* కారణం హృద్రోగమా ? పని వత్తిడా ??
* విశాఖలో మకాం… శంఖవరంలో ఉద్యోగం
* వారంలో మూడు రోజులే విధులకు…
* ఇంఛార్జి అధికారిణి లేనే లేరు
* నియోజకవర్గం భారం ఇద్దరు సూపర్వైజర్లదే

శంఖవరం – జనాసవార్త

శంఖవరం ఐసిడిఎస్. పీ.ఓ. ఊర్మిళ ఎట్టకేలకు ఓ నెల రోజుల పాటు సెలవు పెట్టి సొంతూరు విశాఖపట్నంనకు వెళ్లిపోయారు. అనారోగ్యం కారణంగా జూన్ 14 నుంచి జూలై 13 వరకు నెల రోజులపాటు సెలవు పెట్టి ఆమె విధులకు తాత్కాలికంగా దూరం అయ్యారు. ఈమె నెల రోజుల సెలవు కాలంలో విధి నిర్వహణకు ఇంచార్జి అధికారిణిని నియమించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయానికి నివేదికను కూడా పంపించారు. ఈమె సెలవు పెట్టి పదిహేను రోజులు అవుతున్నప్పటికీ నేటికీ ఇంకా ఈమె స్థానంలో ఇంచార్జ్ అధికారిణిని ఎవర్నీ సంబందిత కమిషనర్ కార్యాలయం నియమించలేదు. కార్యాలయ, క్షేత్ర స్ధాయి సిబ్బంది రోజు వారీ విధుల నివేదికను తూర్పు గోదావరి జిల్లా కేంద్ర కార్యాలయానికి పంపించడంలో శంఖవరం, ప్రత్తిపాడు మండలాల సూపర్వైజర్ అరుణకుమారి బాధ్యత వహిస్తున్నారు. పీవో ఊర్మిళ అనారోగ్య కారణాలతో సెలవు పెట్టుకున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లోని
జనసామాన్యంలో నలుగుతూ ఉంది.

శంఖవరంలోని సమగ్ర మాతా శిశు అభివృద్ధి కేంద్రం పరిధిలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల పరిధిలో 203 అంగన్వాడీ కేంద్రాలు, 21 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. స్థానికంగా నివాసం ఉంటూ ఈ కేంద్రాల్లో ప్రభుత్వ పరిపాలన చక్క దిద్దాల్సిన పిఓ. ఊర్మిళ విశాఖపట్నంలో మకాం ఉంటూ ఈమె కారులో శంఖవరం మండలానికి ఉదయం వచ్చి సాయంత్రం తిరిగి వెళుతున్నారు. ఈమె శంఖవరం పధకం అధికారిణిగ చేరిన 11.07.2019 నుంచి ఈమె రోజు వారీ విధులకు వచ్చి పోయే బాణీనే అనుసరిస్తూ ఉన్నారు. అంతే తప్ప స్థానికంగా నివాసం ఉండటం లేదు. దీంతో అత్యధిక వేతనాన్ని పొందుతున్న ఈమె స్థానిక నివాసం లేరనీ, శంఖవరంనకు విశాఖపట్నం దూరా భారం కావడంతో వారంలో మూడు రోజులే విధులకు హాజరు అవుతున్నారనీ ఆరోపణలు ఆది నుంచీ ఉన్నాయి.

అంతే గాకుండా ఇక్కడ ఈమె విధుల్లో చేరాకే అంగన్వాడీ కేంద్రాల నుంచి పేద మహిళలు, వారి పిల్లలకూ అందాల్సిన పౌష్ఠికాహారం కాస్తా నియోజక వర్గం పరిధిలోని కొన్ని అంగన్వాడీ కేంద్రాల నుంచి పక్క దారి పడుతున్నాయనీ, అన్నవరం లోని కొత్తపేట అంగన్వాడీ కేంద్రంనకు కార్యకర్త లేకపోయినా ఏళ్ళ కాలంగా ఆ కేంద్రాన్ని ఆయాతోనే నిర్వహిస్తున్నారే తప్ప కనీసం ఇంఛార్జిని నియమించ లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబరులో మండలంలోని కత్తిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా జగన్న విద్యా కానుక పంపిణి మండల స్ధాయి బహిరంగ సభా సమావేశంలో అంతర్భాగంగా ఐసిడిఎస్ తరఫున పౌష్టికాహార పదార్ధాల ప్రదర్శనను మండల అంగన్వాడీ కార్యకర్తలు నిర్వహించగా ఆ కార్యక్రమానికి సిడిపీఓ హాజరు కాలేదు.

రౌతులపూడి మండలం మల్లంపేట, ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామాల్లో కుళ్ళిన కోడి గుడ్లను పంపిణీ చేయడం బహిరంగ వివాదాస్పదం అయ్యింది. అంగన్వాడీ కేంద్రాలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ తెరచి ఉంచాల్సి ఉండగా తెరవడం లేదని, కుళ్ళిన కోడి గుడ్లను పంపిణీ చేస్తున్నారనీ, ఇవి తమ పరిశీలనలో రుజువు అయ్యాయని ఫొటోల సహితంగా మీడియా ముందు ఎర్రవరం సర్పంచ్ భీశెట్టి అప్పలరాజు, మండల జడ్పీటీసీ సభ్యులు నీరుకొండ సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు రమణ బహిరంగ ఆరోపణలు చేసారు. పత్రికల్లో రచ్చ అయ్యింది. ఈ విధంగా ఈమె
పథకం పరిధిలో ప్రజల నుంచి పలు ఆరోపణలను ఎదుర్కుంటూ, ఉద్యోగ పరమైన ఒత్తిళ్లకు లోనవుతూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈమె పక్షం రోజుల క్రితం రక్త ప్రసరణ సంబందిత సమస్యతో రెండు రోజుల పాటు ఇబ్బంది పడి వైద్యుల సూచనల మేరకు ఎట్టకేలకు విశ్రాంతి కోసం నెల రోజుల పాటు సిడిపిఓ. ఊర్మిళ శెలవుపై వెళ్ళినట్టు కార్యాలయ సిబ్బంది కధనం. ఈమె స్థానంలో వేరే అధికారిణిని నియమించక పోవడం, కార్యాలయ సిబ్బంది కొరత, నాలుగు మండలాలకు ఇద్దరు సూపర్వైజర్లు మాత్రమే ఉన్న నేపధ్యంలో ప్రాజెక్టు పరిధిలోని నాలుగు మండలాల్లోనూ పధకం అధికారిణి అజమాయిషీ కొరవడింది, పాలన కుంటు పడిందని పలు విమర్శలు, వేరే అధికారిణిని తక్షణం నియమించాలనే విజ్ఞప్తులూ విన వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *