యస్.రాయవరం, 20 జులై 2021                       ————————————————
విశాఖజిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని మండల కేంద్రం యస్.రాయవరంలోని అనంతసాగరం చెరువును చేపల పెంపకానికి లీజుకు తీసుకుని ఏళ్ల తరబడి ఏ ఒక్క రూపాయిని కూడా పంచాయతీకి చెల్లించకుండా స్వాహా చేస్తున్న విషయమై నేడు విచారణ జరుగనుంది. ఈ లీజు సొమ్ముల స్వాహా చేసిన మాజీ ఎంపిటిసి సభ్యుడు బొలిశెట్టి గోవిందరావు, ఇతనితో కుమ్మక్కు అయిన సంబంధిత అధికారులపై విచారణ చేపట్టి లీజు బకాయిని రాబట్టి గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేయవలసిందిగా ఎస్.రాయవరం మండలం ఫోరం ఫర్ ఆర్టీఐ కన్వినర్ సోమిరెడ్డి రాజు పంచాయితీ స్పందన కార్యక్రమంలో కోరుతూ అర్జీ ధాఖలు చేయగా లీజు స్వాహా పర్వం డొంక కదిలింది. అంతే గాకుండా విశాఖ జిల్లా పంచాయతీ అధికారి, మత్స్యశాఖ సంయుక్త  సంచాలకులు, నర్సీపట్నం మత్యశాఖ, సహాయ సంచాలకులు, ఎస్.రాయవరం మండల తాహసీల్దార్, ఎం.పి.డి.ఓ  లకు కూడా 26.04.2021సోమిరెడ్డి రాజు ఫిర్యాదు చేసారు. ఫలితంగా ఎస్.రాయవరం అనంతసాగరం చెరువు లీజు సొమ్ముల స్వాహా వ్యవహారంపై విచారణ చేయాల్సిందిగా మంగళవారం డివిజనల్ పంచాయతీ అధికారిణి ఆర్.సిరిశారాణిని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. ఫలితంగా ఆమె ఈ రోజు పంచాయతీ కార్యాలయంలో 11.30 లకు విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు సోమిరెడ్డి రాజుకు పంపిన లేఖలో అధికారులు తెలిపారు.

4 ఏళ్లలో రూ. 4,36,000 స్వాహా..!
———————————————–
అనంతసాగరం చెరువు సర్వే నెంబర్ 54 లో 42.59 ఎకరాలు చెరువు గర్భంతో, 257 ఎకరాలు ఆయకట్టు భూమి ఉంది. ఈ చెరువు యస్.రాయవరం నుండి పులపర్తి వెళ్ళు తారురోడ్డును ఆనుకొని గూoడ్రిబిల్లి గ్రామ సరిహద్దుగా కలదు. ఈ చెరువు ఎప్పటి నుండో ప్రతీ ఏడాది చేపల పెంపకం కొరకు వ్యక్తులకు ఇవ్వడం జరుగుతున్నది. 2017-2018, 2018-2019, 2019-2020 మూడు ఏళ్ళు యస్.రాయవరం కు చెoదిన మారేపల్లి జోగేష్, పులపర్తి గ్రామస్తుడు నూకరాజు, అడ్డ రోడ్డు తిమ్మాపురం గ్రామస్తుడు సత్తిబాబు లకు 2017-2018 రూ. 70,000, 2018-2019 రూ. 80,000, 2019-2020 రూ. 1,00,000 కు 3 సంవత్సరాలలో మొత్తం రూ. 2,50,000 చెరువులో చేపల పెంపకం కొరకు ఏ ఏడాది కి, ఆ ఏడాది ప్రారంభంలోనే ఎటువంటి బహిరంగ వేలం గాని, ప్రభుత్వ, పంచాయతీ వారి నిబంధనలు గాని, పాటించ కుండా మాజీ ఎంపిటిసి బొలిశెట్టి గోవిందరావు తన అనుచరులకు, నచ్చిన వారికి  ఇవ్వడం, వారి నుండి నగదు తీసుకొని స్వాహా చేయడం జరుగుతున్నది. పెంపకందారులు బొలిశెట్టి ని అడిగితే నేను పంచాయతీకి చెల్లిస్తున్నానని చెబుతున్నాడని వీరు తెలుపుతున్నారు. ఈ విషయం పంచాయతీ అధికారులను అడుగగా ఈనాటికీ గ్రామ పంచాయతీకి ఒక్క రూపాయి కూడా ఎవ్వరూ జమ చెయ్యలేదని  సమాధానం చెబుతున్నారు. దీని వలన ఈ చెరువుపై ఇలా చాలా సంవత్సరములు నుండి వచ్చిన సొమ్ము పంచాయతీకి చెల్లించకుండా బొలిశెట్టి స్వాహా చేస్తున్నట్లు తెలుస్తున్నది.ఈ విషయాలన్నిటిపై సంబంధిత అధికారుల అందరికీ పిర్యాదు చేయడం జరిగినది. అదే విధంగా 16.03.2020 న లోకాయుక్త కు ఫిర్యాదు Lr Dis No. 154/2020/B2/LOK/2334/2020 చేయగా ప్రస్తుతం కేసు నడుస్తున్నది. దీని కొరకు తేది 27.08.2019 న గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం లో చేపల పెంపకం కొరకు చెరువు హక్కులు కల్పించమని తీర్మానం చేసి మత్స్య శాఖకు పంపారు. దీని కొరకు 18.06.2020 న గ్రామ పంచాయతీ నిధుల నుండి రూ.1,535 లు నక్కపల్లి, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కు చెల్లించారు. దీనిపై మత్స్యశాఖ, సంయుక్త సంచాలకులు, జిల్లా కలెక్టర్, ఆదేశాల మేరకు సూపరెండెంట్ ఇంజనీర్ (ఎస్.ఈ), నీటిపారుదల శాఖ కు పంపిన లేఖ లేఖ నెం. 777/బి/2020 ద్వారా గ్రామ పంచాయితీకి చేపల పెంపకం కొరకు చెరువు గుప్త హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. గతంలో చేసిన పిర్యాదుల పై జిల్లా అధికారులు స్పందించి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా, సంబంధిత అధికారులు స్పందించకుండా బొలిశెట్టితో కుమ్మక్కై అతనిపై ఎటువంటి చర్యలనూ తీసుకోలేదు.

దీనితో మరింత బరితెగించిన బొలిశెట్టి 2020-2021, 2021-2022 రెండు సంవత్సరాలకు రూ 3,72,000 లకు ఎలమంచిలికి చెందిన ఆళ్ల శ్రీనివాసరావుకు ఇవ్వగా, ఇతడు తిరిగి యస్.రాయవరం గ్రామస్తుడు అడ్డూరి రమణకు  ఇచ్చాడు. ఇతడు మొదటి సంవత్సరంనకు రూ. 1,86,000 లు తీసుకొని తన జేబులో వేసుకున్నాడు. దీనికి అతడు మత్స్యశాఖ ద్వారా కాకుండా బయట చేప పిల్లలను, మేత వేయడం జరిగింది. దీని కొరకు ఈనాటికీ ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి 2021 ఆర్థిక సంవత్సరం పూర్తి అయినా జమ చేయకుండా స్వాహా చేసాడు. ఇప్పుడు ఈ ఏడాదికి మిగిలిన సొమ్ము రూ. 1,86,000 వసూలు చేసుకొని, గతంలో విధంగానే జేబులో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఈ చెరువు అభివృద్ధికి ప్రపంచ బ్యాంక్ నిధులు ఒక కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగి, టెండర్ ప్రక్రియ పూర్తి అయి, కాంట్రాక్టర్ పనులు ప్రారంభించ డానికి సిద్ధంగా ఉన్నాడు. ఇతడు ఇవే కాకుండా శివాలయం దేవాదాయశాఖ అద్వర్యంలో ఉన్నా కూడా, దేవాదాయశాఖ అధికారులు ఈ భూములుకు వేలం వేయవలసి ఉన్నా, ఆ భూములు తన అనుచరులకు కట్ట బెట్టడం, ఉండి లో నగదు వారు సీల్ వేసి, జమా ఖర్చులు నిర్వహించాల్సి ఉండగా, అధికారులతో కుమ్మక్కు అయి, లెక్కా పత్రం లేకుండా దోచేస్తున్నారు. నూకాంబికా దేవాలయం చెందిన భూములపై వచ్చిన సొమ్ము జేబులో వేసుకుంటూ ప్రభుత్వానికి, గ్రామస్తులకు గాని జవాబుదారీతనం లేకుండా, అడిగిన వారిపై తన అనుచరులతో దాడి చేయించడం ఇతని నైజం. పలు మార్లు ఫిర్యాదులు ఇచ్చినా, జిల్లా కలెక్టర్ అదేశాల ప్రకారం మత్యశాఖ జిల్లా అధికారులు వ్రాత పూర్వకముగా, పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చినా పట్టించు కోలేదు.

ఈ లీజు వల్ల పంచాయతీకి రూపాయి ఆదాయం రాక పోయినా, తిరిగి మత్స్యశాఖకు పంచాయతీయే సొమ్ములను చెల్లించాల్సి వచ్చింది. ఇప్పటికీ 2019-2020, 2020-2021, 2021-2021 సంవత్సరాలకు సంబందించిన లీజు సొమ్ముల బకాయిలను మత్స్య శాఖకు పంచాయతీ చెల్లించ వలసి ఉన్నది. సంబంధిత అధికారులు అందరూ బొలిశెట్టితో కుమ్మక్కై అతని నుంచి ఆర్థిక ప్రయోజనాలను ఆశించి అతనికి సహకరిస్తు వస్తున్నారు. ఈ నేపధ్యంలోనే స్వాహా సొమ్ములు మొత్తాన్ని వడ్ఢితో సహా వసూలు చేసి, బాద్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎస్.రాయవరం మండలం ఫోరం ఫర్ ఆర్టీఐ కన్వినర్ సోమిరెడ్డి రాజు తన ఫిర్యాదులో కోరారు. ఈ విషయంపై న్యాయ పోరాటానికి దిగి లోకాయుక్తలో సోమిరెడ్డి రాజు వేసిన కేసు ప్రస్తుతం విచారణలో ఉన్నది. ఈ విషయం అటుంచితే శాఖాపరమైన విచారణ నేడు ప్రారంభం కానున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *