ప్రత్తిపాడు – జనాసవార్త
———————————-
స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో(ఎక్సైజ్ శాఖ) నిర్వహించే కార్యకలాపాలపై గ్రామ సచివాలయాల మహిళా పోలీసులు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి వుండాలని ప్రత్తిపాడు ఎస్ఈబి సిఐ అజయ్ కుమార్ సింగ్ సూచించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో 7వ బ్యాచ్ మహిళా పోలీసులకు వారి విధులుపై బుధవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ, మహిళా పోలీసులు గ్రామాల్లోని నాటు సారా, అక్రమ మద్యం అమ్మకాలు, సారా తయారీ తదితర విషయాలపై ఎప్పటి కప్పుడు స్టేషనుకు సమాచారం అందించాలి అన్నారు. గ్రామాల్లో సారా అమ్మకాలు జరగకుండా చూసే బాధ్యత మహిళా పోలీసులదేనని స్పష్టం చేశారు. మధ్య నియంత్రణ విధానం విషయంలో ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్న సమయంలో అన్ని గ్రామాల్లోనూ అక్రమ మద్యంపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది అన్నారు. ఇందులో భాగంగా సచివాలయ పరిధిలోని మహిళా పోలీసులు ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తూ, ప్రభుత్వ లక్ష్యాల్లో భాగస్వామ్యం కావాలి అన్నారు. అనంతరం స్టేషన్లో ముద్దాయిలపై కేసులు రాసే విధానం, రికార్డుల నిర్వహణ, కానిస్టేబుళ్ల విధులు, పోలీస్ స్టేషన్లో కార్యకలాపాల నిర్వహణ, పోలీస్ స్టేషన్లోని రికార్డుల నిర్వహణ, ఎఫ్ఐఆర్ నమోదు, గ్రామాల్లోని అల్లర్లు జరిగినపుడు ఏ విధంగా వ్యవహరించాలి వంటి క్షేత్ర స్థాయి కర్తవ్య నిర్వహణ, మహిళల రక్షణ, బందోబస్తు నిర్వహణ వంటి అంశాలపై వివిధ మధ్యం కేసుల్లో పట్టుబడ్డ వారిని ఏ విధంగా ఖైదు చేస్తారో చూపిస్తూ సిఐ మహిళా పోలీసులకు అవగాహన కల్పించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో మహిళా పోలీసులు జిఎన్ఎస్ శిరీష, పిఎస్ఎస్ కళాంజలి, పి.ఉషారాణి, చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *