* రూ. 6.26 కోట్ల రుణాల చెక్ పంపిణీ
* మూడు నెలల్లో ఇళ్ళు పూర్తవ్వాలి
* ఒక్కో ఇండ్ల స్థలం రూ. 5 లక్షల ఆస్ధి
* కాకినాడ ఎంపీ వంగా గీత వెల్లడి

శంఖవరం – జనాసవార్త
——————————-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి దఫాగా ఒక్క సారిగా
30 లక్షల ఇళ్ల గృహ సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ఈ ఇళ్ల నిర్మాణాలను మూడు నెలల కాలంలో పూర్తి చేయాలని లబ్దిదారులకు కాకినాడ ఎంపీ వంగా గీత పిలుపును ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నవరత్నాలు – పేదలు అందరికీ ఇళ్ళు పధకంలో నిర్మించ తలపెట్టిన వైఎస్సార్ జగనన్న ఇండ్ల కాలనీల సామూహిక పునాదుల నిర్మాణ కార్యక్రమానికి ఆదివారం భూమి పూజ, శంఖుస్థాపన చేసారు. స్థానిక 268, 280 సర్వే నెంబర్లలోని లేఔట్ నెంబరు 1లో అన్నవరం గ్రామానికి చెందిన 426 మంది నివేశన స్థలాల లబ్దిదారులతో పాటు మండలంలోని కత్తిపూడి, నెల్లిపూడి, వజ్రకూటం గ్రామాల్లోని మొత్తం 1,693 మంది నివేశన స్థలాల లబ్దిదారులకు గాను వైఎస్సార్ జగనన్న ఇండ్ల కాలనీల లబ్దిదారుల సంఘం సభ్యులు మొత్తం 1,252 మంది లబ్దిదారులకు రూ. 6,26,00,000 విలువ చేసే బ్యాంకు లింకేజీ రుణం చెక్ ను ఎంపీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, జిల్లా అభివృద్ధి సంయుక్త కలెక్టల్ రాజకుమారి, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమారరాజా సంయుక్తంగా పంపిణీ చేసారు. ఈ సంధర్భంగా కుమారరాజా అధ్యక్షతన నిర్వహించిన సభలో లబ్దిదారులను ఉద్దేశించి ఎంపీ గీత మాట్లాడారు. నిరుపేద కుటుంబాల్లోని పుట్టినింటి, మెట్టినింటి వారూ ఇవ్వలేని ఇండ్ల స్థలాలను అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఒక్కో మహిళను రూ. 5 లక్షల విలువ చేసే ఆస్థికి యజమానురాలిని చేసారని, అందువల్ల ఇండ్లను అందరూ మంచిగా నిర్మించు కోవాలని ఎంపీ వంగా గీత పిలుపును ఇచ్చారు.

జేసీ రాజకుమారి మాట్లాడుతూ… గృహ నిర్మాణాలకు ఆర్ధిక వనరులుగా ఒక్కో లబ్దిదారునికీ ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ నుంచి రూ. 1,80,000 లను, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం ద్వారా 90 రోజుల పని దినాల క్రింద పునాదుల నిర్మాణానికి  రూ.18,000 లను, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ఐహెచ్ఎస్ఎల్ పధకం కింద రూ. 12,000 లను గృహ నిర్మాణా పెట్టుబడి నిధులుగా ఉచితంగా అందజేస్తాం అని ఆమె వెల్లడించారు. అంతేగాకుండా బ్యాంకు రుణాలు, స్వయం సహాయక సంఘాల అంతర్గత రుణాలు, ఉన్నతి, సిఐఎఫ్. స్త్రీ నిధి తదితర మార్గాల్లో ఆయా సంఘాల సామర్ధ్యాన్ని బట్టి ఒక్కో లబ్దిదారునికి రూ. 50,000 నుండి రూ.1,00,000 వరకూ రుణాలుగా ఇస్తారు అన్నారు. కొత్త సంఘాల సభ్యులకు కూడా తొలుత రూ. 30,000 లను అందిస్తామన్నారు. సంఘాల్లో లేని లబ్దిదారులను సంఘాల్లో చేర్పించి మండల, జిల్లా మహిళా సమాఖ్యలు, ఇతర మార్గాల ద్వారా కూడా ఈ గృహ నిర్మాణాల పెట్టుబడి నిధులను సమకూరుస్తామని, డబ్బు లేదని కంగారు పొద్దని రాజకుమారి భరోసా ఇచ్చారు. అంతేగాకుండా 90 బస్తాల సిమెంట్, 20 టన్నుల ఇసుక, 120 టన్నుల ఇనుమును మార్కెట్ ధరల కంటే కొంత తక్కువ ధరకు లబ్దిదారులకు ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ఆమె వెల్లడించారు. ఐతే సిమెంటుకు రూ.22,052లను, ఇసుకకు రూ. 3,500 లను, ఇనుమును ఇస్తే గనుక ఆ ధరల మొత్తాలను ప్రభుత్వం చెల్లించే రూ. 1,80,000 ల నుంచి మినహాయించుకుని మిగతా సొమ్ములను లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుందని సంయుక్త కలెక్టర్ రాజకుమారి వెల్లడించారు.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 23,000 మందికి ఇళ్ళ పట్టాలను, ఇళ్ళ స్థలాలను పంపిణీ చేసి, ఇండ్ల నిర్మాణ పధకంలో ఇండ్లను మంజూరు చేసి వారిలో తొలి విడతగా 10,000 మంది లబ్దిదారులతో ఇళ్ళను నిర్మిస్తున్నామని వెల్లడించారు. అన్నవరం లబ్దిదారులకు అన్నవరంలోనే స్థలం లభించక మండపంలో భూములను కొనుగోలు చేసి పంపిణీ చేసామన్నారు. ఈ కాలనీలు అన్నింటికీ తనవంతుగా తొలుత సిమెంటు, తారు రోడ్ల నిర్మానికి ప్రభుత్వ నిధుల విడుదలకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కాలనీలకు క్రమంగా అన్ని సౌకర్యాలనూ సమకూరుస్తామని ఎమ్మేల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ డిఈఈ. సురేష్ బాబు,  ఎంపీడీవో జాగరపు రాంబాబు, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమారరాజా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో ఎస్.మల్లిబాబు, శంఖవరం మండల తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం, ఈవోపీఆర్డీ కాశీ విశ్వనాధం, హౌసింగ్ ప్రత్యేక అధికారి ఎం. వీర్రాజు, ఏఈ. వెంకటరమణ, ఉపాధి ఏపీఓ. దడాల రాజశేఖర్, శంఖవరం మండల మాజీ ఉపాధ్యక్షుడు బొమ్మిడి సత్యనారాయణ, అన్నవరం ఉపసర్పంచ్ బొబ్బిలి వెంకన్నబాబు, శంఖవరం, అన్నవరం, మండపం పంచాయితీ, సచివాలయాల కార్యదర్శులు సిహెచ్. శ్రీరామచంద్ర మూర్తి, పాలెపు నాగమణి, శంకరుడు, సత్యవెంకటేష్, శంఖవరం, అన్నవరం, వీఆర్వోలు టి.సీతారామ్, తాటికొండ అచ్యుతం, డిఆర్డిఎ తుని ఏరియా కోఆర్డినేటర్ షేక్ మహబూబ్ వల్లీ, మండల వైయస్సార్ క్రాంతి పధం అన్నవరం, కత్తిపూడి సిసిలు నాగలక్ష్మి, సీత తదిరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *