* వైఎస్సార్ కాపు నేస్తం బృహత్తర పధకం
* మధ్య వయస్సు మహిళలకు ఆర్ధిక చేయూత
* ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్

శంఖవరం, జూలై 22, (జనాసవార్త) :

వైయస్సార్‌ చేయూత” మాదిరిగానే “వైయస్సార్‌ కాపు నేస్తం” పధకం కూడా బృహత్తర పధకమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ అన్నారు. ఈ పధకంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 45-60 ఏళ్ల మధ్య వయస్సు కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాల్లోని అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ. 490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం నేడు అందించిందని ఆయన వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలోని మండల కేంద్రమైన శంఖవరంలోని మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో గురువారం కాపు నేస్తం పధకం రెండో (ఏడాది) విడత లబ్ది పంపిణీ సభలో మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ మధ్య వయస్కులు త్యాగ మూర్తులు, కుటుంబ బరువు భాద్యతలను మోస్తూ ఆదాయ ఆర్జన పనులకు వెళ్ళని వారై ఉంటారని, వీరి కుటుంబ సంక్షేమానికే ఈ కాపు నేస్తం అని ఆయన వివరించారు. ఏటా రూ.15,000 చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75,000 అందించే ప్రక్రియలో ఇది రెండో ఏడాది ఆర్థిక సాయం అన్నారు. ఈ ఆర్ధిక సహాయాన్ని పిల్లల చదువులు, కుటుంబ సంక్షేమానికీ సద్వినియోగం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ మొత్తాలను బ్యాంకుల పాత అప్పులకు జమకు వీలు కాకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఏ వివక్షకూ, అవినీతికీ తావు లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ప్రతి అర్హురాలికి మంచి జరగాలని, నిజమైన అర్హులు నష్ట పోకూడదని ఆయన చెప్పారు. అర్హత ఉన్న కాపు మహిళలు అందరూ కూడా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అన్ని సామాజిక వర్గాల్లానే కాపు మహిళలు కూడా ఆర్ధిక స్వావలంబనతో తమ కాళ్ల మీద నిబడాలనే సీఎం. జగన్ గొప్ప ఆలోచన నుంచి ఈ పథకం పుట్టిందని అన్నారు. ఏ నెలలో ఇస్తున్నారనేది ముందుగానే చెప్తూ, వారిలో భరోసాను కల్పిస్తూ ఉన్నందున ఆర్థిక ప్రణాళిక వేసుకొని వ్యాపారాలు చేసుకొని లబ్ది పొందాలని ఎమ్మెల్యే సూచించారు. మేనిఫెస్టోలో చెప్పక పోయినా ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’కు సీఎం జగన్ శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల వారికీ అన్ని పధకాల్లోనూ లబ్ది చేకూరుతోందని ఆయన వివరించారు. కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఉన్నారని, వరుసగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ వివరించారు. కాపు నేస్తం సొమ్ములను పిల్లల చదువులకు, దైనందిన జీవిత ఉన్నతికి సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖ అధికారి సూరిశెట్టి వెంకటరమణ అన్నారు. ఎంపీడీవో జాగారపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని 16 సచివాలయాల పరిధిలోని 219 మంది వైఎస్సార్ కాపు నేస్తం” మహిళా లబ్దిదారులకు రూ. 32,85,000 విలువగల బ్యాంక్ నమూనా చెక్ ను ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ పంపిణీ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *