* 17 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం
* అందులో రిజర్వ్ ఫారెస్టులో 9 కిలో మీటర్లు
* నెల రోజులుగా లాటరైట్ రవాణా
* గిరిజన భూములకు అందని సొమ్ములు

శంఖవరం – జనాసవార్త
————————————–
ఐదేళ్ళ పాటు వివిధ కారణాలతో వివాదాస్పదంగా ఉన్న బమిడికలొద్దు లాటరైట్ మైనింగుకు మళ్ళీ కొత్తగా రెక్కలు వచ్చాయి. కొంత మంది మైనింగు వ్యాపారులు మళ్ళీ ఈ మైనింగు ప్రాంతంపై సరికొత్తగా పక్కాగా దృష్టి సారించారు. మైనింగు మేధోమధనం జరిగింది. ఎలాగైనా ఈ మైనింగును సొంతం చేసుకోవాలన్న ఆలోచనలు పురుడు పోసుకున్నాయి. అక్రమమా… సక్రమమా అన్న విషయాన్ని అటుంచితే నెల రోజులుగా మాత్రం ఇక్కడ అడపా దడపా అంతర్గత, బహిర్గత మైనింగ్ కార్యకలాపాలు జరుగు తున్నాయి. మరో పక్క ఈ మైనింగ్ క్వారీల అనుమతుల విషయమై ఆ మైనింగు ప్రభావిత గిరిజనుల ప్రజాభిప్రాయ సేకరణకు నిర్వహించ తలపెట్టిన గ్రామ సభలు మాత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. అయినా సరే ఈ గిరిజన ప్రాంతం నుంచి లాటరైట్ మట్టిని మైదాన ప్రాంతానికి తరలించే ప్రయోగాత్మక రవాణా ప్రక్రియ విజయవంతం అయ్యిది. ఇక ఈ మైనింగు కథ ముందుకు నడవడమే తరువాయి. ఈ మైనింగు పూర్వ పక్షం గురించి పరిశీలిస్తే…..

విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ఉమ్మడి సరుగుడు పంచాయతీ పరిధిలో సుందరకోట, బమిడికలొద్ది, అసనగిరి, తొరడ, ముంతమామిడి, సిరిపురం, మాసంపల్లి, సరుగుడు గ్రామాల రెవెన్యూ పరిధిలో రూ. 5000 కోట్ల విలువ చేసే లేటరైట్‌ నిక్షేపాలు ఉన్నట్లు గతంలోనే సర్వేల్లో నిర్దారించారు. ఈ గ్రామాలన్నింటినీ అటుంచి ఒక్క బమిడికలొద్ది పరిధిలోనే 121 హెక్టార్లలో లాటరైట్ నిక్షేపం ఒకటి ఉంది. దీనిని తవ్వి వెలికి తీసి వ్యాపారం చేసుకునేందుకు కొయ్యూరు మండలానికి చెందిన జర్తా లక్ష్మణరావు అనే గిరిజనుడు 2009 లో ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. అప్పట్లో అతను గిరిజనుడు కాదని, పంచాయతీ తీర్మానం లేదని, తప్పుడు పత్రాలతో నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) పొంది, వాటితో ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారనీ కొందరు గిట్టని వారు కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా 2018 ఆగస్టులో లీజుదారునికి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. ఈ ఉత్తర్వులను అమలు చేయక పోవడంతో ఆరు నెలల తరవాత కోర్టు ధిక్కారం కేసు వేశారు. లీజుదారుని వెనకున్న నేతలకు, స్థానిక పెద్దలకు వ్యవహారం నప్పక పోవడంతో ఈ క్వారీలో తవ్వకాలకు గత ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో గత పార్టీ ప్రభుత్వం మారి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్వారీ నిర్వాహకులు మరలా రంగంలోకి దిగారు. దానికి తోడు ఆ క్వారీ నిర్వహణకు లీజుదారునికి అనుమతులను ఇవ్వకపోతే న్యాయస్థానం ధిక్కారణ నేరం కింద చర్యలను తీసుకుంటామని ఇటీవల అధికారులను న్యాయస్థానం హెచ్చరించడంతో క్వారీ తవ్వకాలకు మైన్స్‌ అధికారులు అనుమతులిచ్చారు. అయితే ఇటు పంచాయితీలు, అటు అటవీశాఖ అనుమతులను ఇచ్చేందుకు సాంకేతికంగా సహజంగానే కొంత కాలం వ్యవధి పడుతున్నది.

ఈ వ్యవధి లోపలే క్వారీ తవ్వకాలకు గిరిజన గ్రామాలను దాటి రిజర్వుడు అడవుల్లోకి వివిధ భారీ వాహనాలు, యంత్రపరికరాల రవాణాకు అవసరమైన విశాలమైన రోడ్ల నిర్మాణాలపై ముందస్తుగా దృష్టి సారించి ఆ పని కాస్తా పూర్తి చేసేసారు. అది కూడా విశాఖ జిల్లా పరిధిలోని ఈ క్వారీకి ఆ జిల్లాలో కాకుండా తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పోర్టుకు దగ్గర దారైన ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రాఘవపట్నం, జల్దాం, దబ్బాది, సార్లంక, సిరిపురం మీదుగా బమిడికలొద్దు క్వారీ వరకూ దశల వారీగా సుమారు 17 కిలో మీటర్ల మేర పక్కా మట్టి రోడ్డును నిర్మించారు. ఇందులో రౌతులపూడి మండలం జల్దాం గిరిజన గ్రామం నుంచి విశాఖ జిల్లా నాతవరం మండలం సరుగుడు పంచాయితీ పరిధిలోని చల్లూరులోని లాటరైట్ డంపింగ్ యార్డు వరకూ 2 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డును నిర్మించారు. ఈ యార్డును దాటాక 1కిలోమీటరు దూరం తర్వాత రిజర్వు ఫారెస్ట్ మొదలు అవుతుంది. దబ్బాది చల్లూరు గ్రామాల మధ్య రిజర్వ్ ఫారెస్టులోనే 3 కిలోమీటర్ల పొడవునా రోడ్డును నిర్మించారు. ఆ తర్వాత 1 కిలో మీటరు పొడవునా ఉన్న జిరాయితీ భూములను రైతుల నుంచి లాక్కుని రోడ్డును వేసారు. సార్లంక, సిరిపురం గ్రామాల మధ్య రిజర్వ్ ఫారెస్టులో 3 కిలోమీటర్లు, అలాగే సిరిపురం రిజర్వ్ ఫారెస్టు కొండ మీద వంక వంకలుగా మరో 3 కిలోమీటర్ల దూరం పొడవునా రోడ్లను నిర్మించారు. ఐతే ఈ సుమారు 17 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పొడవునా క్వారీ నిర్వాహకులకు అడ్డుగా ఉన్న వేల చెట్లను నేల కూల్చేసేసారని, వాగులూ, వంకల్లో కొంత మేర మట్టితో కప్పేసారని, కొండలను పాక్షికంగా తొలిచేసారనీ స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు. పర్యావరణ సమతౌల్యంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం చల్లూరులోని సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలోని లాటరైట్ డంపింగ్ యార్డులో లాటరైట్ మట్టి నిల్వలు ఉన్నాయి. ఈ మట్టి సుమారు 50 టన్నుల వరకూ ఉంటుందని ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ నేత వరుపుల రాజా అంటున్నారు. కాగా ఇక్కడ నుంచే నెల రోజులు కాలంగా ఈ గిరిజన గ్రామాల నుంచి మైదాన ప్రాంతంలోని రౌతులపూడి, శంఖవరం గ్రామాల మీదుగా కత్తిపూడి జాతీయ రహదారికి, అక్కడ నుంచి వారి అసలు ప్రాంతాలకు భారీ వాహనాల్లో లాటరైట్ మట్టిని అడపా దడపా తరలిస్తున్నారు. వర్షాల కారంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్ల రవాణా తాత్కాలికంగా ఆగింది. డంపింగ్ యార్డులో వెయింగ్ మెషీన్ ఏర్పాటు పనులు జరుగు తున్నాయి. బమిడికలొద్ది క్వారీకి సంబంధించి కోర్టుతో పాటు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు అనకాపల్లి గనులశాఖ ఏడీ ప్రకాష్‌ కుమార్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ క్వారీకి రహదారి నిర్మాణానికి ఆ రోడ్డులో కేవలం 480 మీటర్లే అటవీ శాఖకు చెందిన స్థలం ఉందని, దీనికి అనుమతులు తీసుకున్నట్లు తెలిసిందని రౌతులపూడి అటవీ సెక్షన్‌ అధికారి నాగేశ్వరరావు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *