* క్షీణించనున్న కొండల ఆరోగ్యం
* అటవీ జలసిరికి పొంచి ఉన్న పెను ముప్పు
* అన్నవరం పంపా నది నిల్వలపై ప్రభావం
* వన్య ప్రాణి, పక్ష్యాదులకు ప్రాణాంతకం

శంఖవరం, జూలై 12, (జనాసవార్త) :

తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లోని తూర్పు కనుమలు లోని రిజర్వుడు అటవీ భూ భాగంలోని  ఖనిజ నిక్షేపాల నిరంతర తవ్వకాల వల్ల ఆ తూర్పు కనుమలే కాలక్రమంలో కనుమరుగు కానున్నాయి. ఈ పొంచి ఉన్న భవిష్య పెను ప్రమాదంపై దశాబ్దాల కాలం నుంచి ఇక్కడి ఆదివాసులు అడపా దడపా ఉద్యమాలను చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఉభయ జిల్లాల్లోని లేటరైట్ తవ్వకాలు పర్యావరణ వేత్తలను, ఇక్కడి ఆవాసిత గిరిజనులనే గాక తూర్పు కనుమల్లోని నిరంతర జల వాహినిలపై ఆధారపడిన మైదాన ప్రాంత రైతాంగాన్నీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అటవీ కొండల ఆరోగ్యమే మైదాన ప్రాంతాల సౌభాగ్యమన్న పూర్వీకుల మాటలను వీరు గుర్తు చేస్తున్నారు. తూర్పు కనుమలు కూడా భవిష్యత్తులో కనుమరుగు అవుతాయి అనడానికి రాజస్థాన్‌లో 1967 నుంచి సాగిన ఖనిజ తవ్వకాల మూలంగా 25 శాతం అంటే 25,000 పైగా ఎకరాల్లోని ఆరావళి కొండలు హరించుకు పోయాయని 2018 లో సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార సంఘం నిగ్గు తేల్చి చెప్పిన నివేదికను వీరు ఉదహరిస్తున్నారు.

స్వతంత్ర భారత దేశానికి నలు దిక్కుల్లోనూ ఓ దిక్కున రక్షణగా తూర్పు కనుమలు ఉన్నాయి. భారత ద్వీపకల్పపు తూర్పు సముద్ర తీరం వెంట ఉండే కొండల వరుసే ఈ తూర్పు కనుమలు. ఉత్తర ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణాన తమిళనాడు వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇవి కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల గుండా కూడా వెళతాయి. ద్వీపకల్ప భారతదేశంలోని నాలుగు ప్రధాన నదులైన గోదావరి, మహానది, కృష్ణ, కావేరి ఈ తూర్పు కనుమలను ఒరుసుకుంటూ, కోసుకుంటూ, ఖండిస్తూ ప్రవహించి, సువిశాల సేద్యపు భూములకు కావలసినంత సాగు నీరు, ప్రజలకు తాగు నీరు అందించి చివరకు బంగాళాఖాతంలో కలుస్తాయి. అంతేగాకుండా జీవ వైవిధ్యానికి ఆటపట్టులైన ఈ కొండల్లో చిన్న చిన్న ప్రకృతి సహజసిద్ద నీటి ప్రవాహాలు, వాగులూ, నీటి బుగ్గలూ కూడా పుట్టి ప్రవహిస్తున్నాయి. ఈ విధంగా ఈ తూర్పు కనుమలు అటవీ, ఖనిజ, ఇతర సహజ వనరులను అందిస్తూ ఆయా రాష్ట్రాల సామాజిక, ఆర్థిక ప్రగతికి అవి ఎంతగానో దోహదపడు తున్నాయి.

ఈ పర్వత శ్రేణులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉమ్మడి పర్యావరణ ప్రయోజనాల కోణంలో కాకుండా ఆయా రాష్ట్రాలు విడి విడిగా తమ రాజకీయ, ఆర్థిక లాభాల కోణంలో చూడటమే ఇక్కడి అసలు సమస్య. అందువల్లనే అడవుల్లో ముమ్మరంగా సాగుతున్న అధికారిక, అనధికారిక ఖనిజ తవ్వకాలను, నివాస ప్రాంతాల విస్తరణలను అడ్డు కోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతూ వస్తున్నాయి. దీనికి తోడు అటవీ చట్టాలపై అవగాహన లేని గిరిజనులు తమ కష్టార్జితాలను దార పోసి రిజర్వ్ అటవీ భూముల్లో స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకుని, పోడు సాగుకు వన విధ్వంసానికి పాల్పడుతుంటే అదే రిజర్వ్ అడవుల్లో ఖనిజ తవ్వకాలకు అనుమతులను పొందిన బడా పారిశ్రామిక వేత్తలు కూడా తమ రవాణా సౌకర్యాల కోసం ఉద్దేశ్య పూర్వకంగా వన విధ్వంసానికి పాల్పడు తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు  అచేతనగా మిన్నకుండి పోతున్నాయి. ఫలితంగా అటవీ వన విస్తీర్ణం క్రమంగా క్షీణిస్తూ వస్తోన్నది. ఈ స్థాయిలో దానికి సమాంతరంగా ప్రభుత్వం సామాజిక వనాల పెంపకం బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చలేక పోతున్న నేపధ్యంలో ఎన్నటికీ పరిష్కారంకాని పర్యావరణ అసమతౌల్యం సమస్య ఏర్పడుతోంది. ఈ నేపధ్యంలోనే గత 70 ఏళ్లలో అనూహ్యంగా పెరిగిన పట్టణీకరణ, ఖనిజాన్వేషణలతో ఈ తూర్పు కనుమల అడవులు, పర్వతాలు ధ్వంసం అవుతున్నాయి.

తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు తూర్పు కనుమల్లోని నాగులకొండ పర్వత శ్రేణుల్లోని ప్రత్తిపాడు నియోజక వర్గం ప్రత్తిపాడు మండలంలోని వంతాడ ప్రాంతంలో కొన్నేళ్ల క్రితం లేటరైట్‌ తవ్వకాల్లో అనేక అక్రమాలు జరిగాయి. ఆ కొండల పరిధిలోనే సరుగుడు, ఆవెల్తీ తదితర ప్రాంతాల్లో అనుమతులకు మించి లేటరైట్‌ ను తవ్విన గణాంకాలు నేటికీ ఆందోళన కలిగిస్తున్నాయి.  అడవుల పరిరక్షణలో ప్రభుత్వాలు దశాబ్దాలుగా విఫలమవుతున్నాయి. అటవీ వనాల విధ్వంసం విచ్చలవిడిగా సాగుతున్నా ప్రభుత్వ వ్యవస్థలు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. జరగాల్సిన నష్టం జరిగిపోయాక కంటి తుడుపుగా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో వన యాజమాన్యం, ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి ఉద్దేశించిన కంపా వంటి పథకాల లక్ష్యాల సాధన కష్టతరంగా మారుతోంది. ఈ తూర్పు కనుమల్లో జరుగుతున్న వన విధ్వంసాలతో నదీ ప్రవాహాలు గతి తప్పి అనేక జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి పోతున్నాయి. తీర ప్రాంతాలు తరచూ తీవ్ర వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఖనిజ సంపద వెలికితీత పేరుతో  అటవీ భూభాగాన్ని తవ్వడం కోసం అటవీ వనాలను విచ్చల విడిగా ద్వంసం చేస్తున్నారు. రహదారులకు అడ్డొచ్చిన వాగులూ, వంకలను పాక్షికంగానో, పూర్తిగానో పూడ్చి వేస్తున్నారు. అందువల్ల అటవీ విస్తీర్ణం తగ్గి ధీర్ఘకాల క్రమంలో ఈ తూర్పు కనుమలతో పాటే జలవనరులు, జంతు, పశు, పక్ష్యాది జీవజాలం కనుమరుగు కానుంది. శంఖవరం మండలం అన్నవరంలోని పంపా నదికి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని సరిహద్దు మైనింగు ప్రాంతంలోని నిత్యం ప్రవహించే జలపాతం నుంచే నీరు చేరుకుంటుంది. ఈ అడవి కనుక కనుమరుగైతే పంపాలోకి ప్రవహించే కొండల జలపాతం ప్రవాహం నీరూ ఆగిపోతుంది. అంతే కాకుండా పర్యావరణ అసమతౌల్యానికి దారి తీయనుంది.

పర్యావరణ పరంగా అత్యంత విలువైన ఈ పర్వతాల పరిరక్షణకు రాష్ట్రం ఓ నిర్దిష్ట ప్రణాళికతో సమష్టి కృషి జరిపితే తప్ప ఈ పర్వత, అరణ్య విధ్వంసం ఆగదని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘ కాలిక పర్యావరణ, సామాజిక అవసరాల దృష్ట్యా  కొండల్ని పరిరక్షించాల్సిందేనని ఆదివాసీలు, పర్యావరణ నిపుణులు, ప్రజా సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. సామాజిక అవసరాలను తీర్చడంలో కీలకమైన వనరు నేలను పొదుపుగా వినియోగించు కోవడంలో పటిష్ఠ విధానాలను అమలు చేయడం ప్రభుత్వాల బాధ్యత! దీన్ని విస్మరిస్తే ఎదురయ్యే పర్యవసానాలు, వాతావరణ ప్రతికూల ప్రభావాలు ఎంత క్లిష్టంగా ఉంటాయో ప్రకృతి ప్రళయాలు అప్పుడప్పుడూ మానవాళిని ప్రత్యక్షంగా హెచ్చరిహ్తూనే ఉన్నాయి. నేటి ప్రభుత్వాలు ఈ విధ్వంసాన్ని అనివార్యంగా నివారించడం, అటవీ అంతర్భాగ ఖనిజ సంపదను విచ్చలవిడిగా వెలికి తీయడాన్ని క్రమబద్దీకరించడం ప్రభుత్వ విధి. ఇది భవిష్యత్ తరాల భావి పౌరుల వారసత్వ హక్కు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *