దబ్బాది – జనాసవార్త
—————————–
లాటరైట్ మైనింగు మట్టి తవ్వకాలకు మా భూములను అక్రమంగా లాగేసు కున్నారని రౌతులపూడి మండలం దబ్బాది ఉప ప్రణాళికా ప్రాంత గిరిజనులు ఆవేదన చెందారు. తమ భూ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికీ పరిష్కార మార్గంగా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని ఉప ప్రణాళికా ప్రాంత గిరిజన గ్రామాలను ఐదో షెడ్యూల్డులో చేర్చాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని మైనింగు ప్రాంతాన్ని తెలుగు దేశం పార్టీ శ్రేణులు శుక్రవారం పరిశీలించాయి.

విశాఖ జిల్లా నాతవరం మండల సరుగుడు పంచాయితీ బమిడికలొద్దు అటవీ ప్రాంతంలో మైనింగు జరుగు తుండగా తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి మండలం దబ్బాది గిరిజన గ్రామ సమీపంలో చల్లూరు డంపింగ్ యార్డులో వేసిన లేటరైట్ మట్టి గుట్టల నిల్వ ప్రాంతాన్ని, దబ్బాది గ్రామాన్ని ఈ పార్టీ శ్రేణులు పలిశీలించాయి. ఈ సంధర్భంగా దబ్బాది గిరిజన గ్రామంలో మధ్యాహ్నం 1.30 సమయంలో ప్రత్తిపాడు నియోజకవర్గం పాత్రికేయుల బృందంతో స్థానికులు తమ గోడును వెళ్ళబోసు కున్నారు. వెంకయ్యమ్మ, చిన్నారి, లోవతల్లి తదితర ఉన్నత విద్యావంతులతో స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడారు.

40 ఏళ్ళుగా వంశ పారంపర్యంగా తాము సాగు చేసుకుంటున్న భూములను మైనింగు నిర్వాకులు అక్రమ పద్దతిలో లాగేసు కున్నారని, తమక మైనింగు కంపేనీలు ఇస్తానన్న భూముల ఖరీదును కూడా చివరకు ఇవ్వలేదని వెల్లడించారు. తమ నుంచి మైనింగ్ కంపెనీ స్వాధీనం చేసుకున్న భూముల్లో
కొంత మేరకు భూముల్లో రోడ్లను వేసుకోగా మరికొంత మేరకు భూముల్లో లాటరైట్ మట్టిని తవ్వుకొంటుండగా, రౌతులపూడి మండలం రాఘవపట్నం పంచాయితీ చల్లూరు పరీధిలోని మరో 20 ఎకరాల భూముల్లో డంపింగ్ యార్డును నిర్వహించు కుంటున్నారని ఈ బాదిత గిరిజనులు మీడియాకు తెలిపారు.

తమది భారత రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ ప్రాంతం కాదని, అందువల్ల గిరిజనుల భూములను గిరిజనేతరులు కొనకూడదనే 1/70 చట్టం నిబంధనలు తమ ఉప ప్రణాళికా ప్రాంతానికి వర్తించవని, అందువల్లనే తమ ఉప ప్రణాళికా ప్రాంత గిరిజన భూములను గిరినేతరులు కొనుగోలు, లీజు ప్రాతిపదికన హస్తగతం చేసుకుని ఇక్కడి అడవి, రిజర్వ్ అడవులలోని గిరిజన మైనింగ్ సంపదను మైదాన ప్రాంతాలకు యధేచ్చగా తరలించుకు పోతున్నారు అన్నారు. కార్పోరేట్ సామాజిక బాధ్యత నిధులతోనైనా ఈ బడా కంపెనీలు స్థానికంగా కనీస ప్రాధమిక సౌకర్యాలను కల్పించకపోగా ఎటువంటి అభివృద్ధిని కూడా చేయడం లేదని వారు ఆవేదన చెందారు. గ్రామానికి గుడి, బడి, ఆస్పత్రి లేవని, ఉన్న ఒకే ఒక్క తాగు నీటి ట్యాంక్ సౌకర్యం కూడా పని చేయడం లేదని, కేవలం వర్షాధారమైన నూతి నీళ్ళే తమకు దిక్కు అని వారు వాపోయారు. తమ ఐదో షెడ్యూల్డుల్లో చేర్చకపోవడం విద్యా, ఉపాధి అవకాశాలనుశనష్టపోతున్నామని వారు తెలిపారు. తమ గిరిజన గ్రామాలను రాజ్యాంగంలోని ఐదో షెడ్యూలులో చేర్చాలని, తమ గిరిజన గ్రామాలను ఉప ప్రణాళిక ప్రాంతాల పరిధి నుంచి తొలగించి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిపాలనా గొడుగు కిందకు తేవాలని, అక్రమ మైనింగును అపాలని, మైనింగు లీజులను గిరిజనులకే ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

దబ్బాది గిరిజన గ్రామాన్ని సందర్శించి, పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న వారిలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిరాజప్ప, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, అనకాపల్లి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి గుమ్మడి సంధ్యారాణి, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశంపార్టీ నేత వరుపుల రాజా తదితరులు ఉన్నారు.