* “దిశ” పై అపోహలు వద్దు
* “దిశ” వ్యక్తిగతాన్ని దొంగిలించదు
* “దిశ”తో పోలీస్ వ్యవస్థ ఓ రక్షణ కవచం
* ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వెల్లడి

శంఖవరం, జూలై 21, (జనాసవార్త) :
——————————————————
హిళలకు వారి దైనందిన జీవితంలో సామాజిక భద్రత, ప్రభుత్వ రక్షణ లేకుంటే యావత్ ప్రపంచానికే అరిష్టమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ స్పష్టం చేసారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మహిళల భద్రత, రక్షణ కోసం దిశ చట్టం, దిశ అనువర్తనం రూపకల్పన, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, మహిళా పోలీసుల సంస్థాగత వ్యవస్థను సమగ్రంగా అందుబాటులోకి తెచ్చారని ఎమ్మెల్యే ప్రసాద్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండల కేంద్రమైన శంఖవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ప్రజా కల్యాణ మండపంలో దిశ అనువర్తనం వినియోగంపై స్థానిక పంచాయితీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేక అవగాహనా సదస్సును బుధవారం ఉదయం 11.30 గంటలకు నిర్వహించారు. శంఖవరం పంచాయితీ ఉప సర్పంచ్ చింతంనీడి కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే మహిళలను, గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణా రాష్ట్రంలో కొందరు మహిళలపై అకృత్యాలు జరిగిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాలికలు, మహిళల రక్షణకు ముందు చూపుతో కట్టు దిట్టమైన దిశ చట్టాన్ని రూపొందించిన జగన్ అదే మహిళల కోసం దిశ అనువర్తనాన్ని అమలులోకి తెచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఈ దిశ అనువర్తనంపై అపోహలు వద్దని, ఇది మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించదని, మీ వ్యక్తిగత గోప్యానికి, గౌరవానికీ ఏమాత్రం భంగం కలిగించదని, ఆపత్కాలంలో రక్షణ నిస్తుందని ఎమ్మెల్యే ప్రసాద్ వివరించారు. పూర్వం బలవంతపు బాల్య వివాహాలు స్థాయి నుంచి నేడు బాలికలు, మహిళలు స్థానికంగా, ప్రాంతీయంగా, రాష్ట్రీయంగా, దేశీయంగానే గాక విదేశాల్లో సైతం ఒంటరిగా చదువుకునే, ఉద్యోగం చేసుకుంటూ ప్రయోజకులు కావాలని అనుకుంటూ ఉన్నప్పుడు దానికి సమాంతరంగా వారికి భద్రత కూడా అవసరమని భావించి, వారికి హింస, ప్రమాదం సంభవించే అవకాశం ఉందని గ్రహించి, ఇటువంటి పరిస్థితుల్లో వారికి రక్షణ ముఖ్యమని ఆలోచించి “దిశ” మహిళా రక్షణ చట్టాన్ని తెచ్చిన ఘనుడు ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్యే వివరించారు. అలాగే బాలికలు, మహిళలు ఒంటరి సంచారం, ప్రయాణాల్లో పోలీస్ వ్యవస్థ రక్షణ కవచంలా ఉందన్న నమ్మకాన్ని కల్పించేందుకు, బాదితులకు ప్రమాద ఘటన స్థలానికి దగ్గర్లోని పోలీసులు తక్షణ సహకారాన్ని అందించేందుకు దిశ అనువర్తనాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ “దిశ” పురుషులకు కూడా ప్రమాదాల్లో ఉపయోగ పడుతుందని ఆయన వెల్లడించారు. దీనిని నిజంగా అవసరం వచ్చినపుడు మాత్రమే బాధ్యతగా వినియోగించు కోవాలని, ఆకతాయి తనంగా దుర్వినియోగం చేయకూడదని, అలా చేస్తే “నాన్నా పులి వచ్చే” అనే కధలోని చిన్న పిల్లాడిలా నష్టపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే హితవు పలికారు. బాలికలు, మహిళల భవిష్యత్తుకు ఖచ్చితంగా దిశ అనువర్తనం భద్రత నిస్తుందని, దీనిని భద్రంగా వినియోగించు కోవాలని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద దిశ అనువర్తనం గురించి ప్రజలకు వివరించిన తొలి ఏకైక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఒక్కరేనని అన్నవరం పోలీస్ ఎస్సై రవికుమార్ ప్రశంసించారు. ఆపదలో ఉన్నవారు ఈ అనువర్తనం ద్వారా అభ్యర్ధించిన 5 నుంచి 10 నిమిషాల లోపు పోలీసులు రక్షణ కల్పిస్తారు అన్నారు. దిశ అనువర్తనంలోని అన్ని విషయాలనూ ఆయన కూలంకషంగా సభికులకు వివరించారు. మహిళలు భద్రంగా ఉంటేనే సమాజం భద్రంగా ఉంటుందని, మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం బావుంటుందని ఎంపీడీవో జాగారపు రాంబాబు అన్నారు. ఎక్కడ మహిళలను గౌరవిస్తారో అక్కడ దేవతలు పూజలందు కుంటారనే ఆర్యోక్తిని ఆయన గుర్తు చేసారు. దిశ అనువర్తనంతో మొబైల్ ఫోన్ మన చేతుల్లో ఉంటే మన భద్రత కూడా మన చేతుల్లోనే ఉన్నట్టని మహిళా పోలీసు జిఎన్ఎస్.శిరీష అన్నారు. “దిశ” ప్రమాదంలో పురుషులకూ ఉపయోగ పడుతుందని, “దిశ” ను బాగా ప్రాచుర్యం లోనికి తేవాలని, ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో “దిశ”ను అమర్చు కోడంతో పాటు మిగతా వారితోనూ వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని శిరీష పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపతాహసిల్దార్ శ్రీనివాస్, సచివాలయాల కార్యదర్శులు సిహెచ్. శ్రీరామ చంద్రమూర్తి, శంకరాచార్యులు, సరమర్ల సత్య వెంకటేష్, వీఆర్వో టి.సీతారామ్, అన్నవరం దేవస్థానం పాలకవర్గం మాజీ సభ్యులు పర్వత రాజబాబు, శంఖవరం ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు కొండమూరి చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *