* మండపం, తాళ్ళపాలెం లేఔట్లకు అన్నవరమే గుర్తింపే ఉండాలి
* అన్నవరం దేవస్ధానంలో సర్పంచ్ కు ప్రోటోకాల్
* 33 అభివృద్ధి పనులకు ఏకగ్రీవ తీర్మానం
* పాలకవర్గ సమావేశానికి విలేకర్లకు అనుమతి

అన్నవరం, జూలై 17, (జనాసవార్త) :
—————————————————
రాజ్యాంగబద్దంగా ఏర్పడిన స్థానిక సంస్థ అన్నవరం పంచాయితీకి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు స్థానిక శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలోని ప్రజాహిత, అభివృధ్ధి కార్యక్రమాలకు ప్రోటోకాల్ పాటించాలని అన్నవరం పంచాయితీ పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అధ్యక్షతన పాలకవర్గం రెండో సాధారణ సమావేశాన్ని శనివారం ఉదయం 11- 2.30 గంటల మధ్య నిర్వహించారు. గ్రామ పంచాయితీలోని మూడు సచివాలయాల పరిధిలోనూ వివిధ రకాలైన 33 అభివృద్ధి పనులను చేయడానికి సర్పంచ్ ప్రతిపాదించగా వాటిని ఉపసర్పంచ్ బొబ్బిలి వెంకన్నబాబు తోపాటు మిగతా 15 మంది వార్డు సభ్యులూ చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ పంచాయితీ ప్రజా ప్రతినిధులకు స్దానిక శ్రీవీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానం ఆది నుంచీ ప్రోటోకాల్ పాటింక పోవడంపై గరంగరంగా పెద్ద చర్చ జరిగింది.

స్థానిక ప్రజా ప్రతినిధులకు దేవస్థానం సిబ్బంది ప్రోటోకాల్ పాటించక పోవడానికి అన్నవరం దేవస్ధానం రాజ్యాంగానికి అతీతమా అనే ప్రశ్నను సభ్యులు అందరూ ముక్త కంఠంతో లేవనెత్తారు.
దేవస్థానం పరిపాలన రాజ్యాంగ వ్యవస్థ పరిధిలో లేదా…? దేవస్థానం ఏదైనా ఒక ప్రత్యేక వ్యవస్థలో కొనసాగుతోందా…? గ్రామంలోని 20,000 మంది ప్రజల ప్రతినిధిగా, వారి ధర్మకర్తగా 16 వార్డుల్లోని 11,600 మంది ఓటర్లు ఎన్నుకున్న గ్రామ ప్రధమ పౌరునికి దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించక పోవడం అవమాన పర్చినట్లు కాదా..? అని సభ ప్రశ్శించింది. ఎక్కడో నేతలను గౌరవిస్తూ, ప్రోటోకాల్ పాటిస్తున్న ఈ దేవస్థానం స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలకు సరియైన గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వక పోవడాన్ని సభ తీవ్రంగా ఖండించింది. తిరుపతి మున్సిపల్ ఛైర్మన్ కు ప్రత్యేక ఆహ్వానితునిగా అక్కడి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోటోకాల్ పాటిస్తుండగా ఇక్కడ అన్నవరం దేవస్థానం ఎందుకు పాటించదని గళమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగ బద్దంగా పని చేసే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ అదే వ్యవస్థలోని ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకుండా ఎందుకు అవమాన పరుస్తోందని నిలదీసారు. అన్నవరం పంచాయితీ ప్రజా ప్రతినిధులకు దేవస్థానం ప్రోటోకాల్ పాటించాలని, ఈ విషయమై రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్, ఆ శాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర మంత్రులకు ఫిర్యాదు చేయాలని పాలకవర్గం సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పధకంలో
అన్నవరం గ్రామస్తులకు మండపం, తాళ్ళపాలెం గ్రామాల్లో ఇచ్చిన రెండు లేఔట్ల లబ్దిదార కుటుంబాల ప్రజలను అన్నవరం గ్రామస్తులు, ఓటర్లుగానే ప్రభుత్వం ఎప్పటికీ గుర్తించాలని సర్పంచ్ కుమార్ రాజా అన్నారు. ఈ రెండు లేఔట్లనూ ఎప్పటికీ మండపం, తాళ్ళపాలెం గ్రామాల్లోకి ప్రభుత్వం విలీనం చేయకూడదని ఆయన అన్నారు. అలా చేస్తే మండలంలోనే ఏకైక పెద్ద పంచాయితీ ఐన అన్నవరం పంచాయితీ భవిష్యత్తులో నగర పంచాయితీ అర్హతను కోల్పోయే ప్రమాదం ఉందని సర్పంచ్ అన్నారు. ఈ ప్రమాదాలు ఎదురవ్వకుండా ఉండేలా ప్రభుత్వానికి ముందుగానే నివేదించాలని పాలక వర్గంతో ఏకగ్రీవ తీర్మానాన్ని సర్పంచ్ శెట్టిబత్తుల కుమార రాజా చేయించారు. ఈ సమావేశంలోకి విలేకర్ల ప్రవేశానికి అనుమతించి నూతన సంప్రదాయానికి సర్పంచ్ శ్రీకారం చుట్టారు. సచివాలయం 1 కార్యదర్శి సిహెచ్. శ్రీరామచంద్ర మూర్తి, సచివాలయం 2 కార్యదర్శి సత్యనారాయణ, వీఆర్వో తాటిపాక అచ్యుతం తదిరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *