* దిశ అనువర్తనంతో అన్ని వేళలా రక్షణ
* ఐదు నిమిషాల్లోనే పోలీసుల సహాయం
* కత్తిపూడి సర్పంచ్ సత్యనారాయణ వెల్లడి

శంఖవరం, జూలై 14, (జనాసవార్త) :

దిశ చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళల అందరి చుట్టం అని కత్తిపూడి సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పంచాయతీ పరిధిలోని సచివాలయం 3 కార్యాలయ ఆవరణలో మహిళలకు దిశ చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సర్పంచ్ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ దిశ చట్టం మహిళలకు అత్యంత ప్రయోజనకారి అని, మహిళలు, బాలికలు, బాలికా విద్యార్థులు అందరూ దిశ అనువర్తనాన్ని మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం కోవాలని ఆయన సూచించారు. మహిళలు తమ దైనందిన కార్యకలాపాలు, విధి నిర్వహణ, ప్రయాణాలు, గృహంలో సైతం ఎవరైనా పురుషుల నుంచి ఆపద ఉన్న వెంటనే దిశ అనువర్తనంలోని ఎస్ఓఎస్. బటన్ను నొక్కితే స్వయం చాలకంగా పోలీసులకు సందేశం వెళుతుందని, అనంతరం ఐదు నిమిషాల వ్యవధిలో స్థానిక పోలీసులు బాదితుల వద్దకే వచ్చి సహాయక చర్యలు చేపడతారు న్నారు.

రాష్ట్రంలోని మహిళలు అందరి రక్షణే ప్రధాన ధ్యేయంగా దిశ అనువర్తనాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి వినియోగంలోకి తెచ్చిందని అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్సై రవికుమార్ అన్నారు. మహిళలు అందరూ ఈ దిశ అనువర్తనంలో వారి మొబైల్ ఫోన్ నెంబర్లను నిక్షిప్తం చేయాలన్నారు. ఈ అనువర్తనంలో మహిళల భద్రత, రక్షణకు ఉపయోగ కరమైన ప్రాథమిక సమాచారం అంతా ఉందని, మహిళలు ఈ సమాచారాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఐ పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా దిశా చట్టాన్ని రూపొందించడమే కాకుండా వారి తక్షణ రక్షణ కోసం దిశ అనువర్తనాన్ని కూడా ప్రభుత్వం వినియోగంలోకి తెచ్చిందని ఆయన వివరించారు. రాష్ట్రంలోని అక్కా, చెల్లమ్మలు అందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరుడు అయితే ఈ దిశ అనువర్తనం కూడా ముఖ్యమంత్రితో సమానమైన మరో సోదరుడని, అంత బాగా ఈ అనువర్తనం అక్కా చెల్లెమ్మలు రక్షణ విషయంలో అక్కరకు వస్తుందని ఎస్సై వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతు అర్జుబాబు, గౌతుకృష్ణ, దడాల బాబ్జీ, మహిళా పోలీసులు రజియా సుల్తానా, పి.ఉషారాణి, వెల్ఫేర్ అసిస్టెంట్లు సత్యయామిని, గాయత్రి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వెలుగు సిసి. సీత, అంగనవాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *