకు చెందిన మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజు ఇలా కొత్త కమిషనర్ అయిపోయాడు. ఈయన ఫాస్టర్ గా సేవలందిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. చట్టపరంగా ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్. మరి నిమ్మగడ్డ..?

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నప్పుడు… కమిషనర్ పదవి నుంచి దిగిపోయేలా చట్టానికి మార్పులు చేయడం, ఎన్నికల్ని ప్రభావితం చేసే చర్య అవుతుంది… ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు తదుపరి ఆ పోస్టులోకి వచ్చే కమిషనర్‌ కు వర్తిస్తాయి తప్ప, ఆల్‌ రెడీ ఆ కుర్చీలో ఉన్న కమిషనర్‌ కు వర్తించవు… రెట్రాస్పెక్టివ్ అమలు కుదరదు. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ప్రకారం నిమ్మగడ్డను తొలగించాలంటే పార్లమెంటు అభిశంసనే మార్గం తప్ప ఇలాంటి దొంగదారులు కుదరవు. ఇదుగో, ఇలాంటి కారణాలతో కోర్టును ఆశ్రయించాలి… స్టే అడిగాడు అనుకుందాం… ఇంకోవైపు కొత్త కమిషనర్ కూడా కోర్టును ఆశ్రయిస్తాడు, ప్రభుత్వ నిర్ణయం మేరకు తనను పనిచేసుకోనివ్వాలని..! కోర్టుకు ధర్మసంశయం… ఓ చిత్రమైన చిక్కుముడి లేదా పీటముడి… ముందు నిమ్మగడ్డను పంపించేసి, కొత్తాయన్ని పెట్టేసి, ఆ తరువాత జరిగేది చూద్దాంలే అనుకున్నాడు జగన్ ఇక్కడ… నిమ్మగడ్డ సొంత ఖర్చులతో పోరాడాలి. కొత్త కమిషనర్ స్టేట్ డబ్బులతో పోరాడతాడు. ఇప్పుడు రచ్చకు దిగే టీడీపీ అండ్ తన ఫ్రెండ్లీ విపక్షాలు కూడా కొన్నాళ్లు గోల చేసి, ఆ తరువాత కొన్నాళ్లకు వదిలేస్తాయి. ఇదీ జగన్ అంచనా.!

(ఇప్పుడు ఈ వార్త చూడగానే వైసీపీ అభిమానులు ఏమంటారో తెలుసా? చంద్రబాబునాయుడు ఎల్లో మీడియాకు వందల కోట్లు దోచి పెట్టినప్పుడు కనిపించలేదా? మీరు కూడా ఎల్లో మీడియా లాగా వార్తలు రాస్తున్నారు అని విమర్శలకు దిగవచ్చు. దిగుతారు కూడా. అలా చేసిన పర్యవసానమే చంద్రబాబుకు 23 సీట్లు. మరి మనకూ వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లే కావాలా? బ్లూ మీడియా వర్థిల్లాలి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *