* ఇడబ్ల్యుస్ వర్గాలకు 10% రిజర్వేషన్
* మంత్రి కురసాల కన్నబాబు వెల్లడి
* రూ.10 కోట్ల విలువైన భవనాలు ప్రారంభం
* రోజంతా ప్రారంభాలతో మంత్రులు బిజీబిజీ

శంఖవరం, జూలై 16, (జనాసవార్త) :

ప్రపంచ దేశాలకు భారత దేశం గుర్తుకు వస్తే అందులో ముందుగా గుర్తుకు వచ్చేది మనం అందరం జాతి పితగా కొలుచుకునే మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగ రచనతో మన భవిష్యత్ తరాలకు దిశా నిర్దేశం చేసిన భారతరత్న, డాక్టర్ భీమారావు రాంజీ అంబేద్కర్ పేర్లేనని, వీరి ఇరువురి విగ్రహాలను ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని నేను భావిస్తున్నాను… ఇటువంటి మహనీయులను విస్మరిస్తే మన దేశ చరిత్రను, మన పుట్టుకను మర్చినట్లేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార శాఖల మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలంలోని అన్నవరం, శంఖవరం గ్రామాల్లో పరభుత్వ, ప్రైవేటు నిధులు సుమారు రూ. 10 కోట్ల వ్యయంతో నిర్మించిన వివిధ పధకాల నూతన భవనాలను మంత్రి కన్నబాబుతో పాటు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, వైవీసుబ్బారెడ్డి, కాకినాడ ఎంపీ వంగా గీత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. శంఖవరంలో ముందుగా మంత్రులు టెంకాయను కొట్టి, జ్యోతీ ప్రజ్వలనం చేసి, అంబేద్కర్ విగ్రానికి పూల మాలలను వేసి, మహాత్ముడి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ రెండు గ్రామాల్లోనూ ఈ నేతలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మంత్రి కన్నబాబు శంఖవరంలో తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గాంధీ, అంబేద్కరుల త్యాగం, కృషి వలనే మన దేశంలోని ప్రతి పౌరుడూ నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఉండగా, రాజ్యాంగ రిజర్వేషన్లను ఏమాత్రమూ పొందని అన్ని కులాల్లోని ఆర్ధికంగా వెనుక బడిన నిరుపేద (ఇడబ్ల్యుఎస్) కుటుంబాల ప్రజల ప్రయోజనార్ధం వారికి 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారమే నిర్ణయం తీసుకుందని, ఇదొక గొప్ప విషయమని కన్నబాబు అభివర్ణించారు. ఇది గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమేనని, దీని అమలు వల్ల ప్రస్తుతం అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లకు ఏమాత్రం నష్టం జరుగకుండా, గతంలో ఏ రిజర్వేషన్లు పొందని, గతంలో రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన కాపులతోబాటు కమ్మలు, రెడ్డిలు, రాజులు, బ్రాహ్మణులు, వైశ్యులు తదితరులంతా ఈ 10 శాతం రిజర్వేషన్లను పొందుతారు అన్నారు. అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ ఆర్ధికంగా ఎదగాలని నాడు కృషి చేసిన దివంగత నేత రాజశేఖరరెడ్డి ఆశయాలను
అమలు పరుస్తూ, ఆయన వారసునిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పధంలో ముందుకు తీసుకు వెళుతున్నారని మంత్రి కన్నబాబు అన్నారు.

మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా గత రెండు సంవత్సరాల నుండి చెప్పిన మాట ప్రకారం జగన్ అమలు చేస్తున్నారని, కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దక్కిందని పేర్కొన్నారు. అన్నవరం సత్యదేవుని ఆలయంలో అత్యాధునిక వసతులతో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా సుమారు పది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించా మన్నారు. శంఖవరంలో 1956 సంవత్సరంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని పునరుద్ధరించ డానికి అన్ని సామాజిక వర్గాల ప్రజలనూ ఏకాభిప్రాయానికి తేవడానికి ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ చేసిన కృషి అభినందనీయం అన్నారు. శంఖవరం సర్పంచ్ బందిలి గన్నియ్యమ్మ, ఉపసర్పంచ్ చింతంనీడి కుమార్, అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమారరాజా, కత్తిపూడి సర్పంచ్ కొల్లు వెంకట సత్యనారాయణ, మండపం సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యం, గౌరంపేట సర్పంచ్ రామిశెట్టి ఏసుబాబు, నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, ఏలేశ్వరం నగర పంచాతీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *